హెయిర్ క్లిప్ లలో ఇరవై లక్షల బంగారం... ఈమె స్టైలే వేరు!
అధికారుల ముందు వీరి పప్పులు ఉడకడం లేదు! ఈ క్రమంలో తాజాగా హెయిర్ క్లిప్స్ లో బంగారం తెచ్చే ప్రయత్నం జరిగింది!
By: Tupaki Desk | 22 Aug 2023 6:12 AM GMTబ్యాగ్ జిప్పులు, వాటర్ బాటిల్ మూతలు, చీరకు పూతలు, దారపు పోగులు... ఇన్నర్ వేర్ లు, రన్నింగ్ షూలు... కాదేదీ బంగారం స్మగ్లింగ్ కి అనర్హం అంటూ చెలరేగిపోతున్నారు స్మగ్లర్లు! ఈ క్రమంలో తాజాగా హెయిర్ క్లిప్స్ లో ఇరవై లక్షలకు పైగా విలువైన బంగారాన్ని దాచి స్మగ్లింగ్ చేయాలని ప్రయత్నించింది ఓ మహిళ!
కస్టమ్స్ అధికారుల కళ్లుకప్పి భారతదేశానికి అక్రమంగా బంగారం తరలించాలని తపనపడుతున్న స్మగ్లర్లకు నిత్యం షాక్ తగులుతూనే ఉంది. సినిమాల్లో స్మగ్లింగ్ సీన్లకు మించి ఊహించని స్థాయిలో స్మగ్లర్లు ప్లాన్స్ చేస్తున్నప్పటికీ... అధికారుల ముందు వీరి పప్పులు ఉడకడం లేదు! ఈ క్రమంలో తాజాగా హెయిర్ క్లిప్స్ లో బంగారం తెచ్చే ప్రయత్నం జరిగింది!
అవును... శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో బంగారం అక్రమ రవాణాకు యత్నించినందుకు కస్టమ్స్ డిపార్ట్ మెంట్ లోని ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ అధికారులు ఒక మహిళా ప్రయాణికురాలిని పట్టుకోవడంతో ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది.
షార్జా నుంచి హైదరాబాద్ వచ్చిన ఓ ప్రయాణికురాలై కదలికలపై కస్టంస్ అధికారులకు అనుమానం వచ్చింది. దీంతో అధికారులు ఆమెను క్షుణ్నంగా చెక్ చేశారు! ఈ సమయంలో ఆమె వద్ద సుమారు 397 గ్రాముల బంగారాన్ని కనుగొన్నారు. నకిలీ హెయిర్ క్లిప్ లలో బంగారాన్ని దాచిపెట్టిన విషయాన్ని అధికారులు పసిగట్టారు.
దీంతో హెయిర్ క్లిప్స్ తో పాటు ఆమె వద్ద ఉన్న మొత్తం బంగారన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారని తెలుస్తోంది. దీని విలువ రూ.20 లక్షల పైనే అని అంటున్నారు! దీంతో పోలీసులు ఆ కి'లేడీ'పై కేసు నమోదు చేశారు.