గోరంట్ల మాధవ్ కు నో గ్యాప్.. తాజాగా మరో బిగ్ షాక్!
మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ కు విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 28 Feb 2025 10:50 AM GMTమాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ కు విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. అత్యాచార బాధితుల పేర్లు బహిర్గతం చేసిన కేసులో.. గురువారం సాయంత్రం అనంతపురంలోని మాధవ్ ఇంటికి చేరుకున్న పోలీసులు నోటీసులు జారీ చేశారు. అనంతరం మాధవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో.. ఆ వ్యాఖ్యలపై తాజాగా మరోకేసు నమోదైంది.
అవును... వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ కు విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా మార్చి 5వ తేదీ ఉదయం 10 గంటలకు విజయవాడ సూర్యారావుపేటలోని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.
ఈ సందర్భంగా స్పందించిన మాధవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా... తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులు చేసుకుంటూపోతే రాష్ట్రంలో కచ్చితంగా అంతర్యుద్ధం రావడానికి ఎంతో దూరం లేదని వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో.. రాష్ట్రంలో రాజ్యాంగం కల్పించిన భావప్రకటన స్వేచ్ఛను కూటమి ప్రభుత్వం ఉక్కుపాదంతో అణిచివేస్తోందని అన్నారు.
ఈ సందర్హంగా... నేరస్థులను అరెస్ట్ చేయకుండా.. నేరం జరిగిన విధానాన్ని ప్రశ్నిస్తే కేసులు నమోదు చేయడం ఎంత వరకూ సమంజసమని ప్రశ్నించారు. ఏది ఏమైనా... పోలీసులకు తను కచ్చితంగా సహకరిస్తానని మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ తెలిపారు. ఈ నేపథ్యంలోనే తాజాగా అనంతపురంలో మరోకేసు నమోదైంది.
ఇలా తనకు విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు నోటీసులు ఇచ్చిన అనంతరం స్పందిస్తూ... వైసీపీ నేతలను అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని.. ఇలానే చేసుకుంటూపోతే రాష్ట్రంలో అంతర్యుద్ధం మొదలవుతుందని చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో... అతనిపై చర్యలు తీసుకోవాలని కూటమి నేతలు అనంతపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కాగా... గత ఏడాది అక్టోబర్ 21న గోరంట్ల మాధవ్ అనంతపురంలోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడుతూ.. కొన్ని ప్రాంతాల్లో అత్యాచారం, హత్యకు గురైన బాధితుల పేర్లు బహిర్గతం చేశారు! ఈ నేపథ్యంలోనే రాష్ట్ర మహిళా కమిషన్ మాజీ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ అదే ఏడాది నవంబర్ లో విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులకు మాధవ్ పై ఫిర్యాదు చేశారు.
దీంతో... సెక్షన్ 23(4), ఆఫ్ పోక్సో, బీ.ఎన్.ఎస్.ఎస్. 72, 79 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. ప్రస్తుతం ఇదే కేసులో సైబర్ క్రైమ్ పోలీసులు విచారించనున్నారు. మరి తాజాగా అనంతపురంలో అందిన ఫిర్యాదును ఏ మేరకు సీరియస్ గా తీసుకుంటారనేది వేచి చూడాలి!