Begin typing your search above and press return to search.

ఇది కదా కావాల్సింది.. త్వరలోనే రూ.55వేలకు దిగిరానున్న బంగారం

గత కొన్నాళ్లుగా ఆకాశాన్నంటుతున్న బంగారం ధరలతో సతమతమవుతున్న సామాన్యులకు ఊరటనిచ్చే వార్త ఇది.

By:  Tupaki Desk   |   2 April 2025 12:30 PM
ఇది కదా కావాల్సింది.. త్వరలోనే రూ.55వేలకు దిగిరానున్న బంగారం
X

గత కొన్నాళ్లుగా ఆకాశాన్నంటుతున్న బంగారం ధరలతో సతమతమవుతున్న సామాన్యులకు ఊరటనిచ్చే వార్త ఇది. త్వరలోనే పసిడి ధరలు భారీగా దిగిరానున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. రానున్న రోజుల్లో 10 గ్రాముల బంగారం ధర ఏకంగా రూ.55 వేల స్థాయికి పడిపోయే అవకాశం ఉందని మార్నింగ్ స్టార్ నిపుణుడు జాన్ మిల్స్ జోస్యం చెప్పారు.

ప్రస్తుతం అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులు బంగారం ధరల పెరుగుదలకు కారణమవుతున్నాయి. ట్రంప్ టారిఫ్‌ల భయాలు, కేంద్ర బ్యాంకుల భారీ కొనుగోళ్లు పసిడికి డిమాండ్‌ను పెంచాయి. అయితే, ఈ పరిస్థితి తాత్కాలికమని, దీర్ఘకాలంలో ధరలు తగ్గుతాయని మిల్స్ విశ్లేషించారు. ప్రస్తుతం ఔన్స్ బంగారం ధర $3,000 - $3,150 మధ్య ఉండగా, రాబోయే ఐదేళ్లలో ఇది 38% వరకు పతనమయ్యే అవకాశం ఉందని ఆయన అంచనా వేశారు. ధరలు తగ్గడానికి ఆయన మూడు ప్రధాన కారణాలు వివరించారు.

మొదటిది, అధిక ధరల కారణంగా బంగారం తవ్వకాలు (మైనింగ్) పెరగనున్నాయి. ఇది మార్కెట్‌లోకి సరఫరాను పెంచి ధరలను తగ్గిస్తుంది. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ కూడా ఇదే విషయాన్ని ధృవీకరించింది. రెండోది, ప్రస్తుతం భారీగా బంగారం కొంటున్న కేంద్ర బ్యాంకులు, ఆర్థిక పరిస్థితులు కుదుటపడ్డాక అమ్మకాలు చేపట్టే అవకాశం ఉంది. అంతేకాకుండా, డిజిటల్ బంగారం, గోల్డ్ ఈటీఎఫ్‌లలో పెట్టుబడులు పెరుగుతుండటంతో భౌతిక బంగారానికి డిమాండ్ తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక చివరిగా, బంగారం ధరల చారిత్రక ధోరణులను పరిశీలిస్తే ప్రస్తుత ధరలు గరిష్ట స్థాయికి చేరుకున్నాయని మిల్స్ అభిప్రాయపడ్డారు.

అయితే, బ్యాంక్ ఆఫ్ అమెరికా వంటి ఇతర నిపుణులు మాత్రం రాబోయే రెండేళ్లలో బంగారం ధర ఔన్సుకు $3,500కు చేరుకోవచ్చని అంచనా వేస్తున్నారు. గోల్డ్‌మన్ శాక్స్ కూడా ఈ ఏడాది చివరి నాటికి $3,300కు చేరుకోవచ్చని అంచనా వేసింది. ఇలా భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ, జాన్ మిల్స్ అంచనా మాత్రం బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి ఆశాకిరణంలాంటింది.