మేడారం జాతరలో గవర్నర్ తూగిన బంగారం.. సీఎం లెక్క ఇంట్రస్టింగ్
సమ్మక్క.. సారలమ్మలు వన ప్రవేశం చసిన వేళలో.. ఈ ఇద్దరు ప్రముఖులు ఒకే రోజు వేర్వేరు సమయాల్లో మేడారానికి వెళ్లారు.
By: Tupaki Desk | 24 Feb 2024 4:10 AM GMTగిరిజన జాతరగా పేరున్న మేడారం జాతర ప్రతి రెండేళ్లకు ఒకసారి జరిగే అంశం తెలిసిందే. తెలంగాణ కుంభమేళాగా అభివర్ణించే ఈ జాతర కోసం లక్షలాది మంది పోటెత్తటం తెలిసిందే. తాజాగా జరుగుతున్న మేడారం జాతరకు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళ సై.. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలు వెళ్లటం తెలిసిందే. సమ్మక్క.. సారలమ్మలు వన ప్రవేశం చసిన వేళలో.. ఈ ఇద్దరు ప్రముఖులు ఒకే రోజు వేర్వేరు సమయాల్లో మేడారానికి వెళ్లారు.
మేడారం జాతరలో ప్రత్యేకత.. తమ బరువు ఉన్న బంగారం (బెల్లం) అమ్మవార్లకు ముడుపుగా చెల్లిస్తారు. ఈ క్రమంలో గవర్నర్ తమిళసై.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలు తమ బరువు బంగారాన్ని అమ్మవార్లకు సమర్పించారు. ఈ సందర్భంగా ఆసక్తికర లెక్క ఎదురైంది. గవర్నర్ తమిళ సై బరువు 60 కేజీలు కాగా.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బరువు 66 కేజీలుగా తేలింది.
ఈ మొత్తం బంగారాన్ని వారు వన దేవతలకు సమర్పించారు. మరి.. గవర్నర్.. ముఖ్యమంత్రులు తూగిన బెల్లం కొనుగోలుకు అయ్యే ఖర్చు ఎవరు భరించారన్నది ప్రశ్నగా నిలుస్తోంది. అధికార వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం గవర్నర్.. ముఖ్యమంత్రులు తూగిన బంగారాన్ని సంబంధిత అధికారులే చెల్లింపులు జరిపినట్లుగా చెబుతున్నారు. శుక్రవారం మేడారం జాతరకు తొలుత గవర్నర్ తమిళ సై వెళ్లగా.. ఆ తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమ్మవార్లను దర్శించుకున్నారు. బరువు విషయంలో గవర్నర్ కంటే ముఖ్యమంత్రి ఎక్కువగా ఉండటం అందరిని కూసింత ఆశ్చర్యానికి గురి చేసిందని చెప్పాలి.