Begin typing your search above and press return to search.

చేతికి స్లిప్పులు ఇచ్చి షాపులో మార్చుకోవాలట.. ఓటర్లకు హవాలా రేంజ్ లో గాలం

గ్రేటర్ పరిధిలోని పలు నియోజకవర్గాల్లో ఈసారి ఓట్లకు నోట్లు పంచే పలు పార్టీ అభ్యర్థులు హవాలా రేంజ్ లో ఓటర్లకు పంపిణీ చేస్తుండటం విశేషం.

By:  Tupaki Desk   |   29 Nov 2023 3:30 PM GMT
చేతికి స్లిప్పులు ఇచ్చి షాపులో మార్చుకోవాలట.. ఓటర్లకు హవాలా రేంజ్ లో గాలం
X

మారుతున్న కాలానికి అనుగుణంగా అన్ని రంగాల్లోనూ మార్పులు వస్తుంటాయి. ఎన్నికల వేళ.. ఓటర్లకు పంచే డబ్బులకు సంబంధించి కూడా సరికొత్త మార్గాల్ని అన్వేషిస్తున్నారు నాయకులు. అధికారల తనిఖీలు ఎక్కువగా ఉండటం.. ప్రత్యర్థుల డేగ కన్ను నుంచి తప్పించుకొని.. తాము అనుకున్నట్లుగా డబ్బులు పంపకాలు చేయటం సవాలుగా మారిన నేపథ్యంలో.. సరికొత్త దందా తెర మీదకు వచ్చింది. గ్రేటర్ పరిధిలోని పలు నియోజకవర్గాల్లో ఈసారి ఓట్లకు నోట్లు పంచే పలు పార్టీ అభ్యర్థులు హవాలా రేంజ్ లో ఓటర్లకు పంపిణీ చేస్తుండటం విశేషం.

తనిఖీలు ఎక్కువగా ఉన్న వేళ.. నోట్ల కట్టల్ని తరలించటం.. పంచటం పెద్ద సమస్యగా మారిన నేపథ్యంలో కొత్త పద్దతికి తెర తీశారు. ఇందులో భాగంగా డివిజన్ల వారీగా వాట్సాప్ గ్రూపుల్ని ఏర్పాటు చేసి.. ముందు నుంచి వారికి పార్టీ కార్యక్రమాలకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు పోస్టు చేస్తున్నారు. దీని కోసం అదనపు సిబ్బందిని సమకూర్చుకున్న అభ్యర్థులు.. పోలింగ్ కు ముందుగా అసలు కథకు తెర తీశారు.

తమ నియోజకవర్గంలోని వివిధ డివిజన్లకు సంబంధించి కొన్ని షాపుల్ని.. రెస్టారెంట్లను.. హోటళ్లను ఎంపిక చేసుకోవటం.. ఒక చీటికి ఇచ్చి.. ఫలానా షాపు వద్దకు వెళితే.. చీటీలను డబ్బులుగా మార్చుకునే విధానానికి తెర తీశారు. ఒక రకంగా హవాలా పద్దతిని అమల్లోకి తెచ్చారన్న మాట. తమకు వచ్చిన స్లిప్పుల ఆధారంగా వారికి డబ్బులు ఇవ్వటం.. ఆస్లిప్పులతో సదరు నాయకుడికి లెక్క చెప్పటంతో మొత్తం కథ ముగుస్తుందని చెబుతున్నారు. దీనికిగాను షాపు యజమానులకు 2-3 శాతం కమిషన్ ను ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నారు. గుట్టుగా సాగటంతో పాటు.. దొరికిపోయే అవకాశాలు తక్కువగా ఉండటంతో పలువురు అభ్యర్థులు ఇదే పద్దతిని ఫాలో అవుతున్నట్లుగా చెబుతున్నారు.