Begin typing your search above and press return to search.

తెలుగోళ్ల మనసుల్ని దోచేసిన తమిళనాడు ఎంపీ

అలాంటిది అమ్మభాషను అమితంగా ఆరాధించే తమిళనాడుకు చెందిన ఎంపీ ఒకరు తెలుగులో ప్రమాణస్వీకారం చేసిన వైనం ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది.

By:  Tupaki Desk   |   26 Jun 2024 4:22 AM GMT
తెలుగోళ్ల మనసుల్ని దోచేసిన తమిళనాడు ఎంపీ
X

అచ్చ తెలుగు నేల నుంచి పోటీ చేసి ఎంపీలుగా గెలిచిన చాలామంది అమ్మభాష అయిన తెలుగులో ప్రమాణస్వీకారం చేయని తీరును చూస్తున్నాం. తెలుగులో ప్రమాణం చేసినా.. వారిలో కొందరు తడబడే పరిస్థితి. అలాంటిది అమ్మభాషను అమితంగా ఆరాధించే తమిళనాడుకు చెందిన ఎంపీ ఒకరు తెలుగులో ప్రమాణస్వీకారం చేసిన వైనం ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది. తెలుగు ప్రజల్లో హాట్ టాపిక్ గా మారారు. ఇంతకు ఆయన ఎవరు? ఆ ఎంపీ బ్యాక్ గ్రౌండ్ ఏమిటి? తమిళనాడు ఎంపీ అయి ఉండి.. తెలుగులో ప్రమాణస్వీకారం చేయటం ఏమిటి? అందుకు ఏదైనా ప్రత్యేక కారణం ఉందా? లాంటి ప్రశ్నలు పలువురిని తొలిచేస్తున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే..

తమిళనాడులోని క్రిష్ణగిరి ఎంపీ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు కె.గోపీనాధ్. మంగళవారం జరిగిన ఎంపీ ప్రమాణస్వీకారంలో భాగంగా స్పీకర్ పోడియం వద్దకువెళ్లిన ఆయన సభకు నమస్కారం అంటూ తెలుగులో ప్రమాణాన్ని మొదలు పెట్టారు. చూస్తుండగానే.. తన ప్రమాణస్వీకారం మొత్తాన్ని తెలుగులోనే పూర్తి చేయటంతో తెలుగు ఎంపీలంతా ఆశ్చర్యపోయిన పరిస్థితి. ఒక్కసారిగా ఆయన ఎవరన్న విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేశారు పలువురు తెలుగు ఎంపీలు.

తన ప్రమాణస్వీకారాన్ని తెలుగులో పూర్తి చేసిన ఆయన చివర్లో మాత్రం తాను ప్రాతినిధ్యం వహిస్తున్న తమిళనాడుకు సంబంధించి నండ్రి.. వణక్కం.. జైతమిళనాడు అంటూ తమిళంతో ముగించారు. ఏమైనా.. తెలుగులో ప్రమాణస్వీకారం చేసిన తమిళ ఎంపీ వ్యవహారం ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది. ఇంతకూ గోపీనాధ్ తెలుగులో ప్రమాణం చేయటానికి ప్రత్యేక కారణం ఉందని చెబుతున్నారు.

ఆయన అమ్మభాష తెలుగే. అర్థం కాలేదా? ఆయన తమిళనాడులో స్థిరపడిన తెలుగువాడు. గోపీనాధ్ బ్యాక్ గ్రౌండ్ చూస్తే.. తమిళనాడులోని హోసూర్ నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఈసారి క్రిష్ణగిరి ఎంపీ స్థానం నుంచి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. క్రిష్ణగిరి.. హోసూర్ ఏపీ సరిహద్దుకు దగ్గరగా ఉంటాయి. ఆ మాటకు వస్తే తెలుగు రాష్ట్రాల్లో మాదిరి హోసూర్ లో తెలుగు పేపర్లు కూడా ఉదయాన్నే చాలా షాపుల్లో అమ్ముతూ కనిపిస్తూ ఉంటుంది. ఏమైనా.. ఉన్నత స్థానానికి చేరుకున్న తర్వాత కూడా అమ్మభాషను మర్చిపోని గోపీనాధ్ చాలామంది తెలుగు ఎంపీలకు కొత్త స్ఫూర్తిగా నిలుస్తారనటంలో ఎలాంటి సందేహం లేదు.