జీహెచ్ఎంసీలో ప్లకార్డుల రగడ.. కొట్టుకున్న కార్పొరేటర్లు!
తాజాగా కూడా.. కౌన్సిల్ రణరంగాన్నే తలపిం చింది. నగరంలో వర్ష ప్రభావంతో మునుగుతున్న పరిస్థితిని ప్రస్తావిస్తూ.. కొందరు ప్లకార్డు లు ప్రదర్శించారు.
By: Tupaki Desk | 6 July 2024 10:44 AM GMTతెలంగాణ నగర పాలన వ్యవస్థకు ఆదర్శంగా ఉండాల్సిన.. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్.. వివాదాలకు, విధ్వంసాలకు కేంద్రంగా మారిపోయింది. గత ఏడాది జరిగిన ఎన్నికల తర్వాత.. పరిస్థితులు అదుపు తప్పాయి. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ కార్పొరేటర్ల మధ్య ఆధిపత్య పోరు పెరిగిపోయింది. దీంతో కౌన్సిల్ సమావేశాలు రగడకు దారి తీస్తున్నాయి. తాజాగా కూడా.. కౌన్సిల్ రణరంగాన్నే తలపించింది. నగరంలో వర్ష ప్రభావంతో మునుగుతున్న పరిస్థితిని ప్రస్తావిస్తూ.. కొందరు ప్లకార్డు లు ప్రదర్శించారు.
వీటిని అడ్డుకునేందుకు కాంగ్రెస్ పక్ష సభ్యులు ప్రయత్నించడంతో వివాదంగా మారి.. ముష్ఠిఘాతాలకు దారితీసింది. శనివారం ఉదయం కౌన్సిల్ ప్రారంభమైన సమయం నుంచే అరుపులు, కేకలతో కౌన్సిల్ హాల్ వేడెక్కిపోయింది. ఎంఐఎం మెంబర్లు ప్లకార్డులు ప్రదర్శించడాన్ని కాంగ్రెస్ సభ్యులు తప్పుపట్టారు. ఇలా మొదలైన వివాదం.. తీవ్రస్థాయికి చేరింది. ఏకంగా ఈ గొడవ.. కొట్టుకునే స్థాయికి వెళ్లింది. ఎంఐఎం.. బీజేపీ సభ్యులు, కాంగ్రెస్ సభ్యులు ఒకరిపై ఒకరు పడి కొట్టుకున్నారు.
ఈ రగడ సాగుతున్న సమయంలో పదే పదే మేయర్ విజయలక్ష్మి హెచ్చరించినా.. ఎవరూ వెనక్కి తగ్గలేదు. దీంతో సమావేశాన్ని ఆమె వాయిదా వేసి వెళ్లిపోయారు. ఎంఐఎం సభ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ.. బీజేపీ కార్పొరేటర్లు ఆందోళనకు దిగారు. మరోవైపు తమ కార్పొరేటర్లపై దాడి చేసిన ఎంఐఎం కార్పొరేటర్లు తక్షణమే క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ సహా బీజేపీ సభ్యులు నినాదాలతో హోరెత్తించారు.
మరికొందరు సభ్యులు.. పోడియం ముందు కూర్చుని నిరసనకు దిగారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు మార్షల్స్ ను మోహరించినా.. ఫలితం కనిపించలేదు. అటు కాంగ్రెస్.. ఇటు బీఆర్ఎస్ కార్పొరేటర్లు.. బీజేపీ సభ్యులు ఒక్కసారిగా రెచ్చిపోవడం జీహెచ్ ఎంసీ కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారిపోయింది.