నంద్యాల వైసీపీలో నేను లోకల్ !
ఉమ్మడి కర్నూలు జిల్లాలోని నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో స్థానికత అంశం రగడగా మారింది
By: Tupaki Desk | 26 Jan 2024 4:59 AM GMTఉమ్మడి కర్నూలు జిల్లాలోని నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో స్థానికత అంశం రగడగా మారింది. వైసీపీలోని కీలకమైన నాయకులు కొందరు ఎన్నికలకు ముందు స్థానికత అంశాన్ని లేవనెత్తుతూ.. రగడకు శ్రీకారం చుట్టారు. వీరిలో జడ్‌పీటీసీ గోకుల్ కృష్ణారెడ్డి ముందున్నారు. ఈయన వెంట మరో 50 మంది వరకు నాయకులు ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఇక్కడి స్థానికుడికే టికెట్ ఇవ్వాలని వీరి డిమాండ్‌గా ఉంది. అందులోనూ.. తనకు టికెట్ ఇవ్వాలని.. గోకుల్ కృష్నారెడ్డి స్వరం పెంచారు.
దీంతో నంద్యాల నియోజకవర్గం వైసీపీలో రోజుకో రగడ తెరమీదకి వస్తోంది. గత ఎన్నికల సమయంలో శిల్పా కుటుంబానికి చెందిన యువ నాయకుడు శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి వైసీపీ తరఫున ఇక్కడ పోటీ చేసి విజయం దక్కించుకున్నారు. శిల్పా కుటుంబానికి.. జిల్లాలో మంచి పేరు ఉండడం గమనార్హం. అయితే. వీరు సుదీర్ఘ కాలం టీడీపీలో ఉండడం.. నంద్యాల ఉప ఎన్నికల సమయంలో 2017లో చంద్రబాబు టికెట్ ఇవ్వకపోవడంతో.. వీరు వైసీపీ బాటపట్టడం తెలిసిందే.
ఇక, ఈ క్రమంలోనే గత ఎన్నికల్లో శిల్పా మోహన్‌రెడ్డి కుమారుడు శిల్పా రవికి జగన్ టికెట్ ఇచ్చారు. ఆయన గెలుపు గుర్రం కూడా ఎక్కారు. అయితే.. స్థానికంగా గత ఎన్నికల్లో శిల్పా గెలుపునకు కృషి చేసిన నేతలను ఆయన పక్కన పెట్టారు. దీంతో చాలా మంది నాయకులు ఆయనకు వ్యతిరేకంగా ఇటీవల కాలంలో గళం వినిపిస్తున్నారు. ఈ క్రమంలో అనూహ్యంగా కొన్ని రోజుల నుంచి స్థానికత అంశాన్ని లేవనెత్తుతున్నారు. పొరుగు నియోజకవర్గం నేతలకు ఇక్కడ చోటు లేదని.. వారు చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో శిల్ప కుటుంబంతో వైరం ఉన్న మంత్రి మద్దతును కూడగట్టిన జడ్పీటీసీ.. గోకుల్ కృష్ణారెడ్డి.. తాజాగా నంద్యాల టికెట్‌ను ఆశిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తనకు టికెట్ ఇవ్వాలని.. గెలిచి నిరూపిస్తానని.. గెలిచి గిఫ్ట్‌గా ఇస్తానని కూడా ఆయన చెబుతున్నారు అయితే.. ఈయన విషయాన్ని పార్టీ పెద్దగా పరిగణనలోకి తీసుకోవడం లేదు. దీంతో అనూహ్యంగా గత నాలుగు రోజుల నుంచి కూడా నంద్యాలలో ఎమ్మెల్యే రవికి వ్యతిరేకంగా.. గోకుల్ కృష్ణారెడ్డి స్థానికత అంశాన్ని లేవనెత్తుతూ.. రగడ సృష్టిస్తున్నారు. మీసం మెలేసి మరీ.. ఎమ్మెల్యే శిల్పాకు సవాళ్లు రువ్వుతున్నారు. మరి దీనిపై వైసీపీ అధిష్టానం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.