Begin typing your search above and press return to search.

గోదావరి, కృష్ణా జిల్లాల్లో జగన్ కీలక నిర్ణయాలివేనా!?

వైనాట్ 175 అని మొదటినుంచీ చెబుతున్న జగన్... అందుకు కావాల్సిన కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారని తెలుస్తుంది.

By:  Tupaki Desk   |   19 Dec 2023 4:46 AM GMT
గోదావరి, కృష్ణా జిల్లాల్లో జగన్  కీలక నిర్ణయాలివేనా!?
X

ఏపీలో ఎన్నికల రాజకీయం ఊపందుకున్న సంగతి తెలిసిందే. వైనాట్ 175 అని మొదటినుంచీ చెబుతున్న జగన్... అందుకు కావాల్సిన కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారని తెలుస్తుంది. ఈ విషయంలో మొహమాటాలకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా.. వ్యక్తుల ఇష్టాఇష్టాల కంటే పార్టీ ఫ్యూచర్ ముఖ్యమనేలా నిర్ణయాలు తీసుకుంటున్నారని అంటున్నారు. ఈ సమయంలో కీలకమైన గోదావరి జిల్లాల అభ్యర్థుల మార్పులు, చేర్పుల విషయంలో జగన్ కీలక నిర్ణయాలు తీసుకున్నారని తెలుస్తుంది.

అవును... వీలైనంత త్వరగా అభ్యర్థుల ఎంపిక చేపట్టి కథనరంగంలోకి అడుగుపెట్టాలని వైఎస్ జగన్ భావిస్తున్నారని తెలుస్తుంది. ఈ సమయంలో కొంతమంది ఎంపీలను ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్యేలను ఎంపీలుగా పోటీ చేయించొచ్చని సమాచారం. ఇదే సమయంలో టీటీడీ బోర్డ్ మెంబర్ గా ఉన్న ఒక వ్యక్తిని విజయవాడలో రంగంలోకి దింపాలని భావిస్తున్నారని తెలుస్తుంది. దీంతో విజయవాడ ఎంపీ సీటు హాట్ టాపిక్ గా మారింది.

రాష్ట్ర విభజన అనంతరం గడిచిన రెండు ఎన్నికల్లోనూ విజయవాడ ఎంపీ సీటును టీడీపీ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. అక్కడ కేశినేని నాని రెండు సార్లు ఎంపీగా గెలిచారు. అయితే ఇటీవల ఆయనకు టీడీపీ పెద్దలకు పొసగడం లేదని, గ్యాప్ వచ్చిందని కామెంట్లు వినిపిస్తున్నాయి. మరోవైపు నానీ తమ్ముడు కేశినేని చిన్ని సైతం అటు జనసేన నుంచి తన ప్రయత్నాలు ముమ్మరం చేశారనే చర్చ రాజకీయవర్గాల్లో వినిపిస్తుంది.

ఈ సమయంలో వచ్చే ఎన్నికల్లో కీలకమైన విజయవాడ ఎంపీ అభ్యర్థిగా ప్రముఖ పారిశ్రామికవేత్త నెరుసు నాగ సత్యం పేరును వైసీపీ అధిష్టాణం పరిశీలిస్తోన్నట్లు చెబుతున్నారు. విజయవాడ ఎంపీ అభ్యర్థిగా ఆయన పేరును ఆల్ మోస్ట్ ఫైనల్ చేశారని అంటున్నారు. ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యుడిగా ఉన్న నాగసత్యం... గతంలో ఒలెక్ట్రా గ్రీన్‌ టెక్ హోల్‌ టైం డైరెక్టర్‌ గా పని చేశారు.

ఇక ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా విషయానికొస్తే... ఇద్దరు ఎంపీలను ఈ దఫా అసెంబ్లీకి పోటీచేయించే యోచనలో జగన్ ఉన్నారని, ఆ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు. ఇందులో భాగంగా... ప్రస్తుతం రాజ్యసభ ఎంపీగా ఉన్న, మాజీ ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్‌ ను ఈ దఫా అసెంబ్లీ ఎన్నికల బరిలో దించుతారని తెలుస్తుంది.

ఇందులో భాగంగా పిల్లి సుభాష్ చంద్రబోస్ కు అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రామచంద్రాపురం నియోజకవర్గాన్ని కేటాయించారని అంటున్నారు. ఇదే సమయంలో మార్గాని భారత్ ను ఈ దఫా రాజమండ్రి అర్బన్ నుంచి అసెంబ్లీకి పోటీ చేయిస్తారని తెలుస్తుంది. ఇక మంత్రి చెల్లుబోయిన వేణుని రాజమండ్రి రూరల్ కి దింపి, తోట త్రిమూర్తులను మండపేట నియోజకవర్గం నుంచి బరిలో దింపనున్నారని సమాచారం.

ఇలా సర్వే ఫలితాలు, కార్యకర్తల అభిప్రాయాలు, పరిశీలకుల అభిప్రాయాలు, సామాజిక సమీకరణాలు... అన్నింటినీ బేరీజు వేసుకుంటున్న జగన్... కీలక నియోజకవర్గాల్లో మరింత కీలక నిర్ణయాలు తీసుకుంటూ ఎన్నికల రాజకీయాలను వేడెక్కించేస్తున్నారు. ఈ క్రమంలో త్వరలో మరిన్ని కీలక నిర్ణయాలు ఉంటాయని.. సంక్రాంతి తర్వాత ఇక జనాల్లోనే ఉండాలని జగన్ ప్లాన్ చేస్తున్నట్లు చెబుతున్నారు.