కవితకు గుడ్ న్యూస్... లిక్కర్ స్కాం అంతే సంగతులు
ఈ కుంభకోణంలో విచారణ ఎదుర్కుంటున్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ప్రకారం ఆమెకు ఉపశమనం దక్కింది.
By: Tupaki Desk | 26 Sep 2023 12:34 PM GMTతెలంగాణలో అధికార బీఆర్ఎస్ పార్టీని కలవరపాటుకు గురిచేస్తున్న ఢిల్లీ మద్యం కుంభకోణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కుంభకోణంలో విచారణ ఎదుర్కుంటున్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ప్రకారం ఆమెకు ఉపశమనం దక్కింది. నవంబర్ 20కి విచారణ వాయిదా వేయగా ఆ తేదీలోగా మద్యం కుంభకోణంలో ఈడీ కార్యాలయానికి పిలిపించి ప్రశ్నించబోమని ఈడీ తెలిపింది.
మద్యం కుంభకోణంలో తన హక్కులకు భంగం కలిగించేలా ఈడీ విచారణ సాగుతోందని సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవిత పిటిషన్ దాఖలు చేశారు. జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ సుధాన్షు ధులియాతో కూడిన ద్విసభ్య ధర్మాసనం కవిత పిటిషన్‌ను విచారించి మహిళల విచారణలో తగిన ముందస్తు చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని తెలిపింది. విచారణను నవంబర్ 20వరకు వాయిదా వేసిన సుప్రీంకోర్టు.. అప్పటి వరకు కవితకు సమన్లు జారీ చేయవద్దని ఈడీని ఆదేశించింది. సుప్రీంకోర్టు విచారణను వాయిదా వేసిన నేపథ్యంలో ఈడీ తగు రీతిలో స్పందించింది. సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించేంత వరకు కవితకు సమన్లను జారీ చేయబోమని ప్రకటించింది.
సుప్రీంకోర్టులో కేసు విచారణలో ఉండగా సమన్లు జారీ చేయడం తగదని గత విచారణలో ఈడీ సమన్లను కవిత తప్పుబట్టారు. తాజా విచారణలోనూ ఈ మేరకు ప్రజాప్రతినిధి, మహిళగా తన హక్కులకు భంగం కలుగుతోందన్న వాదనను ఎమ్మెల్సీ కవిత తరఫు న్యాయవాది వాదించగా ధర్మాసనం ఏకీభవించి ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది. కాగా, కవిత కేంద్రంగా గులాబీ పార్టీని టార్గెట్ చేయడం, త్వరలోనే కవిత అరెస్టు అంటూ ప్రచారం చేస్తున్న వారికి ఇది ఊహించని షాక్ అని బీఆర్ఎస్ వర్గాలు పేర్కొంటున్నాయి.