గాల్లో పసి ప్రాణాలు.. ఒక్కసారి కరెంట్ ఆగితే ఘోరమే!
సుమారు రెండు వారాలకు పైగా కొనసాగుతున్న ఈ భీకర దాడుల కారణంగా పాలస్తీనాలో చిన్నారులు, మహిళలతో పాటు సామాన్య పౌరులు మొత్తంగా వేల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు.
By: Tupaki Desk | 24 Oct 2023 3:59 AM GMTప్రస్తుతం గాజా ఆసుపత్రుల్లో వందల సంఖ్యలో పసిపిల్లల ప్రణాల్లో గాల్లో ఉన్నాయి! ఒక్క నిమిషం విద్యుత్ అంతరాయం ఏర్పడితే.. ప్రస్తుతం అందుకు ఆదారపడుతున్న జనరేటర్ ఆగితే.. జరిగే పరిణామం తలచుకుంటె ఒళ్లు గగ్గురుపొడుస్తుందనే చెప్పాలి! కారణం... గాజా ఆసుపత్రుల్లో వందకు పైగా పసిప్రాణాలు ఎలక్ట్రిక్ ఇంక్యుబేటర్లలో ఉన్నాయి! ఈ సమయంలో ఒక్క సెకన్ జనరేటర్ తిరగడం ఆగితే... వందకు పైగా ఉన్న ఈ పసివాళ్లకు వందేళ్లూ నిండిపోయే ప్రమాదం ఉంది!
అవును... ఇజ్రాయెల్ పై హమాస్ మిలిటెంట్ల మెరుపు దాడికి రివేంజ్ ఒక రేంజ్ లో జరుగుతుంది! హమాస్ ఉగ్రవాదుల దాడికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ సైన్యం గాజా నగరంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతోంది. ఒకవైపు విద్యుత్, ఆహారం, ఇందనం వంటివాటిని గాజాకు అందకుండా నిలిపేసి అష్టదిగ్బంధనం చేసిన ఇజ్రాయేల్ ఆ ప్రాంతాన్ని గజగజ లాడించేస్తుంది. దీంతో గాజాలో ప్రజలు ప్రత్యక్ష నరకం చూసేస్తున్నారు.
సుమారు రెండు వారాలకు పైగా కొనసాగుతున్న ఈ భీకర దాడుల కారణంగా పాలస్తీనాలో చిన్నారులు, మహిళలతో పాటు సామాన్య పౌరులు మొత్తంగా వేల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. ఇందులో భాగంగా... ఈ నెల 7 నుంచి ఇప్పటివరకు ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 5,087 మంది పాలస్తీనా పౌరులు మృతిచెందినట్టు గాజా అధికారులు వెల్లడించారు. వీరిలో 2,055 మంది చిన్నారులు ఉన్నారన్నారు.
దీంతో గాజా స్ట్రిప్ లో పరిస్థితులు అత్యంత దయనీయంగా తయారయ్యాయి. విరామం లేకుండా సాగుతున్న ఇజ్రాయేల్ వైమానిక దాడుల నేపథ్యంలో... ప్రజలు బిక్కి బిక్కు మంటున్న పరిస్థితి. మరోపక్క అక్కడి ఆస్పత్రుల్లోని ఇంక్యుబేటర్లలో ఉన్న శిశువుల విషయంలో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతుంది. ఇందులో భాగంగా... ఇంక్యుబేటర్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోతే నిమిషాల్లో వ్యవధిలోనే అనేకమంది శిశువులు ప్రాణాలు కోల్పోతారని ఆవేదన చెందుతున్నారు.
ప్రస్తుతం గాజాస్ట్రిప్ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ ఇంక్యుబేటర్లలో మొత్తంగా 130 మంది శిశువులు ఉన్నట్లు అక్కడి ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. ముఖ్యంగా గాజాలో 13 ప్రభుత్వ ఆస్పత్రుల్లో అతి పెద్దదైన అల్ షిఫా ఆస్పత్రిలో సైతం ఇంధనం ఆల్ మోస్ట్ చివరి దశకు వచ్చేసిందని ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఇలా లాస్ట్ కి వచ్చేసిన ఇందనాన్ని... ఇంక్యుబేటర్లు సహా అత్యంత అవసరమైన వాటికి మాత్రమే వినియోగిస్తున్నామని తెలిపారు.
అయితే ఆల్ మోస్ట్ అయిపోయే దశకు వచ్చేసిన పరిస్థితుల్లో... ఇక మిగిలినది ఎంత సమయం పాటు వస్తుందో తెలియడంలేదని వైద్యులు ఆందోళన వ్యక్తంచేశారు. ఈ పరిస్థితుల్లో ఒకవేళ విద్యుత్ సరఫరా నిలిచిపోతే.. ఇంక్యుబేటర్లలో ఉన్న సగానికిపైగా చిన్నారులను కాపాడుకోలేమని తెలిపారు. దీంతో... ఇంధన సాయం కోసం యావత్ ప్రపంచానికి విజ్ఞప్తి చేస్తున్నామని చెబుతున్నారు.
ఇదే సమయంలో అత్యంత సంక్లిష్టమైన ఈ విభాగానికి అవసరమైన వైద్య సామగ్రిని పంపించాలని ప్రపంచ దేశాలకు విజ్ఞప్తి చేస్తున్నారు. మరోపక్క గత 24 గంటల్లో గాజాలోని 320 లక్ష్యాలపై దాడి చేసినట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) వెల్లడించింది.