Begin typing your search above and press return to search.

అవినీతిలో మన ర్యాంక్ అదిరిపోయిందిగా?

2022లో భారత్ ర్యాంక్ 85గా ఉంటే.. 2023లో 93వ స్థానంలోకి దూసుకెళ్లింది. తాజాగా మరో అడుగు ముందుకు వేసి.. 96వ స్థానానికి చేరుకుంది.

By:  Tupaki Desk   |   12 Feb 2025 4:46 AM GMT
అవినీతిలో మన ర్యాంక్ అదిరిపోయిందిగా?
X

పాలకులు ఎవరున్నా.. మన దేశంలో అవినీతికి అడ్డుకట్ట వేయటం సాధ్యం కాదా? అవినీతి వ్యవస్థలో వేళ్లూరుకుపోవటమే కాదు.. అంతకంతకూ దాని వేళ్లు మరింత లోతుల్లోకి వెళ్లిపోతున్నాయా? అంటే అవుననే సమాధానం వస్తుంది. తాజాగా విడుదలైన ర్యాంకింగ్ సైతం ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోంది. ఇప్పటివరకు కేంద్రంలో కొలువు తీరిన ప్రభుత్వాలకు.. మోడీ హయాంకు మధ్య ఒక తేడా ఉంది. గతంలో కేంద్రంలో ఏ పార్టీ ప్రభుత్వం కొలువు తీరినా మొదటి ఐదేళ్లు ఓకే. రెండో టర్మ్ వచ్చేసరికి.. అవినీతి పుట్టలు బద్ధలవుతూ ఉంటాయి.

కానీ.. మోడీ హయాం అందుకు భిన్నం. పదేళ్లు నాన్ స్టాప్ గా పాలన సాగించి.. మరో ఐదేళ్లకు ప్రజల నుంచి అనుమతి పొంది.. అప్పుడే ఏడాది దాటేస్తున్న వేళ.. అవినీతిలో భారత ర్యాంకింగ్ గతంతో పోలిస్తే మెరుగ్గా ఉండాలి కదా? అందుకు భిన్నంగా ఉండటంలో అర్థమేంటి? తాజాగా అవినీతికి సంబంధించిన ర్యాంకింగ్ విడుదల కాగా.. అందులో భారత్ స్థానం మరింత దిగజారింది. ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లోని అవినీతిని లెక్క కడుతూ.. భారత్ ర్యాంకింగ్ ను డిసైడ్ చేశారు.

2022లో భారత్ ర్యాంక్ 85గా ఉంటే.. 2023లో 93వ స్థానంలోకి దూసుకెళ్లింది. తాజాగా మరో అడుగు ముందుకు వేసి.. 96వ స్థానానికి చేరుకుంది. అంటే.. గడిచిన రెండేళ్లలో అవినీతిలో మన దేశ ర్యాంక్ మరింత దిగజారటమే కాదు.. అంతకంతకూ దరిద్రపుగొట్టు స్థానానికి చేరుకుంటున్న వైనాన్ని తెలియజేస్తుందని చెప్పాలి. ప్రభుత్వ స్థాయిలో అవినీతి ఏ మేరకు ఉందో నిపుణులు.. వ్యాపారవేత్తల అభిప్రాయాలు తీసుకొని ట్రాన్స్ పరెన్సీ ఇంటర్నేషనల్ సున్నా నుంచి వంద మధ్య పాయింట్లను కేటాయించారు.

సున్నా అయితే అవినీతి ఎక్కువగా పేర్కొంటున్నారు. ప్రపంచంలో అవినీతి అత్యంత తక్కువగా ఉన్న దేశంగా డెన్మార్క్ తొలి స్థానంలో నిలవగా.. ఫ్లిన్లాండ్ రెండో స్థానంలో.. సింగపూర్ మూడో స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో న్యూజిలాండ్.. లక్సంబర్గ్ నిలిచాయి. టాప్ 5 స్థానాల్లో ప్రపంచానికి పెద్దన్న అమెరికాకు చోటు దక్కకపోవటమే కాదు.. సంపన్న దేశాలు లేకపోవటం గమనానార్హం. కఠిన చట్టాలు ఉంటాయని చెప్పే సౌదీ అరేబియా లాంటి దేశాలు సైతం టాప్ 5 అవినీతి రహిత దేశాల జాబితాలో లేకపోవటం విశేషం.

ఇక.. మనకు ఇరుగుపొరుగు దేశాలైన పాకిస్థాన్.. శ్రీలంక.. బంగ్లాదేశ్ దేశాలు మనకంటే ఘోరమైన స్థానాల్లో ఉన్నాయి. మన కంటే కాస్త మెరుగైన స్థానంలో చైనా నిలిచింది. అత్యంత అవినీతి దేశంగా సౌత్ సూడాన్ నిలిచింది. ప్రపంచంలోని ప్రతి ప్రాంతంలోనూ అవినీతి ఒక సమస్యగా ఉందని.. అవినీతి పర్యావరణ చర్యలకు ప్రధాన ముప్పుగా మారిందన్న మాట.. ఆందోళనకు గురి చేసేదిలా ఉందని చెప్పక తప్పదు.