గూగుల్ మ్యాప్ తో బయలుదేరితే.. వరదలో చిక్కుకుపోయాడు
విజయవాడకు చేరేందుకు గూగుల్ మ్యాప్ సాయం తీసుకున్నాడు. ఈ మ్యాప్ లో సావరగూడెం - కేసరపల్లి మీదుగా చూపటంతో ఆ మార్గాన్ని ఎంచుకున్న గౌతమ్ కారును డ్రైవ్ చేసుకుంటూ ముందుకు సాగాడు.
By: Tupaki Desk | 7 Sept 2024 9:30 AMఈ ఉదంతాన్నిచదివిన తర్వాత అప్రయత్నంగా నోటి నుంచి వచ్చే మాట.. ‘గ్రేట్ ఎస్కేప్’. అవును.. వరద ప్రాంతాన్ని టచ్ చేయకుండా.. ఇంటికి తన కుటుంబాన్ని తీసుకెళ్లాలని భావించిన యువకుడు ఒకరు ఏకంగా వరదలో చిక్కుకుపోవటమే కాదు.. ప్రాణాపాయం నుంచి త్రుటిలో తప్పించుకున్న షాకింగ్ ఉదంతంగా దీన్ని చెప్పాలి. ఇంతకూ అసలేం జరిగిందన్న వివరాల్లోకి వెళితే..
విజయవాడ రూరల్ మండలం నున్నకు చెందిన గౌతమ్ విజయవాడలో పీజీ వైద్య విద్యను అభ్యసిస్తున్నాడు.
పది రోజులుగా వరదల కారణంగా సొంతింటికి వెళ్లటం కుదర్లేదు. యనమలకుదురులోని బంధువులు.. ఫ్రెండ్స్ ఇంట్లో కాలం వెళ్లదీస్తూ ఉన్నాడు. శుక్రవారం వాతావరణం కాస్తంత పొడిగా ఉండటంతో గన్నవరం మండలం పురుషోత్తపట్నం మీదుగా నున్నకు వెళ్లాడు. అక్కడి నుంచి తల్లిని తీసుకొని విజయవాడకు కారులో బయలుదేరాడు.
విజయవాడకు చేరేందుకు గూగుల్ మ్యాప్ సాయం తీసుకున్నాడు. ఈ మ్యాప్ లో సావరగూడెం - కేసరపల్లి మీదుగా చూపటంతో ఆ మార్గాన్ని ఎంచుకున్న గౌతమ్ కారును డ్రైవ్ చేసుకుంటూ ముందుకు సాగాడు. అయితే.. కేసరపల్లి రూట్లో వరద వస్తుందన్న విషయం తెలియని గౌతమ్.. తన కారుతో వరదలో చిక్కుకుపోయాడు. వరద ఎక్కువగా ఉండటంతో.. కారు వరదలో చిక్కుకుపోయింది.
కారు డోర్లు క్లోజ్ అయ్యాయి. డోర్లు తెరిచే ప్రయత్నం చేసినా.. సాధ్యం కాలేదు. దీంతో.. అవి ఓపెన్ చేయటం సాధ్యం కాకపోవటంతో.. అద్దాలు తెరిచే ప్రయత్నం చేసినా సాధ్యం కాలేదు. దీంతో.. జిల్లా కంట్రోల్ రూంతో పాటు.. పలువురు రాజకీయ నేతలకు ఫోన్ చేశారు. వారు స్పందించి.. స్థానికుల్ని అలెర్టు చేయటంతో.. వారంతా వచ్చి కారు అద్దాల్ని పగలగొట్టి.. గౌతమ్ ను.. అతడి తల్లిని రక్షించి.. వరద నుంచి ఒడ్డుకు తీసుకొచ్చారు. ఈ ఉదంతం గురించి చదివాక.. ఎంత లక్కీ అని అనుకోకుండా ఉండలేం.