Begin typing your search above and press return to search.

టార్గెట్ బీజేపీ.. గోల్ జీహెచ్ఎంసీ.. సీఎం రేవంత్ వ్యూహం!

ఇక సీఎం రేవంత్ రెడ్డి పాలనకు ఏడాది పూర్తవుతున్న సందర్భంగా విమర్శలు, ప్రతివిమర్శలు పెద్దఎత్తున సాగుతున్నాయి.

By:  Tupaki Desk   |   5 Dec 2024 2:30 AM GMT
టార్గెట్ బీజేపీ.. గోల్ జీహెచ్ఎంసీ.. సీఎం రేవంత్ వ్యూహం!
X

తెలంగాణలో ప్రస్తుతం ఆసక్తికర రాజకీయం నడుస్తోంది. మూడు పార్టీలు అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీల మధ్య రాజకీయ రంజుగా సాగుతోంది. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ బలంగా ఉండగా.. మరో ప్రతిపక్షం బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది. ఆ పార్టీ నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి పాలనకు ఏడాది పూర్తవుతున్న సందర్భంగా విమర్శలు, ప్రతివిమర్శలు పెద్దఎత్తున సాగుతున్నాయి.

బీఆర్ఎస్ ను వదిలి..

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏడాది పాలన సందర్భంగా ప్రస్తుతం విజయోత్సవాలు నిర్వహిస్తున్నారు. రోజుకో కార్యక్రమం చొప్పున మొదలుపెట్టి ఈ నెల 9వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఇదే సమయంలో రోజూ బహిరంగ సభలలో పాల్గొంటున్నారు. అయితే, ఇలాంటి సభలు హైదరాబాద్ లో జరిగితే ప్రధానంగా బీజేపీనే టార్గెట్ చేస్తున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని గుజారాతీ గులాం అని.. లక్షన్నర కోట్లు నిధులు తెస్తే సన్మానం చేస్తామని.. లేదంటే గుజరాత్ కు వలస వెళ్లాలని.. ఇలా తీవ్ర పదజాలంతో విరుచుకుపడుతున్నారు. వాస్తవానికి ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ లో కేసీఆర్, హరీశ్ రావు, కేటీఆర్ వంటి నాయకులు ఉండగా సీఎం రేవంత్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని టార్గెట్ చేస్తుండడం ఎందుకు? అనే ప్రశ్న వస్తోంది.

జీహెచ్ఎంసీ ఎన్నికల కోసం

తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్దదైన కార్పొరేషన్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ). దీనికి వచ్చే ఏడాదిలో ఎన్నికలు జరగనున్నాయి. అప్పటికి రేవంత్ ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకుంటుంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీగా జీహెచ్ఎంసీలో గెలవడం కాంగ్రెస్ కు, రేవంత్ కు అత్యంత కీలకం.

మేయర్ గిరీ కొట్టాల్సిందే..

అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ లో కాంగ్రెస్ కు ఒక్కటే (ఉప ఎన్నికలో కంటోన్మెంట్) సీటు వచ్చింది. దీంతో రాజధానిలో ప్రాతినిధ్యం లేని ప్రభుత్వంగా హేళన ఎదుర్కొంది. ఇక దేశంలో కీలక నగరమైన హైదరాబాద్ లో, రాష్ట్ర రాజధాని నుంచి కేబినెట్ లో మంత్రి కూడా లేరు. ఇలాంటి సమయంలో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సత్తా చాటడం కాంగ్రెస్ కు ప్రతిష్ఠాత్మకం.

రసవత్తర ముక్కోణం

జీహెచ్ఎంసీలో బీజేపీకి గట్టి పట్టుంది. ప్రతిపక్ష బీఆర్ఎస్ కు ఎమ్మెల్యేల బలం ఉంది. 2021లో జరిగిన ఎన్నికల్లో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ను బీజేపీ మూడు చెరువుల నీళ్లు తాగించింది. చావుతప్పి కన్ను లొట్టబోయినట్లుగా బీఆర్ఎస్ జీహెచ్ఎంసీని గెలుచుకుంది. ఇక ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉండగా.. ముక్కోణపు పోటీని తట్టుకుని జీహెచ్ఎంసీని చేజిక్కించుకోవడం చాలా కష్టమే.

బీఆర్ఎస్ ను బలహీనం చేస్తారా?

బీఆర్ఎస్ నుంచి ఇప్పటికే దానం నాగేందర్ వంటి కీలక ఎమ్మెల్యేను కాంగ్రెస్ లో చేర్చుకున్నారు. రాజేంద్రనగర్, శేరిలింగపల్లి ఎమ్మెల్యేలు ప్రకాశ్ గౌడ్, అరికెపూడి గాంధీ కూడా హస్తం గూటికి చేరారు. మరికొందరు హైదరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలనూ లాగే ఆలోచనలో చేసినా ప్రస్తుతానికి నిలిచిపోయింది. అయితే, జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో వచ్చే ఏడాదిలో కొందరు ఎమ్మెల్యేలను అయినా కాంగ్రెస్ లో చేర్చుకునే చాన్సుంది.

కొసమెరుపు: బీఆర్ఎస్ కు చెందిన మాజీ మంత్రి, టీడీపీ నేపథ్యం నుంచి వచ్చిన ఓ నాయకుడు ఇటీవల వ్యక్తిగత పనిమీద సీఎం రేవంత్ ను కలిశారు. దీంతో పలు ఊహాగానాలు వచ్చాయి. బహుశా ఆయన జంపింగ్ జాబితాలో ఉన్నారా?