Begin typing your search above and press return to search.

వందల ఏళ్లు ఏలిన ఆ దేశంలో మనోడే అత్యంత సంపన్నుడు

వందల ఏళ్లు మనల్ని పాలించి.. మన మూలాల్ని మార్చేసి.. మనకంటూ ఒక గుర్తింపు లేకుండా చేసిన దరిద్రపుగొట్టు దేశం ఏదైనా ఉందంటే అది గ్రేట్ బ్రిటన్ గా చెప్పాలి

By:  Tupaki Desk   |   21 May 2024 4:30 AM GMT
వందల ఏళ్లు ఏలిన ఆ దేశంలో మనోడే అత్యంత సంపన్నుడు
X

వందల ఏళ్లు మనల్ని పాలించి.. మన మూలాల్ని మార్చేసి.. మనకంటూ ఒక గుర్తింపు లేకుండా చేసిన దరిద్రపుగొట్టు దేశం ఏదైనా ఉందంటే అది గ్రేట్ బ్రిటన్ గా చెప్పాలి. ఆధునిక యుగంలో భారత్ వెనుకబడి ఉండటానికి కారణం.. బ్రిటీష్ ప్రభుత్వం భారత దేశాన్ని తన చెప్పు చేతల్లో ఉంచుకోవటం ద్వారా తీవ్రమైన వెనుకబాటులోకి వెళ్లేలా చేశారు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. కోట్లాది మంది ప్రాణాలు పోయేందుకు కారణమైన బ్రిటన్ లో ఇప్పుడు అత్యంత ధనికుడిగా భారత మూలాలు ఉన్న వ్యక్తి నిలవటం ఆసక్తికరంగా మారింది. టైం పవర్ అంటే ఇదేనేమో అన్నట్లుగా ఉన్న ఈ వ్యవహరాన్ని చూస్తే..

ది సండే టైమ్స్ రిచ్ లిస్ట్ తాజా నివేదిక ప్రకారం యూకేలోని టాప్ 1000 మంది సంపన్నులు.. సంపన్న కుటుంబాల జాబితాలో భారత సంతతికి చెందిన వ్యాపారవేత్త గోపీచంద్ హిందూజా మొదటిస్థానంలో నిలిచారు. హిందూజా గ్రూప్ ఛైర్మన్ అయిన ఆయన.. ఈ ఘనతను సాధించారు. ఇప్పటికే ఆ దేశ ప్రధానిగా భారత మూలాలు ఉన్న రిషి ఉండటం తెలిసిందే. గడిచిన ఆరేళ్లుగా బ్రిటన్ లో అత్యంత సంపన్నులుగా హిందూజా కుటుంబం నిలుస్తుందని చెబుతున్నారు.

ర్యాంకింగ్ ఆధారంగా చూస్తే హిందూజా నెట్ వర్త్ అంతకు ముందు సంవత్సరాల్లో 35 బిలియన్ పౌండ్ స్టెర్లింగ్స్ అంటే మన రూపాయిల్లో చెప్పాలంటే రూ.3.7 లక్షల కోట్ల నుంచి రూ.3.9 లక్షల కోట్లకు పెరిగినట్లుగా పేర్కొన్నారు. గోపీచంద్ హిందూజా 1940లో భారత్ లో జన్మించారు. 1959లో ముంబయిలోని జైహింద్ కాలేజ్ నుంచి లా పట్టాను అందుకున్న ఆయన.. వెస్ట్ మినిస్టర్ వర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ ను సొంతం చేసుకున్నారు. గత ఏడాది తన సోదరుడు శ్రీచంద్ హిందూజా మరణించిన తర్వాత తన వ్యాపారాలకు నాయకత్వం వహిస్తున్నారు గోపీచంద్ హిందూజా.