Begin typing your search above and press return to search.

రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్... 'జనరల్' కష్టాలు ఇలా తీరబోతున్నాయి!

భారతదేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ వ్యవస్థ అయిన రైల్వేస్ లో ప్రతీ రోజు భారీ సంఖ్యలో ప్రయాణాలు చేస్తారనేది తెలిసిన విషయమే!

By:  Tupaki Desk   |   5 Dec 2024 4:15 AM GMT
రైలు ప్రయాణికులకు గుడ్  న్యూస్... జనరల్ కష్టాలు ఇలా తీరబోతున్నాయి!
X

భారతదేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ వ్యవస్థ అయిన రైల్వేస్ లో ప్రతీ రోజు భారీ సంఖ్యలో ప్రయాణాలు చేస్తారనేది తెలిసిన విషయమే! ఈ విషయంలో రిజర్వేషన్స్ ఉన్నవాళ్ల సంగతి కాసేపు పక్కనపెడితే.. ఎక్కువగా పేదలు ప్రయణించే, అత్యవసర పరిస్థితులుల్లో దాదాపు అందరూ ప్రయాణించే జనరల్ బోగీల్లో కష్టాల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

జనరల్ బోగీల్లో ప్రయాణికులు పడే అగచాట్ల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.. ఒకసారి అనుభవిస్తే తెలుస్తుందని చెబుతారు. అయినప్పటికీ వాటి సంఖ్య మాత్రం పెరగదు! పేదలంటే చిన్న చూపా.. లేక, ఆదాయం తక్కువనే ఆలోచనా అనే చర్చా తెరపైకి వస్తుంటుంది. ఈ సమయంలో దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది.

అవును... రైళ్లలో పేదలు ప్రయాణించే జనరల్ బోగీల విషయంలో దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా... ఎక్స్ ప్రెస్, సూపర్ ఫాస్ట్ రైళ్లలో జనరల్ బోగీల సంఖ్యను దశలవారీగా పెంచుతున్నట్లు తెలిపింది. రెండే జనరల్ కోచ్ లు ఉన్న రైళ్లలో ఆ సంఖ్యను నాలుగుకు చేరుస్తున్నట్లు పేర్కొంది. ఇది కచ్చితంగా గుడ్ న్యూస్ అనే చెప్పాలి!

ఇలా కొత్తగా ఏర్పాటు చేయబోతున్న జనరల్ బోగీలను ఎల్.హెచ్.బీ. పరిజ్ఞానంతో తయారు చేసినవని చెబుతున్నారు. పాత తరం ఐ.ఎస్..ఎఫ్. బోగీల్లో 90 సీట్లు ఉంటే.. ఎల్.హెచ్.బీ. బోగీల్లో సీట్ల సంఖ్య 100 ఉంటుంది. ఇలా వీటిలో ఎక్కువ మంది ప్రయాణించడానికి వీలు ఉండటంతో పాటు.. ప్రమాదాలు జరిగినప్పుడు తక్కువ నష్టం ఉంటుందని అంటున్నారు.

వాస్తవానికి ఏసీ, స్లీపర్ క్లాసుల్లో ఈ ఎల్.హెచ్.బీ. బోగీలను ప్రవేశపెడుతున్నారు. ఈ క్రమంలో తాజాగా జనరల్ క్లాస్ లోనూ ఎల్.హెచ్.బీ. కోచ్ లు అందుబాటులోకి తేనున్నారు. ఇప్పటికే జోన్ పరిధిలో 19 ఎక్స్ ప్రెస్ రాళ్లకు 66 ఎల్.హెచ్.బీ. కోచ్ లను ప్రవేశపెట్టగా.. మరో 21 రైళ్లకు 80 బోగీలు అందుబాటులోకి వస్తాయని అంటున్నారు!

ఈ సందర్భంగా స్పందించిన దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ మాట్లాడుతూ... రైల్వే శాఖ దేశవ్యాప్తంగా 370 రైళ్లలో అదనంగా ఎల్.హెచ్.బీ. బోగీలను దశలవారీగా జత చేస్తోందని తెలిపారు! ఫలితంగా.. ప్రతీ రోజు అదనంగా సుమారు 70 వేల మంది ప్రయాణికులు జనరల్ బోగీల్లో ప్రయాణించేందుకు ఆస్కారం ఉంటుందని తెలిపారు.