Begin typing your search above and press return to search.

పందెం కోడి లక్ష...బరిలోకి దిగితే దూకుడే !

ఇలా కోడి పందేలలో ప్రతీ సందర్భమూ సాహసమే. ప్రతీ పోరాటమూ మృత్యువుతో సావాసమే అని పందెం కోళ్ళను పెంచేవారు చెబుతారు.

By:  Tupaki Desk   |   12 Jan 2025 4:10 AM GMT
పందెం కోడి లక్ష...బరిలోకి దిగితే దూకుడే !
X

పందెం కోళ్ళు అంటే అవి గోదావరి జిల్లాలలోనే చూడాలి. వాటిని ఒక యుద్ధ సైనికుడిని పెంచినట్లుగా పెంచుతారు. శిక్షణ కూడా అదే స్థాయిలో ఇస్తారు. పందేనికి సిద్ధం అయ్యేందుకు ఏడాడు పాటు పెట్టే గ్రాసమే లక్షలలో ఉంటుంది. ఇక దానిని కొనుగోలు చేయాలీ అంటే లక్షలు చెల్లించుకోవాల్సిందే.

అలా బరిలోకి దిగిన పందెం కోడి చేసే దూకుడు మామూలుగా ఉండదు. కత్తులతో కాదు కంటి చూపుతోనే చంపేసే రేంజిలో పోరాడుతుంది. అవతల ప్రత్యర్ధిని చంపడమో తాను చావడమో చేస్తుంది. అంటే విజయమో వీరస్వర్గమో అన్న మాట.

ఈ విధంగా చూస్తే సంక్రాంతి పండుగ అంటే పందెం కోళ్ళకు యమ డిమాండ్ ఉంటుంది. వాటిని కొని బరులు గీసి పందేలు కాసే వారు హెచ్చు సంఖ్యలో ఉంటారు. దాంతో దాదాపుగా ఇది ఒక అతి పెద్ద వ్యాపారంగా కూడా ఇక్కడ సాగుతుంది అని అంటున్నారు. కోడి కత్తి అని ఆ మధ్య బాగా పాపులర్ అయింది.

ఆ కొత్తిని పందెం కోడిని కాలికి తగిలిస్తారు. అది కాస్తా రంగంలోకి దిగి అవతల శత్రువు మీద కాలు దువ్వింది అంటే దానికి మూడినట్లే మరి. ఈ కోడి కత్తిని కాలికి అమర్చడంలో ఏదైనా పొరపాటు జరిగితే ఆ వ్యక్తి కూడా స్పాట్ లోనే చనిపోతాడు. ఏకంగా సున్నితమైన నరాలను కట్ చేసి క్షణాలలో ప్రాణాపాయం తెస్తుంది కోడి కత్తి.

ఇలా కోడి పందేలలో ప్రతీ సందర్భమూ సాహసమే. ప్రతీ పోరాటమూ మృత్యువుతో సావాసమే అని పందెం కోళ్ళను పెంచేవారు చెబుతారు. ఇక ఏ కోడి పందెంలో గెలుస్తుంది అనడానికి కూడా శాస్త్రాలు ఉన్నాయట. ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉంది నిజం అంటున్నారు.

మనకు కూడా తరచుగా గ్రామాలలో వినిపించే మాట ఒకటి ఉంది అదే కుక్కుట శాస్త్రం అని. కుక్కుటం అంటే కోడి దానికి సంబంధించినదే శాస్త్రం అన్న మాట. ఈ శాస్త్రంలో పందెంలో గెలిచే కోడి రంగు దాని జాతి గురించి పూర్తిగా ఉంటుంది. అలాంటి జాతి కోడినే పందెంలోకి దించాలి. అపుడే విజయం దక్కుతుంది అని అంటారు.

అంతే కాదు కోడి పుట్టిన తిధిని ఆసరాగా చేసుకుని జన్మ నక్షత్రాన్ని కూడా సిద్ధం చేస్తారు. ఆ విధంగా ఏ తేదీలో అయితే ఆ కోడికి ఆ జన్మ నక్షత్రం కలసి వస్తుందో చూసి మరీ ఆ రోజునే బరిలోకి దించుతారు అన్న మాట. కోడి రకాలు కుక్కుట శాస్త్రంలో పూర్తిగా వివరించారు.

అవేంటి అంటే నల్ల కక్కెర, రసంగి, తెల్ల నెమలి, కోడి నెమలి, కాకి డేగ, నెమలి కక్కెర గౌడ నెమలి, గాజు కుక్కురాయి, వంటి అనేక రకాలైన జాతులు ఉంటాయని కూడా చెబుతారు. ఇది చాలా ఆసక్తికరమైన విషయంగానే చూడాల్సి ఉంటుంది.

మొత్తానికి చూస్తే కోడి పందెం అన్నది ఎంతో విలక్షణమైనది. ఆషామాషీగా తీసుకోవాల్సినది కానే కాదు యుద్ధానికి వెళ్ళే సైనికుడు ఎంతటి శిక్షణ పొందుతాడో అంతకు మించి అన్నట్లుగా కోడి పందేలలో కోడి పుంజులకు శిక్షణ ఇస్తారు. వాటిని బరిలోకి దింపితే విజయం తధ్యమని అటూ ఇటూ భావిస్తారు. ఆ మీదట జరిగే కోడి పుంజుల యుద్ధం భీకరంగా ఉంటుంది. ఇదే గోదావరి జిల్లాలో అతి పెద్ద ఉత్సవంగా ఉత్సాహన్ని తెస్తుంది.