గొల్లకు 'పెద్ద'పీట?.. ఇప్పుడు ఏమంటారు?
ఇప్పుడు అదే గొల్ల బాబూరావుకు సీఎం జగన్ పెద్దపీట వేశారు. ప్రస్తుతం ఖాళీ అవుతున్న మూడు రాజ్యసభ సీట్లలో ఒకటి గొల్ల బాబూరావుకు కేటాయిస్తూ.. తాజాగా నిర్ణయం ప్రకటించారు.
By: Tupaki Desk | 10 Jan 2024 3:50 AM GMTకొన్నిరోజులుగా సీఎం జగన్ ఎస్సీనాయకులకు అన్యాయం చేస్తున్నారని, వారికి కనీసం అప్పాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదని పదే పదే విమర్శలు తెరమీదికి వస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా విశాఖ జిల్లా పాయకరావుపేట ఎమ్మెల్యే, ఎస్సీ నాయకు డు గొల్ల బాబూరావుకు ఈ దఫా అసెంబ్లీ టికెట్ ఇవ్వడం లేదని పార్టీ అధిష్టానం నిర్ణయించింది. ఇదే విషయాన్ని ఆయనకు కూడా స్పష్టం చేసింది. దీంతో గొల్ల బాబూరావు కేంద్రంగా వైసీపీపై పలు పక్షాల నాయకులు విమర్శలు గుప్పించారు. ఎస్సీలకు అన్యాయం చేశారని.. నమ్మించి మోసం చేశారంటూ.. తీవ్ర వ్యాఖ్యలు సంధించాయి.
కట్ చేస్తే.. ఇప్పుడు అదే గొల్ల బాబూరావుకు సీఎం జగన్ పెద్దపీట వేశారు. ప్రస్తుతం ఖాళీ అవుతున్న మూడు రాజ్యసభ సీట్లలో ఒకటి గొల్ల బాబూరావుకు కేటాయిస్తూ.. తాజాగా నిర్ణయం ప్రకటించారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. అయితే.. గొల్ల బాబూరావుకు ఈ మేరకు వర్తమానం పంపించారు. ఈ నేపథ్యంలో వైపీపీ నాయకులు ఇటీవల విమర్శలు చేసిన వారిని ఇప్పుడు ఏమంటారు? అని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు.. మరో రెండు రాజ్యసభ స్థానాల్లో ఒకదానిని వైసీపీ ముఖ్య నాయకుడు, మాజీ ఎంపీ.. వైవీ సుబ్బారెడ్డికి కేటాయించారు.
ప్రస్తుతం వైవీ సుబ్బారెడ్డి.. ఉత్తరాంధ్ర జిల్లాల పార్టీ ఇంచార్జ్‌గా వ్యవహరిస్తున్నారు. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో ఈ ప్రాంతంలో పార్టీని గెలిపించే బాధ్యతలను ఆయన చూస్తున్నారు. వాస్తవానికి ఈ దఫా ఆయన విశాఖ లేదా.. ఒంగోలు నుంచి పార్లమెంటుకు పోటీ చేయాలని భావించారు. కానీ, రాజకీయ సమీకరణల నేపథ్యంలో వైవీని పక్కన పెట్టిన సీఎం జగన్.. ఆయనకు సంతృప్తి పరిచేందుకు రాజ్యసభ సీటును ఆఫర్ చేశారు. దీనిపైనా ఆయనకు వర్తమానం పంపించారు.
ఇక, మూడో రాజ్యసభ సీటును తూర్పుగోదావరిజిల్లాలో బలమైన సామాజిక వర్గంగా ఉన్న శెట్టి బలిజ సామాజిక వర్గానికి కేటాయించారు. ఈ సామాజిక వర్గానికి చెందిన జంగాలపల్లి శ్రీనివాస్‌కు కేటాయించారు. ఈయన కూడా పార్టీలో కీలక నేతగా ఉన్నారు. గత ఎన్నికల్లోనే టికెట్ ఆశించారు. అయితే.. అప్పుడు ఇప్పుడు కూడా ఈక్వేషన్లు కుదరలేదు. దీంతో ఆయనను ఇప్పుడు రాజ్యసభకు పంపిస్తున్నారు. ఎన్నికలకుముందు ఒక ఎస్సీ, ఒక శెట్టిభలిజ సామాజిక వర్గాలకు పెద్దపీట వేయడం ఎన్నికల్లో ప్రభావం చూపుతుందని వైసీపీ నాయకులు భావిస్తున్నారు.