గూగులమ్మను నమ్ముకొని ఆ ఫ్యామిలీ అడవిపాలైంది!
ఇలాంటివేళ.. గూగులమ్మ ఇచ్చే షాకులకు దిమ్మ తిరిగిపోతోంది. తాజాగా అలాంటి ఇబ్బందికర పరిస్థితిని ఒక కుటుంబం ఎదుర్కొంది.
By: Tupaki Desk | 7 Dec 2024 4:53 AM GMTకాలం మారింది. అత్యాధునిక సాంకేతికత అరచేతిలోకి వచ్చేసింది. ప్రపంచంలో ఎక్కడకు వెళ్లాలన్నా.. ఎక్కడకు వెళ్లినా.. గూగులమ్మను ఓపెన్ చేయటం.. వెళ్లాల్సిన లొకేషన్ ను టైప్ చేసేయటం ఒక అలవాటుగా మారింది. గూగులమ్మను అడగాలే కానీ ఎక్కడికైనా తీసుకెళుతుందన్న గుడ్డి నమ్మకం అందరిలోనూ ఎక్కువైంది. ఇలాంటివేళ.. గూగులమ్మ ఇచ్చే షాకులకు దిమ్మ తిరిగిపోతోంది. తాజాగా అలాంటి ఇబ్బందికర పరిస్థితిని ఒక కుటుంబం ఎదుర్కొంది.
గూగుల్ మ్యాప్స్ సాయంతో గమ్యస్థానానికి చేరుకోవాల్సిన వారు చివరకు అడవిపాలు కావాల్సి వచ్చింది. షాకింగ్ గా మారిన ఈ ఉదంతంలోకి వెళితే.. బిహార్ కు చెందిన రాజదాస్ రణజిత్ దాస్ అనే వ్యాపారి ఉజ్జయిని నుంచి గోవాకు తన కుటుంబంతో కారులో జర్నీకి ప్లాన్ చేసుకున్నారు. గూగుల్ మ్యాప్ వేసుకొని వెళుతున్న వారికి అనుకోని చేదు అనుభవం ఎదురైంది.
గూగుల్ మ్యాప్ లో చెప్పినట్లుగా ప్రయాణించగా.. శిరోరి - హెమ్మడగా మధ్యలో దారి తప్పారు. మ్యాప్ ను నమ్ముకున్న నేపథ్యంలో వారి కారు అడవిలోకి వెళ్లిపోయారు. అక్కడ మొబైల్ నెట్ వర్కు లేకపోవటంతో కారులోనే బిక్కుబిక్కుమంటూ ఉండిపోయారు. మొబైల్ నెట్ వర్క్ లభించిన తర్వాత పోలీసులకు సమాచారం అందించారు. వారిచ్చిన సమాచారంతో ఖానాపుర పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని వారిని రక్షించారు. అక్కడి నుంచి గోవాకు వెళ్లే మార్గాన్ని అందించటంతో ఆ కుటుంబం అక్కడి నుంచి బయలుదేరింది. గూగుల్ మ్యాప్ ను నమ్ముకోవటంలో తప్పు లేదు. కానీ.. ఆ క్రమంలో మనిషికి ఉండాల్సిన విచక్షణను మిస్ కాకూడదు. టెక్నాలజీలో లోపాలు కామన్. అందుకే కేర్ ఫుల్ గా ఉండటం చాలా అవసరం.