Begin typing your search above and press return to search.

గాజాలో 5000కు చేరిన మృతులు... ఇప్పుడే వద్దంటున్న అమెరికా!

అవును... ఇజ్రాయేల్ పై హమాస్ ఉగ్రవాదులు జరిగిన దాడులకు ప్రతిగా ఇజ్రాయేల్ చెలరేగిపోతోంది. గాజాను అష్టదిగ్బంధనం చేసి గజ గజ లాడించేస్తుంది

By:  Tupaki Desk   |   25 Oct 2023 3:54 AM GMT
గాజాలో 5000కు చేరిన మృతులు... ఇప్పుడే వద్దంటున్న అమెరికా!
X

తమ శత్రువులు అంతా సుమారు కొన్ని దశాబ్ధాల పాటు గుర్తుపెట్టుకునే స్థాయిలో హమాస్ పై తమ తాడులు ఉంటాయని ఇజ్రాయేల్ ప్రధాని నెతన్యహూ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో హమాస్ ను అంతమొందించే వరకూ, వారి చేతిలో ఉన్న ఆఖరి బందీని విడిపించేవరకూ ఈ పోరాటం ఆగదని.. రాక్షసులతో పోరడుతున్నప్పుడు తాము తీసుకునే నిర్ణయాలు కాస్త కఠినంగానే ఉంటాయని ప్రకటించింది ఇజ్రాయేల్ సైన్యం. ఈ మాటలకు తగ్గట్లుగానే వారి చేతలూ ఉంటున్నాయి.

అవును... ఇజ్రాయేల్ పై హమాస్ ఉగ్రవాదులు జరిగిన దాడులకు ప్రతిగా ఇజ్రాయేల్ చెలరేగిపోతోంది. గాజాను అష్టదిగ్బంధనం చేసి గజ గజ లాడించేస్తుంది. ఇందులో భాగంగా... 48 గంటల్లో 720 లక్ష్యాలపై బాంబులు వేసింది. ఫలితంగా... సోమవారం ఒక్కరోజే 700 మందికిపైగా మరణించారని గాజా ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. హమాస్ ఉగ్రవాదులు తలదాచుకున్నారనే అనుమానం వచ్చినా, సమాచారం ఉన్నా.. రెండో ఆలోచన లేకుండా ఆ ప్రదేశంపై బాంబుల వర్షం కురిపించేస్తుంది.

ఇందులో భాగంగా సోమవారం 320 లక్ష్యాలపై దాడులు చేసిన ఇజ్రాయేల్ వైమానిక దళం... మంగళవారం ఆ డోస్ మరింత పెంచింది. అందులో భాగంగా గాజాలోని 400 లక్ష్యాలపై బాంబులను వేసింది. ఈ దాడుల్లో సోమవారం ఒక్కరోజే 700 మందికిపైగా మరణించారు. ఈ క్రమంలో మంగళవారం ఒకే భవనంలో 32 మంది చనిపోగా... అందులో ఒకే కుటుంబానికి చెందిన 13 మంది ఉన్నారు!

ఇదే క్రమంలో ఇజ్రాయెల్‌ దాడుల్లో మరణించిన 33 మందిని సోమవారం గాజా ఆసుపత్రికి సమీపంలోనే ఖననం చేయగా... అందులోనూ ఒకే కుటుంబానికి చెందిన 15 మంది ఉన్నారని అధికారులు చెబుతున్నారు. ఇక, ఈ యుద్ధంలో ఇప్పటిదాకా 5,000 మంది పాలస్తీనా వాసులు మరణించారని.. వారిలో 2,000 మంది చిన్నారులు, 1,100 మంది మహిళలు ఉన్నారని గాజా అధికారులు చెబుతున్నారు.

ఇదే సమయంలో ఇజ్రాయేల్ చేస్తున్న దాడుల్లో ఐక్యరాజ్య సమితి సిబ్బంది కూడా మరణించారని తెలుస్తుంది. ఇందులో భాగంగా... పాలస్తీనా శరణార్థుల కోసం పని చేస్తున్న తమ సిబ్బందిలో ఆరుగురు ఈ దాడుల్లో మరణించారని ఐరాస ఏజెన్సీ వెల్లడించింది. మొత్తంమీద... ఇజ్రాయెల్‌, హమాస్‌ యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇప్పటిదాకా తమ సిబ్బంది 35 మంది మృతి చెందారని తెలిపింది.

మరోపక్క గాజాలో నెలకొన్న ఆసుపత్రులు, ప్రజల ఆరోగ్య పరిస్థితులపై ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పందించింది. ఇందులో భాగంగా... గాజాలోని మూడింట రెండొంతుల ఆసుపత్రులు పని చేయడం లేదని వెల్లడించింది. 72 వైద్య సేవా కేంద్రాల్లో 46 పనిచేయడం లేదని, 35 ఆసుపత్రుల్లో 12 సేవలను అందించడం లేదని వివరించింది.

ఆ సంగతి అలా ఉంటే... బందీలను విడిపించే క్రమంలో త్వరలో గాజాపై భూతల దాడులకు ఇజ్రాయేల్ సైన్యం సిద్ధంగా ఉందని. సుమారు 3.60 లక్షల మంది సైనికులు గాజా సరిహద్దుల్లో పొంచి ఉన్నారని చెబుతున్నారు. ఈ సమయమంలో భూతల దాడులను ప్రస్తుతం వాయిదా వేయాలని ఇజ్రాయేల్ కు అమెరికా సూచించింది.

దీనివల్ల బందీలను విడిపించేందుకు చర్చించడానికి తమకు మరింత సమయం లభిస్తుందని పేర్కొంది. యుద్ధం ఆపడం వల్ల హమాస్ కే మేలు జరిగే ప్రమాదం ఉందన్ని ఇప్పటికే చెప్పిన అమెరికా... వైమానిక దాడులు ఆపొద్దు కానీ... భూతల దాడులు మాత్రం ఇప్పుడే మొదలుపెట్టొద్దని మాత్రం చెబుతుంది. మరి అమెరికా మాట విని ఇజ్రాయేల్ సైన్యం ఆగుతుందా.. లేక, ముందుకు కదులుతుందా అనేది వేచి చూడాలి!