పక్కకెళ్లి ఆడుకో... ఇరాన్ కు ఇచ్చిపడేసిన ఇజ్రాయేల్!
అవును... "యుద్ధం వాళ్లు మొదలుపెట్టినా, ముగించేది మాత్రం మేమే.. ఇజ్రాయేల్ శత్రువులు కొన్ని దశాబ్ధాలపాటు గుర్తుపెట్టుకునేలా హమాస్ పై మా దాడి ఉంటుంది" అని ఇజ్రాయేల్ ప్రధాని హెచ్చరించినట్లుగానే ఆ దేశ సైన్యం దూసుకుపోతోంది.
By: Tupaki Desk | 17 Oct 2023 4:26 AM GMTహమాస్ మిలిటెంట్లే లక్ష్యంగా ఇజ్రాయెల్ జరుపుతోన్న భీకర వైమానిక దాడులతో గాజాలో విపత్కర పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే గాజాను అత్యంత దయణీయ స్థితికి నెట్టేసిన ఇజ్రాయేల్.. హమాస్ మిలిటెంట్లు అపహరించిన తమదేశ పౌరులను తిరిగి తీసుకురావడం కోసం ఎంతదూరం అయినా వెళ్తామని సూటిగా చెప్పింది. ఈ సమయంలో హమాస్ ఉగ్రవాదులకు సహకరిస్తూ, ఇజ్రాయేల్ కు వార్నింగ్ లు ఇస్తూ, దాడులు చేస్తున్న ఇరాన్ తోపాటు ఆ దేశ మద్దతుగా నిలిచిన 'హిజ్బుల్లా'ను హెచ్చరించింది.
అవును... "యుద్ధం వాళ్లు మొదలుపెట్టినా, ముగించేది మాత్రం మేమే.. ఇజ్రాయేల్ శత్రువులు కొన్ని దశాబ్ధాలపాటు గుర్తుపెట్టుకునేలా హమాస్ పై మా దాడి ఉంటుంది" అని ఇజ్రాయేల్ ప్రధాని హెచ్చరించినట్లుగానే ఆ దేశ సైన్యం దూసుకుపోతోంది. హమాస్ లక్ష్యంగా గాజాను గడగడ లాడించేస్తుంది. ఈ సమయంలో గాజాలో ఇజ్రాయెల్ కొనసాగిస్తున్న భీకర దాడులను ఇరాన్ మరోసారి ఖండించింది.
ఇందులో భాగంగా.. పాలస్తీనియన్లపై దురాక్రమణను తక్షణమే ఆపకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని.. ఇజ్రాయెల్ పై కఠిన చర్యలు చేపట్టేందుకు తామంతా సిద్ధంగా ఉన్నామని.. గాజాలో ఇజ్రాయెల్ దురాక్రమణ ఆపకపోతే, ఈ ప్రాంతంలోని అన్ని దేశాల చేతులు ట్రిగ్గర్ పైనే ఉన్నాయని ఇరాన్ విదేశాంగ మంత్రి హోస్సేన్ అమిరబ్దొల్లాహియాన్ చెప్పినట్లు కథనాలొస్తున్నాయి.
ఇదే క్రమంలో ఇజ్రాయేల్ కు మద్దతుగా నిలిచిన అమెరికాను ఉద్దేశించి హోస్సేన్ కొన్ని వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగా... యుద్ధాన్ని ఆపాలని, సంక్షోభాన్ని అరికట్టాలనే ఆసక్తి ఉన్నవారు.. గాజాలో పౌరులపై జరుగుతున్న అనాగరిక దాడులను అడ్డుకోవాలి అని అన్నారు. దీంతో... ఈ హెచ్చరికలపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పందించారు.
ఐసిస్ వంటి హమాస్ ఉగ్రసంస్థను అణచివేసేందుకు ప్రపంచమంతా ఒక్కటవ్వాలని విజ్ఞప్తి చేసిన నెతన్యాహు... లేనిపక్షంలో ముప్పు కొనసాగుతూనే ఉంటుందని అన్నారు. ఈ సందర్భంగా.. తమ సహనాన్ని పరీక్షించవద్దంటూ ఇరాన్ తోపాటు ఆ దేశ మద్దతుగా నిలిచిన "హిజ్బుల్లా"ను హెచ్చరించారు. ఇదే సమయంలో... ఇజ్రాయేల్ సహనాన్ని పరీక్షించొద్దని, ఫలితంగా అదే తప్పును పునరావృతం చేయొద్దని స్పష్టం చేశారు.
మరోపక్క గాజాలో ప్రజల పరిస్థితిపై ఐక్యరాజ్య సమితితో పాటు పలు దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఆహారం, నీళ్లు లేక గాజా వాసులు అలమటిస్తున్న సంగతి తెలిసిందే. గాజాను ఇజ్రాయేల్ అష్టదిగ్బంధనం చేయడంతో.. నీరు, విద్యుత్తు, నిత్యవసరాలు, ఆసుపత్రుల్లో మందులు, వైద్య సామగ్రి నిల్వలు గణనీయంగా తగ్గిపోతున్నాయని అంటున్నారు.
ఫలితంగా గాజాలో ఆకలి చావులు దర్శనమిచ్చే ప్రమాదం అతి సమీపంలో ఉందని ఐరాస ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఈ సమయంలో ఇజ్రాయేల్ మానవతా దృక్పదంతో స్పందించింది. ఇందులో భాగంగా... గాజాకు మానవతా సాయం అందించేందుకు అనుమతిస్తామని ప్రకటించింది. తమ లక్ష్యం గాజా ప్రజలు కాదని... వారి చాటున దాక్కున్న హమాస్ ఉగ్రవాదులు అని స్పష్టం చేసింది!