ఆ నగల వ్యాపారి మరణం గురించి తెలిస్తే అయ్యో అనేస్తారంతే
వీలైనంత వరకు మంచిని చేస్తూ ఉంటారు కొందరు. అలాంటి ఉదంతమే ఒకటి తాజాగా చోటు చేసుకుంది
By: Tupaki Desk | 23 March 2024 3:55 AM GMTవీలైనంత వరకు మంచిని చేస్తూ ఉంటారు కొందరు. అలాంటి ఉదంతమే ఒకటి తాజాగా చోటు చేసుకుంది. అయితే.. మంచి చేసే క్రమంలో ప్రాణాలు పోయిన ఉదంతం అయ్యో అనిపించేలా చేస్తుంది. తాను ప్రయాణిస్తున్న ఆటోలో దొరికిన బంగారు చైన్ ను వెంటనే పోలీసులకు అందజేసిన ఒక పెద్దాయన అంతలోనే గుండెపోటుకు గురై.. మరణించిన వైనం అందరిని విషాదంలోకి నింపింది. హైదరాబాద్ మహానగరంలో చోటు చేసుకున్న ఈ ఉదంతంలోకి వెళితే..
షాయినాయత్ గంజ్ పోలీస్ స్టేషన్ లో జరిగిన ఈ విషాద ఉదంతంలోకి వెళితే.. నల్లకుంటకు చెందిన కోర్టు ఉద్యోగిని మేఘన శుక్రవారం రాపిడో బుక్ చేసుకుంది. నల్లకుంట నుంచి హైకోర్టుకు వెళ్లారు. ఆ తర్వాత ఆమె మెడలో చూసుకుంటే బంగారు చైన్ కనిపించలేదు. వెంటనే భర్తకు ఫోన్ చేశారు. మరోవైపు అదే ఆటోను వెండి నగల వ్యాపారి అయిన 70 ఏళ్ల గోవింద్ రామ్ సోనీ బుక్ చేసుకున్నారు.
ఆటో ఎక్కినంతనే సీటులో పడి ఉన్న బంగారు చైన్ ను చూసి.. వెంటనే ఆటో డ్రైవర్ ను దగ్గర్లోని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లాల్సిందిగా కోరారు. దీంతో ఆటో డ్రైవర్ నేనావత్ తరుణ్ దగ్గర్లోని షాయినాయత్ గంజ్ పోలీస్ స్టేషన్ కు చేరుకొని అక్కడి పోలీసులకు తనకు దొరికిన బంగారు గొలుసును అందజేశారు. అదే సమయంలో చైన్ పోగొట్టుకున్న మేఘన ఆటో డ్రైవర్ కు ఫోన్ చేయగా.. తాము పోలీస్ స్టేషన్ లో ఉన్నామని.. అక్కడి పోలీసులకు బంగారు చైన్ అప్పగించిన విషయాన్ని చెప్పారు. దీంతో భర్తతో కలిసి ఆమె స్టేషన్ కు చేరుకున్నారు.
పోలీసుల సమక్షంలో గోవింద్ రామ్ సోనీ మేఘనకు బంగారు చైన్ అప్పగించారు. ఈ ఉదంతం అక్కడున్న వారంతా సదరు వ్యాపారిని అభినందించారు. ఇది జరిగిన క్షణాల్లోనే తనకు కళ్లు తిరుగుతున్నాయంటూ గోవింద్ రామ్ కుప్పకూలిపోయారు. వెంటనే పోలీసులు ఆయన్ను ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆయన మరణించినట్లుగా పోలీసులు వెల్లడించారు. పోస్టు మార్టం తర్వాత ఆయన భౌతిక కాయాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు. మంచి పని చేసి అందరి అభినందనలు అందుకున్న పెద్దాయన ఆ క్షణంలోనే కుప్పకూలిపోయి మరణించటాన్ని అక్కడున్న వారెవరూ జీర్ణించుకోలేని పరిస్థితి.