మరో సంచలనం: జ్ఞానవాపి మసీదు కింద ఆలయ అవశేషాలు.. చెప్పిందెవరు?
గడిచిన కొంతకాలంగా హాట్ టాపిక్ గా మరిన జ్ఞానవాపి మసీదుకు సంబంధించి సంచలన అంశాలు వెలుగు చూశాయి.
By: Tupaki Desk | 26 Jan 2024 4:58 AM GMTగడిచిన కొంతకాలంగా హాట్ టాపిక్ గా మరిన జ్ఞానవాపి మసీదుకు సంబంధించి సంచలన అంశాలు వెలుగు చూశాయి. ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో ఉన్న జ్ఞానవాపి మసీదు కింద హిందూ ఆలయం ఉందని.. ఆ మాటకు వస్తే హిందూ ఆలయాన్ని కూల్చి దానిపై మసీదు నిర్మాణం చేసినట్లుగా వాదనలు ఉన్నాయి. దీనిపై వివాదం నడుస్తోంది. ఇలాంటివేళ.. సంచలన అంశం ఒకటి వెలుగు చూసింది. దీని ప్రకారం జ్ఞానవాపి మసీదు కింద హిందూ ఆలయానికి సంబంధించిన అవశేషాలు ఉన్నట్లుగా భారత పురావస్తు శాఖ సర్వే రిపోర్టు పేర్కొందన్న విషయం వెలుగు చూసింది.
ఈ వివాదంలోకి వెళితే.. వారణాసిలోని విశ్వనాథుడి ఆలయం పక్కన ఉన్న మసీదు కింద ఆలయం ఉందంటూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ముస్లిం కక్షిదారులు సవాలు చేశారు. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో ఏఎస్ఐ సర్వేకు గత ఏడాది జులై 21న ఆదేశాలు జారీ చేసింది. సర్వే చేసిన తర్వాత తన నివేదికను కోర్టుకు సమర్పించారు. డిసెంబరు 18న కోర్టుకు చేరిన నివేదికను తమకు అందజేయాలని హిందూ.. ముస్లిం కక్షిదారులు కోర్టును కోరారు. ఈ నేపథ్యంలో గురువారం న్యాయస్థానం కక్షిదారులైన పదకొండు మందికి అందజేశారు.
జ్ఞానవాపి మసీదు కింద హిందూ ఆలయానికి సంబంధించిన అవశేషాలు ఉన్నట్లుగా సర్వే రిపోర్టు చెప్పిన విషయాన్ని హిందువుల తరఫు ఈ కేసును వాదిస్తున్న న్యాయవాది విష్ణు శంకర్ జైన్ వెల్లడించటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆలయం పైనే మసీదును నిర్మించారన్న విషయాన్ని ఆయన చెప్పారు. మసీదు కింద తెలుగు.. కన్నడ.. దేవనాగరి సహా 34 భాషల్లో ఉన్న శాసనాల ఆనవాళ్లు లభించాయని పేర్కొన్నారు.
అంతేకాదు.. ఈ శాసనాల్లో జనార్దన.. రుద్ర.. ఉమేశ్వర అనే ముగ్గురు దేవుళ్ల ప్రస్తావన ఉన్నట్లుగా గుర్తించారని తెలిపారు. ఆలయానికి సంబంధించిన స్తంభాలకే కాస్త మార్పులు చేర్పులు చేసిన మసీదు నిర్మాణంలో ఉపయోగించారన్న విషయం సర్వేలో వెల్లడైనట్లు పేర్కొన్నారు. ఈ వివాదానికి సంబంధించి పురావస్తు శాఖ భారీ నివేదిక సిద్ధం చేసిందని.. అది మొత్తం 839 పేజీల్లో ఉన్నట్లుగా చెప్పారు.
ఈ కేసులో మొత్తం 11 మంది భాగస్వామ్య పక్షాలకు సర్వే రిపోర్టును కోర్టు అందించింది. ఈ నివేదిక సారాంశాన్ని ఒక్క మాటలో చెప్పాలంటే.. ఆలయ అవశేషాలపైనే మసీదు నిర్మించిన విషయాన్ని ఇందులో స్పష్టంగా పేర్కొన్నారు. సర్వే నివేదికలో ఆలయానికి సంబంధించిన తగినన్ని సాక్ష్యాధారాలు ఉన్నట్లుగా న్యాయవాది జైన్ వెల్లడించారు. నివేదికలో పేర్కొన్న అంశాల్ని ప్రెస్ మీట్ పెట్టి వెల్లడించిన జైన్ తో పాటు.. సర్వే నివేదికలోని అంశాలు కొన్ని వెబ్ సైట్లలో వెల్లడయ్యాయి. వాటిని చూస్తే..
- మసీదు నిర్మాణంలో ఆలయ స్తంభాలను ఉపయోగించారు. ఆలయ నిర్మాణంలోని కొన్ని భాగాలను యథాతథంగా అలాగే ఉంచారు. సర్వే సందర్భంగా ఇప్పుడున్న మసీదు గోడలపై.. అంతకు ముందటి ఆలయ నిర్మాణం తాలూకు గోడలపై 34 శాసనాలు ఉన్నాయని గుర్తించారు.
- వీటిల్లో 32 శాసనాలు నకలు చేశారు. ఇవి దేవనగరి.. గ్రంథ.. తెలుగు.. కన్నడ లిపుల్లో ఉన్నాయి. ఇవన్నీ హిందూ ఆలయంలో ఏర్పాటు చేసిన శిలా శాసనాలు. వాటిని మసీదు నిర్మాణంలో ఉపయోగించారు.
- ఆలయ గోడల మీద చిత్రీకరించిన కమలం గుర్తులను తొలగించి.. ఆ గోడలను మసీదు నిర్మాణంలో ఉపయోగించిన ఆధారాలు ఉన్నాయి.
- 17వ శతాబ్దంలో ఔరంగజేబు పాలనలో అక్కడున్న ఆలయాన్ని ధ్వంసం చేసి మసీదును నిర్మించారు.
- అక్కడ లభించిన శిథిలాలు, కళాకృతులు, శాసనాలు, శిల్పరీతులను చూస్తే అక్కడ అంతకుముందు హిందూ ఆలయం ఉండేదని శాస్త్రీయ అధ్యయనం రుజువు చేస్తోంది.
- దేవతల విగ్రహాలు.. శిల్పాలు భూమిలో కూరుకుపోయి కనిపించాయి. పశ్చిమం వైపున్న ఆవరణలో తోరణంతో కూడిన భారీ ప్రవేశ ద్వారం ఉంది.
- పక్షులు.. జంతువులు.. పుష్కాలను చిత్రించిన ఒక చిన్న ద్వారం ఉంది. గోడలను లతలతో తీర్చిదిద్దారు. పశ్చిమం వైపున్న గోడ యథాతథంగా అంతకు ముందు ఆలయానికి చెందినదే.
- మసీదులోని ఒక గదిలో ఒక శాసనం లభించింది. దాని మీద మసీదు నిర్మాణం.. విస్తరణకు సంబంధించిన సమాచారాన్ని చెరిపివేయటం కనిపించింది. ఇది అంతకు ముందున్న ఆలయ విధ్వంసానికి ఔరంగజేబు ఇచ్చిన ఆదేశాలకు చెందిన శాసనంగా భావిస్తున్నారు.