Begin typing your search above and press return to search.

ఇండియాలోనే... ప్లాస్టిక్‌ తెండి పాఠశాలలో చేరండి!

అవును... అసోంలోని ఓ స్కూల్లో ఫీజ్ బదులు వేస్ట్ ప్లాస్టిక్ ని తీసుకుంటున్నారు.

By:  Tupaki Desk   |   25 April 2024 12:30 PM GMT
ఇండియాలోనే... ప్లాస్టిక్‌  తెండి పాఠశాలలో చేరండి!
X

ఈ భూగోళానికి ప్లాస్టిక్ వ్యర్థాలు అతిపెద్ద పర్యావరణ ప్రమదకారులుగా తయారవుతున్నాయన్న సంగతి తెలిసిందే! వీలైనంత వరకూ ప్లాస్టిక్ వాడకం తగ్గించాలని పర్యావరణవేత్తలు కోరుతుంటారు. గ్లోబల్ వార్మింగ్ ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి ఇది అతిపెద్ద మార్గం అని అంటుంటారు. ఈ సమయంలో... ఈ వేస్ట్ ప్లాస్టిక్ తెస్తే స్కూల్ ఫీజు కట్టినట్లే అనే స్కూల్ ఒకటి ఉంది.. అదీ ఇండియాలోనే..!

అవును... అసోంలోని ఓ స్కూల్లో ఫీజ్ బదులు వేస్ట్ ప్లాస్టిక్ ని తీసుకుంటున్నారు. పైగా ఎంత ఎక్కువ వేస్ట్‌ తెస్తే అంత మెచ్చుకుంటారు కూడా. సుమారు 2016 నుంచి ఈ పాఠశాలల్లో ఫీజు బదులు ప్లాస్టిక్ వేస్ట్ నే చెల్లించాలని కొత్త విధానాన్ని తీసుకొచ్చారు. దీని వెనుక ఎంతో గొప్ప ఆలోచన, మరెంతో గొప్ప దూరదృష్టి ఉన్నాయి! ఇద్దరు పర్యావరణ ప్రేమికులు స్థాపించిన ఈ స్కూలు విశేషలేమిటో ఇప్పుడు చూద్దాం...!

పర్మితా శర్మ, మజిన్‌ ముక్తార్‌ అనే పర్యావరణ ప్రేమికుల, బాలల హితులు ఒక వినూత్న ఆలోచన చేశారు. ఇందులో భాగంగా.. 2016లో అసోంలోని పమోహీలో "అక్షర్‌" పేరుతో వీరిద్దరూ ఒక పాఠశాల స్థాపించారు. దీనిని విభిన్నంగా నడపాలని నిశ్చయించుకున్నారు. ఇదే క్రమంలో... చదువు, స్కిల్స్ తో పాటు ప్రధానంగా పర్యావరణ స్పృహ సిలబస్‌ గా ఉండాలనుకున్నారు.

ఈ నేపథ్యంలో... ఫీజు కట్టాలంటే నోట్లు తేవద్దు.. ప్లాస్టిక్ వేస్ట్‌ తెమ్మంటూ చెప్పసాగారు. ఇందులో భాగంగా... వీలైనన్ని ఎక్కువ ప్లాస్టిక్‌ వ్యర్థాలు తీసుకెళ్తే.. ఫీజు కట్టినట్లుగా రసీదు కూడా ఇస్తారు. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే... ఇక్కడ విద్యార్థులను వారి వయసును బట్టి కాకుండా అవగాహన స్థాయిని బట్టి తరగతుల్లో వేస్తారు.

ఈ ఆలోచన వెనకున్న కారణం ఇదే!:

అసోంలో చలి ఎక్కువగా ఉండటంతో అక్కడ అంతా ప్లాస్టిక్ వ్యర్థాలతో చలి మంట వేసుకుంటారు. అక్కడ కట్టేలు చాలా కాస్ట్లీ కావడమే అందుకు కారణం అని చెబుతుంటారు. ఇలా ప్లాస్టిక్ వ్యర్ధాలతో మంట వేసుకోవడంతో అందులో నుంచి వచ్చే పొగ పీల్చడం అత్యంత ప్రమాదకరం అని ఎంత చెప్పినా అక్కడి ప్రజలు వినేవారు కాదు. ఈ సమయంలోనే సామాజిక కార్యకర్త అయిన పర్మితా శర్మకు ఒక ఆలోచన వచ్చింది.

తన మిత్రుడు, అమెరికాలో బాలల విద్యారంగంలో పని చేస్తున్న నిపుణులు మజిన్‌ తో తన ఆలోచనను పంచుకుంది. అస్సాంలోని పరిస్థితులను వివరించింది. అలా వారిద్దరి ఆలోచనలో నుంచి పుట్టుకొచ్చిందే "అక్షర్‌" విద్యాలయం. ఇక్కడ స్కూల్ అయిపోయిన తర్వాత పిల్లలతో ప్లాస్టిక్ రీసైక్లింగ్ చేయిస్తారు.

నెదర్లాండ్స్‌ నుంచి తెప్పించిన మెషినరీ ద్వారా ప్లాస్టిక్‌ రీసైక్లింగ్‌ చేసి ఇటుకలు తయారు చేస్తారు. వీటిని నిర్మాణాల్లో వాడొచ్చు. వీటితో పాటు పూలకుండీలు, బౌల్స్‌ వంటివి ఈ ప్లాస్టిక్‌ వ్యర్థాలతోనే తయారు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటి వరకూ సుమారు రెండున్నర వేల ప్లాస్టిక్‌ బాటిళ్లు, ఏడు లక్షల ప్లాస్టిక్‌ కవర్లు ఇక్కడ రీసైకిల్‌ అయ్యాయని చెబుతున్నారు.