Begin typing your search above and press return to search.

అదిరేలా గోదారోళ్ల మర్యాదలు.. ఎంగేజ్ మెంట్ వేళ కోడలికి సర్ ప్రైజ్

మర్యాదలన్నంతనే గోదారోళ్లు గుర్తుకు వస్తారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో మరే ప్రాంతానికి లేని పేరు గోదారోళ్లకు మాత్రం సొంతం

By:  Tupaki Desk   |   6 Sep 2023 4:47 AM GMT
అదిరేలా గోదారోళ్ల  మర్యాదలు.. ఎంగేజ్ మెంట్ వేళ కోడలికి సర్ ప్రైజ్
X

మర్యాదలన్నంతనే గోదారోళ్లు గుర్తుకు వస్తారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో మరే ప్రాంతానికి లేని పేరు గోదారోళ్లకు మాత్రం సొంతం. వారి మర్యాదలతో ఉక్కిరిబిక్కిరి అయిపోవాల్సిందేన్నంతగా వారి తీరు ఉంటుందని చెబుతారు. గోదావరి జిల్లాలకు అల్లుడిగా వెళ్లటానికి మించిన భోగం మరేం ఉంటుందన్న మాట వినిపిస్తూ ఉంటుంది. పండుగ వేళ కొత్త అల్లుడికి చేసే మర్యాదలకు ఫిదా కావాల్సిందేనని చెబుతారు. మనసులో ప్రేమ ఎంత ఉన్నా.. మాటల్లో చెబితే కదా తెలిసేదన్నట్లుగా.. తమకున్న అభిమానాన్ని చేతలతో చూపించేందుకు వారు ప్రదర్శించే ఆసక్తి అంతా ఇంతా కాదు.

తాజాగా అలాంటి మర్యాదల్నే ప్రదర్శించి వార్తాంశంగా మారారు. ఇప్పటివరకు కొత్తింటి అల్లుడికి రాచమర్యాదలు చేసే అమ్మాయి తరఫు వారికి భిన్నంగా.. తమ ఇంటికి కోడలిగా వచ్చే అమ్మాయి అబ్బాయి తరఫు వారు స్వీట్లతో సర్ ప్రైజ్ చేసిన వైనం అందరూ దీని గురించి మాట్లాడుకునేలా చేసింది. రాజమండ్రి పట్టణంలో జరిగిన ఎంగేజ్ మెంట్ లో కోడలిని సర్ ప్రైజ్ చేసేందుకు అబ్బాయి తరఫు వారు ఏకంగా 108 రకాల స్వీట్లను పళ్లాల్లో తీసుకొచ్చి తమ తియ్యటి మర్యాదను అందరికి అర్థమయ్యేలా చేశారు. దీంతో.. వీరి మర్యాద స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

కాకినాడ కాజాలు.. ఆత్రేయపురం పూతరేకులు మొదలు కొని.. ఇది కాదు అది కాదు అన్న రీతిలో 108 రకాల స్వీట్లను ఫంక్షన్ జరిగే హాల్లో ఒకచోట పెట్టి ప్రదర్శించిన వైనం అందరిని ఆకట్టుకుంది. ఇందుకోసం కొన్ని స్వీట్లను వివిధ షేపుల్లో సిద్ధం చేయటం.. మధ్యలో పెళ్లికూతురు.. పెళ్లి కుమార్తెల బొమ్మల్ని పెట్టిన వైనం అందరిని ఆకర్షించేలా ఉంది. మున్నం.. ప్రగడ కుటుంబాల ఎంగేజ్ మెంట్ వేళ ఈ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. పెళ్లి కుమార్తె లేఖ.. పెళ్లి కుమారుడు అనీష్ పెళ్లికి ముందు చేసిన ఈ ఎంగేజ్ మెంట్ ను చూసినోళ్లు.. నిశ్చితార్థానికే ఇంత చేశారు.. పెళ్లికి మరెంత ఘనమైన ఏర్పాట్లు చేస్తారన్న మాట వినిపించింది.