Begin typing your search above and press return to search.

రీల్స్ చూస్తూ పని చేయట్లేదు.. జీహెచ్ఎంసీలో వైఫై బంద్!

ఆఫీసుల్లో పనిని సైతం పక్కన పెట్టేస్తున్నారు. ఈ అంశాన్ని గుర్తించిన జీహెచ్ఎంసీలో వైఫై సేవల్ని ఉద్యోగులకు నిలిపేశారు.

By:  Tupaki Desk   |   7 March 2025 11:36 AM IST
రీల్స్ చూస్తూ పని చేయట్లేదు.. జీహెచ్ఎంసీలో వైఫై బంద్!
X

ఇప్పుడు నడుస్తున్నదంతా సోషల్ మీడియా కాలం. కాస్త టైం దొరికితే చాలు.. మొబైల్ ఫోన్ చూడటం అలవాటుగా మారింది. పని ఉన్నా లేకున్నా.. యూట్యూబ్ .. సోషల్ మీడియాలో పోస్టులు.. రీల్స్ తో తెగ బిజీబిజీగా ఉంటున్నారు. ఆఫీసుల్లో పనిని సైతం పక్కన పెట్టేస్తున్నారు. ఈ అంశాన్ని గుర్తించిన జీహెచ్ఎంసీలో వైఫై సేవల్ని ఉద్యోగులకు నిలిపేశారు.

మొబైల్ ఫోన్లు చూసుకుంటూ.. వీడియోలు.. రీల్స్ మీద ఉన్న ఆసక్తి పని మీద లేకపోవటాన్ని గుర్తించిన జీహెచ్ఎంసీ కమిషన్ ఇలంబరిది కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. ఐటీ విభాగం అధికారుల్ని పిలిపించి వైఫై పాస్ వర్డ్ మార్చాలని ఆదేశించారు. దీంతో.. ఒక్కసారిగా వైఫై సేవలు ఉద్యోగులకు బంద్ అయ్యాయి. అప్పటివరకు వైఫై తో పని చేయకుండా రీల్స్ తో గడిపిన వారికి ఉక్కిరిబిక్కిరి అయినట్లుగా మారింది.

కొత్త పాస్ వర్డ్ చెప్పాలంటే జీహెచ్ఎంసీలోని పలు విభాగాల ఉద్యోగులు ఐటీ విభాగం వారికి ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్న పరిస్థితి. కమిషన్ తాజా ఆదేశాల నేపథ్యంలో ఎవరికీ కొత్త పాస్ వర్డ్ చెప్పేది లేదని వారు స్పష్టం చేస్తున్నారు. ఇలాంటి తీరునే రాష్ట్ర సచివాలయంతో పాటు.. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ముఖ్య ప్రభుత్వ కార్యాలయాల్లోనూ అమలు చేయాలని చెబుతున్నారు. వైఫై అందుబాటులో ఉండటంతో ఎవరూ పని మీద ఫోకస్ చేయటం లేదని.. రీల్స్.. వీడియోల్ని చూసుకుంటూ కాలం గడుపుతున్నట్లుగా వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మరి..తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.