కూటమి పార్టీలకు గ్లాసు దెబ్బ.. మామూలుగా లేదు!
ఇక, ఇప్పుడు కూటమి కట్టేలా కీలకంగా వ్యవహరించిన జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌కారణంగా బీజేపీ, టీడీపీలకు మరో కీలక సమస్య ఎదురైంది.
By: Tupaki Desk | 3 May 2024 5:56 AM GMTప్రస్తుతం ఏపీలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో విజయం దక్కించుకుని అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్న టీడీపీకి సొంత కూటమి పార్టీ.. జనసేన ఎన్నికల గుర్తే.. పెద్ద డ్యామేజీగా మారింది. ఒకవైపు..కూటమిలో లుకలుకలు ఇంకా సెగ పెడుతూనే ఉన్నాయి. ధైర్యంగా మేనిఫెస్టోను ప్రకటించుకునే పరిస్థితి లేకపోవడం.. దీనికి బీజేపీ మద్దతుపై ఇంకా శషభిషలు కొనసాగుతుండడంతో.. పార్టీ నేతలు.. మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకువెళ్లలేక పోతున్నారు.
ఇక, ఇప్పుడు కూటమి కట్టేలా కీలకంగా వ్యవహరించిన జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌కారణంగా బీజేపీ, టీడీపీలకు మరో కీలక సమస్య ఎదురైంది. జనసేన పార్టీ గుర్తింపు ఉన్న పార్టీ కాకపోవడంతో ఇతర పార్టీల మాదిరిగా.. ఆ పార్టీకి పర్మినెంట్ ఎన్నికల గుర్తు లేకుండా పోయింది. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా. గుర్తు కోసం పోరాడుకునే పని ఏర్పడుతోంది. ఈ క్రమంలో తాజా ఎన్నికల్లోనూ గాజు గ్లాసును దక్కించు కునేందుకు గత డిసెంబరు నుంచి ఈ పార్టీ పోరాటం చేసింది.
ఎట్టకేలకు గ్లాసు గుర్తును దక్కించుకున్నా.. అది ఆ పార్టీ పోటీ చేస్తున్న 21 అసెంబ్లీ, 2 పార్లమెంటు నియోజకవర్గాలకు మాత్రమే పరిమితం అయింది. దీనికి కారణం.. ముందు చూపు లేక పోవడం. కూటమిగా ముందుకు వెళ్తున్నప్పుడు.. కేవలం జనసేనకు మాత్రమే గుర్తు పరిమితం కాదు. ఆ గుర్తు.. మూడు పార్టీలపైనా ప్రభావం చూపిస్తుంది. అయితే.. ఇప్పుడు ఇక్కడే పెద్ద మైనస్ జరిగింది. స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో ఉన్న టీడీపీ రెబల్స్ ఎక్కువ మంది.. ఈ గుర్తును దక్కించుకున్నారు.
ఈ విషయంలో చేతులు కాలిన తర్వాత.. అన్నట్టుగా జనసేన మేల్కొంది. తమ గుర్తును వేరేవారికి కేటాయించవద్దని హైకోర్టులో పిటిషన్ వేసింది. అయితే.. అప్పటికే ఇంటి నుంచి ఓటు వేసే కార్యక్రమం రెడీ కావడం.. బ్యాలెట్ పత్రాలు కూడా ముద్ర ణ అయిపోవడంతో ఇలా చేయడ కుదరదని ఎన్నికల సంఘం తేల్చేసింది. అయితే.. జనసేనవ రకు మాత్రం కొంత రిలీఫ్ ఇచ్చింది. ఆ పార్టీ పోటీలో ఉన్న 21 అసెంబ్లీ, 2 పార్లమెంటు స్థానాల్లో మాత్రం గాజుగ్లాసును ఎవరికీ ఇవ్వబోమని తేల్చి చెప్పింది.
కానీ, మిగిలిన వాటిలో మాత్రం స్వతంత్రులకు ఇవ్వక తప్పదని తెలిపింది. దీనిపై మరోసారి సోమవారం విచారణ జరగనుంది. కానీ, మార్చే అవకాశం లేదు. ఎందుకంటే.. మరో వారం రోజుల్లోనే ఎన్నికలు ఉన్నాయి. అభ్యర్థులు కూడా ప్రచారం చేసుకుంటున్నారు. సో.. ఎలా చూసుకున్నా మార్పు చేయడం అయ్యే పనికాదు. దీంతో రెబల్స్‌గా రంగంలోకి దిగిన టీడీపీ నేతల ద్వార.. ఆ పార్టీకి.. బీజేపీ పోటీ చేస్తున్న చోట్ల గాజు గ్లాసు గుర్తు దక్కించుకున్న వారితో .. ఈ రెండు పార్టీలకు తలబొప్పి కట్టడం ఖాయమని అంటున్నారు పరిశీలకులు.