టీడీపీ జనసేన పొత్తు : గోదావరిలో సుడిగుండాలెన్నో...!
ఈ నేపధ్యం నుంచి చూసినపుడు గోదావారి జిల్లాలలో ముప్పయి నాలుగు అసెంబ్లీ సీట్లు ఉన్నాయి
By: Tupaki Desk | 28 Jan 2024 3:29 AM GMTగోదావరి జిల్లాలు ఏపీ పాలిటిక్స్ ని మలుపు తిప్పుతాయని అంతా భావిస్తారు. అది ఉమ్మడి ఏపీ అయినా లేక విభజన ఏపీ అయినా గోదావరి ప్రజల నాడి తెలుసుకోవడానికి ఒక అన్నం మెతుకు లాంటిది అని అంటారు. అంతే కాదు ప్రభుత్వాలను మార్చడంతో గోదావరి జిల్లాలు పెట్టించి పేరు అని అంటారు. ఒక విధంగా అది అతి పెద్ద రాజకీయ సెంటిమెంట్ గా మారింది.
ఈ నేపధ్యం నుంచి చూసినపుడు గోదావారి జిల్లాలలో ముప్పయి నాలుగు అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ఒక విధంగా ఇది మొత్తం అసెంబ్లీలో అయిదవ వంతు. వెరీ గుడ్ నంబర్. ఈ నంబర్ లేకుండా ఏ పార్టీ కూడా అధికారంలోకి వచ్చే అవకాశాలు లేవు.
అయితే ఈ గోదావరి మీదనే అటు అధికార వైసీపీ ఇటు విపక్ష తెలుగుదేశం జనసేన కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నాయి. అధికార పార్టీది ఒంటరి పోరు కాబట్టి గొడవ లేదు. ప్రత్యర్ధులు కత్తులు నూరుకుంటే ఫుల్ హ్యాపీ. లేకపోతే అలా జరగాలని ఆశలు. ఒకవేళ పొత్తులు పెట్టుకున్నా ఓట్ల బదిలీ సజావుగా సాగదు అన్న ధీమా ఇలా వైసీపీలో వ్యూహాలు వేరేగా ఉన్నాయి.
దానికి తగినట్లుగానే అసలు కధ టీడీపీ జనసేనలలో మొదలైంది. విశేషం ఏంటి అంటే జనసేన బలం అక్కడే నూటికి తొంబై శాతం పైగా ఉంది. టీడీపీకి కూడా అక్కడే బలం ఉంది. దాంతో పొత్తుల ఎత్తులు అన్నీ ఒకే ఒరలో ఇమడడం లేదు. ఇది సింపుల్ లాజిక్. అవే సీట్లు కానీ రెండు పార్టీలకూ కావాలి. ఎవరూ ఎక్కడా తగ్గేది లేదు. ఏ మాత్రం తగ్గిన ఎవరికి వారికి రాజకీయ ప్రయోజనాలు దెబ్బ తింటాయి.
గోదావరి జిల్లాలలో తగ్గడం అంటే ఒక విధంగా భాగీ త్యాగం చేసినట్లే. అంతటి త్యాగానికి ఎవరు సిద్ధపడతారు. పైగా రాజకీయం అంటేనే ఎపుడూ ఒకరి మీద మరొకరు పై చేయి సాధించడమే. పైగా ఏ విషయం అయినా ఆ రోజుకు ఆ రోజే తేల్చుకోవాలి. రేపు అన్న మాట పొలిటికల్ డిక్షనరీలో లేదు.
ఇదే ఇపుడు గోదావారి రాజకీయాన్ని రసకందాయంలో పడేస్తోంది. గోదావరి జిల్లాలలో సీట్ల సర్దుబాటు చేయడం ఆ దేవుడికి అయినా సాధ్యం కాదు అన్నది ఇపుడు వినిపిస్తున్న మాట. ఎందుకంటే ఎవరికి తగ్గినా అక్కడ అసలు ఊరుకోరు. పార్టీలను మించి నాయకులు ప్రెస్టేజ్ గా తీసుకుంటారు.
అందుకే ప్రతీ ఎన్నికల్లోనూ రెబెల్స్ ఎక్కువగా గోదావరి జిల్లాలలో కనిపిస్తూంటారు. ఈసారి కూడా అలాంటి సందర్భాలు ఏర్పడతాయా అంటే అవును అన్న మాట వినిపిస్తోంది. టీడీపీ జనసేన పొత్తు కాదు కానీ కచ్చితంగా ఇబ్బందులు చాలానే వచ్చేలా ఉన్నాయని అంటున్నారు. జనసేన రాజానగరం టికెట్ మాది అంటే అక్కడ బొడ్డు వెంకటరమణ చౌదరి రెడీ అవుతున్నారు టీడీపీ జెండాతో.
ఇక రాజోలు రచ్చ చెప్పాల్సింది లేదు, బొంతు రాజేశ్వరరావు వైసీపీ నుంచి జనసేనలో చేరిందే టికెట్ కోసం, ఆయనకే జనసేన టికెట్ ఇస్తుంది. అయితే మాజీ మంత్రి సీనియర్ మోస్ట్ నేత గొల్లపల్లి సూర్య రావు కూడా సీన్ లో ఉన్నారు. ఆయన 2019 ఎన్నికల్లో దాదాపుగా యాభై వేల ఓట్లను సాధించారు. దాంతో ఆయన తనకే టికెట్ అంటున్నారు. మొత్తానికి చూస్తే ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే.
గోదావరిలో లోతులు చాలా ఉన్నాయి. ఇంకా దిగే కొద్దీ సుడిగుండాలు చాల ఉన్నాయి. దాంతో ఈ పొత్తులు సజావుగా కుదరడం అంటే అద్భుతం అనే అనుకోవాలి. లేకపోతే మాత్రం గోదారి సాక్షిగా పొత్తులు బెడిసి కొట్టినా ఆశ్చర్యం లేదు అంటున్నారు. ఎందుకంటే ఎవరికి వారే బరిలోకి దూకాలని ఆశపడుతున్నారు. అధినేతలు వారించా ఎవరూ తగ్గరు. అలాగని పొత్తు పెట్టుకున్నా ఓట్లు మాత్రం బదిలీ కావడం డౌటే అంటున్నారు. సో గోదావరి గండాన్ని టీడీపీ జనసేన ఎలా గట్టెక్కుతాయో చూడాల్సిందే అంటున్నారు.