జాకెట్, ప్యాంట్ లో 25 కిలోల గోల్డ్.. అక్రమ రవాణాలో మహిళా దౌత్యవేత్త
అంతా బాగానే ఉన్నా.. తొలుత సాధారణ తనిఖీని తప్పించుకున్నా.. చివరకు దొరికిపోయింది. ఇంతకూ ఏం జరిగిందంటే..?
By: Tupaki Desk | 4 May 2024 3:30 PM GMTబంగారం అంటే ఎవరికి ఇష్టం ఉండదు..? అందులోనూ భారతీయులకు గోల్డ్ అంటే మహా ప్రేమ. మరి.. విదేశీయురాలైన ఆ దౌత్యవేత్త దీనిని సొమ్ము చేసుకుందామనుకుందో..? లేక సొంతానికి వాడుకుందామని భావించిందో..? తనకు దౌత్య పరంగా ఉండే వెసులుబాటును అడ్డం పెట్టుకుని ఏకంగా అక్రణ రవాణాకు తెగించింది. జాకెట్, ప్యాంట్, మోకాలి క్యాప్, బెల్ట్‌లో ఏకంగా 25 కిలోల బంగారం ఎత్తుకొచ్చింది. అంతా బాగానే ఉన్నా.. తొలుత సాధారణ తనిఖీని తప్పించుకున్నా.. చివరకు దొరికిపోయింది. ఇంతకూ ఏం జరిగిందంటే..?
గల్ఫ్ దేశాల నుంచి వస్తూ
గల్ఫ్ దేశాలు.. మరీ ముఖ్యంగా దుబాయ్ నుంచి బంగారం అక్రమ రవాణా గురించి చెప్పాల్సిన పనిలేదు. చాలాసార్లు హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలోనే కిలోల కొద్దీ బంగారం పట్టుబడుతోంది. గల్ఫ్ లో బంగారం తక్కువ ధరకు దొరకడమే దీనికి కారణం. కాగా, సాధారణ ప్రజల సంగతి పక్కన పెడితే.. భారత్ లోని అఫ్గానిస్థాన్ కాన్సుల్ జనరల్ జకియా వార్ధక్ బంగారం స్మగ్లింగ్ కేసులో చిక్కుకున్నారు. ఇటీవల ఈమె దుబాయ్ నుంచి ముంబైకి వచ్చారు. ఈ సందర్భంగా రూ.18.6 కోట్ల విలువైన 25 కిలోల బంగారాన్ని అక్రమంగా తరలించేందుకు ప్రయత్నించారు. అయితే, నిఘా వర్గాల సమాచారంతో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ) అధికారులు తనిఖీలు చేయడంతో దొరికిపోయారు. వాస్తవానికి ఈ ఘటన ఏప్రిల్ 25న జరిగింది. పదిరోజులు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఒక్కోటి కిలో కడ్డీ..
వార్ధక్ వ్యవహారంపై సమాచారం అందుకున్న డీఆర్ఐ అధికారులు విమానాశ్రయంలో సిబ్బందిని మోహరించారు. తన కుమారుడితో కలిసి ఎమిరేట్స్ విమానంలో దుబాయ్ నుంచి వచ్చిన వార్దక్ కు తన దౌత్యవేత్త హోదా రీత్యా ఎటువంటి తనిఖీలు లేకుండా వెళ్లేందుకు గ్రీన్ ఛానల్ ఉంటుంది. దీంట్లోంచి వార్దక్ ఎయిర్ పోర్టు బయటకు వచ్చారు. కానీ, ఎగ్జిట్ వద్ద డీఆర్‌ఐ అధికారులు అడ్డుకున్నారు. బంగారం స్మగ్లింగ్ గురించి ప్రశ్నించగా.. ఆమె తోసిపుచ్చారు. దీంతో గదిలోకి తీసుకెళ్లి మహిళా అధికారులతో తనిఖీలు చేయిండంతో బండారం బయటపడింది. వార్దక్ జాకెట్, ప్యాంట్, మోకాలి క్యాప్, బెల్ట్‌లో ఏకంగా ఒక్కోటి కిలో బరువున్న 25 బంగారు కడ్డీలు బయటపడ్డాయి. వార్దక్ కుమారుడి వద్ద ఎలాంటి బంగారం లభించలేదు. కాగా, సరైన ఆధారాలు సమర్పించకపోవడంతో వార్దక్ నుంచి బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేశారు.
అరెస్టు లేదు..
భారీ స్మగ్లింగ్ కేసు అయినప్పటికీ వార్ధక్ ను అరెస్టు చేయలేదు. దౌత్యపరమైన రక్షణ ఉండడమే దీనికి కారణం. తనపై వస్తున్న ఆరోపణల పట్ల వార్దక్ స్పందించారు. ప్రస్తుతం తాను ముంబైలో లేనని, వచ్చాక అన్ని విషయాలను వెల్లడిస్తానని చెప్పారు.