కశ్మీరీ పండిట్లపై గులాం నబీ ఆజాద్ సంచలన వ్యాఖ్యలు!
అయితే భారత్ లో ముస్లింలెవరూ బయట నుంచి వచ్చినవారు కాదని ఆజాద్ స్పష్టం చేశారు.
By: Tupaki Desk | 18 Aug 2023 5:31 AM GMTకశ్మీరీ పండిట్లపై కాంగ్రెస్ పార్టీ మాజీ నేత, కేంద్ర మాజీ మంత్రి, డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ అధినేత గులాం నబీ ఆజాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత దేశంలో ఉన్న అత్యధిక ముస్లింలు హిందూ మతం నుంచి వచ్చి ఇస్లాం స్వీకరించినవారేనని హాట్ కామెంట్స్ చేశారు. ఇందుకు నిదర్శనం కశ్మీర్ లోయలోని కశ్మీర్ పండిట్‌లే అని వ్యాఖ్యానించారు. ఇస్లాం మతం 1,500 ఏళ్ల క్రితమే ఉందన్నారు. అయితే హిందూ మతం ఇస్లాం కంటే చాలా పురాతనమైందని వెల్లడించారు.
కశ్మీర్ లోని ధోడా జిల్లాలో జరిగిన సమావేశంలో గులాం నబీ ఆజాద్ ఈ మేరకు మీడియాతో మాట్లాడారు. రాజకీయాలకు మతాన్ని అడ్డుపెట్టుకునే వారంతా బలహీనులేనని అన్నారు. ఇటీవల ఒక బీజేపీ నాయకుడు మాట్లాడుతూ భారత్ లో ముస్లింలంతా బయట నుంచి వచ్చిన వారేనని వ్యాఖ్యానించారన్నారు. అయితే భారత్ లో ముస్లింలెవరూ బయట నుంచి వచ్చినవారు కాదని ఆజాద్ స్పష్టం చేశారు.
భారత్ లో బయట నుండి వచ్చిన ముస్లింలు 10 నుంచి 20 శాతం మాత్రమే ఉంటారని ఆజాద్ తెలిపారు. వారిలో కొంతమంది మొగల్ సైన్యంలో పనిచేశారన్నారు. మిగిలిన వారంతా హిందూ మతం నుండి వచ్చి ఇస్లాం మతాన్ని స్వీకరించిన వారేనని తేల్చిచెప్పారు. దీనికి ఉదాహరణ కశ్మీర్లోనే చూడవచ్చన్నారు. 600 ఏళ్ల క్రితం కశ్మీర్లో ఉన్న ముస్లింలంతా ఎవరని.. వారందరూ కశ్మీరీ పండిట్లేనని చెప్పారు. వారంతా హిందూ మతం నుంచి ఇస్లాం మతాన్ని స్వీకరించినవారేనని వెల్లడించారు.
హిందువుల ఆచారం ప్రకారం.. వారి మరణానంతరం దహన సంస్కారాలు నిర్వహించాక అస్తికలను నీటిలో కలుపుతారని ఆజాద్ గుర్తు చేశారు. తాము ఆ నీటిని తాగుతున్నామన్నారు. నీళ్లు తాగేటప్పుడు అందులో కలిపిన అస్తికల బూడిదను ఎవ్వరం చూడమని గుర్తు చేశారు. అలాగే ముస్లింల మరణానంతరం వారి శరీరం కూడా ఇలాగే భరతమాత ఒడిలో కలిసిపోతుందని వ్యాఖ్యానించారు.
హిందువులైనా ముస్లింలైనా అందరం సమయం వచ్చినప్పుడు భూమిలో కలిసిపోవాల్సిందేనన్నారు. అందులో తేడా ఏమీ ఉండదని పేర్కొన్నారు. హిందూ, ముస్లిం పేర్లను బట్టి రాజకీయాలు చేయకూడదని సూచించారు. మతాన్ని అడ్డుపెట్టుకుని ఓటు బ్యాంక్ రాజకీయాలు చేయడం సరికాదన్నారు. అలాంటి వారు తన దృష్టిలో బలహీనులని పేర్కొన్నారు.
కాగా భారత రాజకీయాల్లో గులాం నబీ ఆజాద్ ది సుదీర్ఘ పాత్ర. ఆయన చాలాకాలంపాటు ఎంపీగా, కేంద్ర మంత్రిగా పనిచేశారు. కాంగ్రెస్ పార్టీలో ముఖ్య బాధ్యతలు నిర్వర్తించారు. జమ్ముకశ్మీర్ కు ముఖ్యమంత్రిగానూ పనిచేశారు. రెండేళ్ల క్రితం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి సొంత పార్టీని ఏర్పాటు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో హిందూ, ముస్లింలపై గులాం నబీ ఆజాద్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.