రోడ్డు ఉందంటూ ఏటిలోకి తీసుకెళ్లిన గూగుల్ మ్యాప్!
ఈ రోజుల్లో ఎక్కడికి వెళ్లాలన్నా... ఎంత చిన్న సందులో తిరగాలన్నా గూగుల్ మ్యాప్ సాయం ఉంటే చాలనేది తెలిసిన విషయమే
By: Tupaki Desk | 7 Sep 2023 3:30 PM GMTఈ రోజుల్లో ఎక్కడికి వెళ్లాలన్నా... ఎంత చిన్న సందులో తిరగాలన్నా గూగుల్ మ్యాప్ సాయం ఉంటే చాలనేది తెలిసిన విషయమే. కరెక్ట్ అడ్రస్ ఉంటే... గూగుల్ మ్యాప్ చేయిపట్టుకుని గమ్యస్థానానికి తీసుకుని వెళ్లిపోతుంది. ఈ కాలంలో మెజారిటీ ప్రయాణికులకు గూగుల్ మ్యాపే మార్గదర్శి! అయితే తాజాగా ఈ మ్యాప్ లారీని ఏటిలోకి తీసుకెళ్లింది!
అవును... గూగుల్ మ్యాప్ లో రోడ్డూ కనిపిస్తుంది.. గో స్ట్రైట్ అంటూ వాయిస్ వినిపించింది.. గూగుల్ పై ఉన్న నమ్మకంతో ఒక లారీ డ్రైవర్ అలా ముందుకు పోనిచ్చాడు. ఎదురుగా నీళ్లున్నా.. చీకట్లో వర్షపు నీరనుకునేంతగా గూగుల్ ని నమ్మాడు. తీరా చూస్తే లారీ సగానికిపైగా మునిగిన తర్వాత... ఇది రోడ్డు కాదని తెలుసుకున్నాడు.
వివరాళ్లోకి వెళ్తే... తాజాగా తమిళనాడుకు చెందిన లారీ రాత్రి చేర్యాల మీదుగా హుస్నాబాద్ వస్తోంది. అయితే ఈ రూట్ పై లారీ డ్రైవర్ కు, క్లీనర్ కు సరైన అవగాహన లేదు. దీంతో ఫోన్ ఆన్ చేసీ గూగుల్ ని అడిగారు. వెంటనే గూగుల్ మ్యాప్ లో దారి వచ్చేసింది. దీంతో హాయిగా ముందుకు వెళ్తున్నారు.
ఇలా సాగిపోతున్న వారి ప్రయాణం సిద్దిపేట జిల్లాలోని అక్కన్నపేట మండలం గుడాటిపల్లికి చేరుకునే సరికి నీళ్లు కనిపించాయి. చీకట్లో ఆ నీటిని వాననీరు నిలిచి ఉంటుంది అనుకున్నారు. అలా కాస్త ముందుకు వెళ్లగానే లోతు పెరిగి లారీ క్యాబిన్ వరకు నీళ్లు వచ్చేశాయి. దీంతో లారీని అక్కడే ఆపేసి వారిద్దరూ కిందకు దిగి మెల్లగా సమీపంలోని రామవరం వచ్చారు.
అనంతరం జరిగిన విషయాన్ని గ్రామస్థులకు చెప్పారు. దీంతో విషయం తెలుసుకున్న స్థానిక ఎంపీటీసీ సభ్యుడు, సర్పంచి, మరికొంతమంది యువకులు లారీ దగ్గరకు వెళ్లారు. అనంతరం తాళ్లు కట్టి లారీని వెనక్కు లాగే ప్రయత్నం చేశారు. దీంతో అతికష్టం మీద లారీ బయటకు వచ్చింది. అనంతరం అది గౌరవెల్లి జలాశయం అని తెలిసింది.
అయితే... ఈ రహదారిపై నందారం స్టేజీ వద్ద రోడ్డు స్టాపర్లను ఏర్పాటు చేసి వాహనాలను అక్కడి నుంచి బైపాస్ రోడ్డు ద్వారా మళ్లించారు. ప్రాజెక్టు పనులు జరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే స్టాపర్లు రోడ్డు పక్కన పడిపోవడం.. వాటిని ఎవరూ పట్టించుకోకపోవడంతో.. లారీ నేరుగా ముందుకు వెళ్లిపోయింది. దీంతో ఇప్పటికైనా దారి పూర్తిగా మూసేయాలని కోరుతున్నారు.