టీడీపీపై మీసం మెలేస్తున్న 'గీత'
ఇలాంటి కీలకమైన నియోజకవర్గాల్లో విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గం ప్రధానంగా అందరి దృష్టినీ ఆకర్షించింది.
By: Tupaki Desk | 29 April 2024 11:30 PM GMTకీలకమైన ఎన్నికల సమయంలో పలు నియోజకవర్గాల్లో ప్రధాన ప్రతిపక్షం టీడీపీకి సొంత నేతలే ఎదురు తిరుగుతున్నారు. ఎవరో వచ్చి పార్టీని ఓడించాల్సిన అవసరం లేదన్నట్టుగా.. సొంత పార్టీ నాయకులే.. వ్యవహరిస్తున్నారు. ఇలాంటి కీలకమైన నియోజకవర్గాల్లో విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గం ప్రధానంగా అందరి దృష్టినీ ఆకర్షించింది. ఇక్కడ నుంచి కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నాయకుడు.. పూసపాటి అశోక్ గజపతి రాజు కుమార్తె.. అదితి గజపతి రాజు బరిలో ఉన్నారు. ఆమె గత ఎన్నికల్లోనూ ఇక్కడ నుంచి పోటీ చేసి ఓడిపోయారు.
దీంతో ఈ దఫా కుమార్తెను గెలిపించుకునేందుకు అశోక్ గజపతి రాజు శక్తి వంచనలేకుండా కృషి చేస్తున్నారు. కానీ, ఇక్కడే ప్రధాన అడ్డంకి.. ఎదురైంది. టీడీపీకి కీలక నాయకురాలిగా ఉన్న మాజీ ఎమ్మెల్సీ మీసాల గీత.. ఇక్కడ టికెట్ ఆశించారు. అయితే.. పలు కారణాలతో చంద్రబాబు ఆమెకు టికెట్ ఇవ్వలేదు. దీంతో మారు మాటాడకుండా ఆమె ఇండిపెండెంట్‌గా దిగిపోయారు. నామినేషన్ వేసేశారు. బలమైన సామాజిక వర్గం.. పైగా గంటా శ్రీనివాసరావు వంటివారి అనుచరురాలిగా గుర్తింపు ఉండడంతో ఆమె ఓట్ల చీలిక ఖాయమని బావించిన టీడీపీ వెంటనే రంగంలోకి దిగింది.
రెండునుంచి నాలుగు దఫాలుగా మీసాల గీతతో చర్చలు జరిపారు. ఎమ్మెల్సీ ఇస్తామన్నారు. అదితికి సాయం చేయాలని .. గెలిపించాలని కోరారు. ఆమె మీసాల గీత పట్టు సడలించలేదు. నేరుగా అశోక్ గజపతిరాజు వచ్చి.. తనకు హామీ ఇస్తే.. తప్ప తాను నామినేషన్ ఉపసంహరించేది లేదన్నారు. అయితే.. గతంలో ఉన్న రాజకీయ విభేదాల కారణంగా.. అశోక్ గజపతి రాజు ఆ పనితాను చేయనని, ఎవరినీ తాను బ్రతిమాలనని తేల్చి చెప్పారు. దీంతో మీసాల గీత నామినేషన్ కొనసాగించారు. ఇక, నామినేషన్ల ఉపసంహరణ గడువు తీరే వరకు కూడా.. పార్టీ నుంచి ఆమెకు అనేక విన్నపాలు వచ్చాయి. అయినా.. ఆమె వినిపించుకోలేదు.
దీంతో విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గంలో మీసాల గీత ఇండిపెండెంట్‌గా పోటీ చేయడం ఖాయమైపోయింది. అయితే.. ఇది పెద్ద ఎదురు దెబ్బ కాదని అనుకున్నా.. అసలు కిటుకు ఇక్కడే ఉంది. ఎన్నికల సంఘం ఆమెకు `గాజు గ్లాసు` గుర్తును కేటాయించింది. అంతే.. ఇప్పుడు సమీకరణలు అనూహ్యంగా మారిపోతున్నాయి. జనసేన అభిమానులు పొరపాటునో.. గ్రహపాటునో.. గాజు గ్లాసు గుర్తుపై ఓట్లు గుద్దితే.. మీసాల గీత గెలుపు ఎలా ఉన్నా.. ఈ ఎన్నికలను చావోరేవుగానో భావిస్తున్న అదితి గజపతి రాజు ఓటమి ఖాయమని అంటున్నారు. మరి టీడీపీపై మీసం మెలేస్తున్న గీత ను చంద్రబాబు ఇప్పటికైనా అనునయిస్తారో లేదో చూడాలి.