గోరంట్ల మాధవ్ కి విషయం అర్ధమైందా?
ఈ నేపథ్యంలో హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా వైసీపీ అధిష్టానం చేపట్టిన ఇన్ ఛార్జ్ ల మార్పుల అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు.
By: Tupaki Desk | 28 Dec 2023 8:55 AM GMTఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలో అధికార వైసీపీ చేపడుతున్న ఇన్ ఛార్జ్ ల మార్పు అంశం ఆసక్తికరంగా మారిన సంగతి తెలిసిందే. ఇప్పటికే అధికారికంగా మంత్రులతో కలిపి 11 నియోజకవర్గాలకు ఇన్ ఛార్జ్ లను మార్చిన జగన్... త్వరలో మరికొన్ని నియోజకవర్గాలలోనూ మర్పులు, చేర్పులూ తప్పవనే సంకేతాలు ఇస్తున్నారని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో హిందూపురం లోక్ సభ సభ్యులు గోరంట్ల మాధవ్ స్పందించారు.
అవును... వచ్చే ఎన్నికల్లో వైఇసీపీ నేతల్లో ఎవరికి టిక్కెట్ కన్ ఫాం, మరెవరికి మార్పు తధ్యం, ఇంకెవరికి స్థాన చలనం అనే విషయాలపై చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలువురు కీలక నేతలు, మంత్రులు, మాజీ మంత్రులు ఈ విషయాలపై బహిరంగంగానే స్పందించారు. తామంతా జగన్ సైన్యమని.. క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలమని.. జగన్ టిక్కెట్ ఇస్తే ఎన్నికల్లో పోటీ చేస్తాం, ఇవ్వకపోతే కార్యకర్తగా పనిచేస్తాం అని స్పష్టం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి ఒకరిద్దరు నేతల నుంచి మినహా... దిక్కార స్వరాలు తెరపైకి వచ్చిన దాఖలాలు లేవు. ఈ నేపథ్యంలో హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా వైసీపీ అధిష్టానం చేపట్టిన ఇన్ ఛార్జ్ ల మార్పుల అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా.. తనకు టిక్కెట్ వస్తోందో రాదో తెలియదు అని అన్నారు.
ఇదే సమయంలో... తనకు టిక్కెట్ వచ్చినా రాకపోయినా... వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎవరికి టికెట్ ఇచ్చినా... జెండా మోసే కార్యకర్తగా వారి గెలుపు కోసం పనిచేస్తాను అని మాధవ్ ప్రకటించారు. ఇదే సమయంలో అధిష్టానం నుంచి తనకు ఇప్పటివరకూ ఎటువంటి పిలుపూ అందలేదన్న ఆయన.. ఉమ్మడి అనంతపురం జిల్లాలో కురబ సామాజిక వర్గం బలంగా ఉందని గుర్తుచేయడం గమనార్హం.
అనంతరం తాను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సైనికుడిని అని చెబుతున్న మాధవ్... జగన్ మాటే తనకు శిరోధార్యం అని స్పష్టం చేశారు. ఇక పనితీరుతో పాటు సర్వేలు, సమాజిక సమీకరణల ప్రాతిపదికన అభ్యర్థుల ఎంపిక జరుగుతోంని.. ఈ సమయంలో జగన్ తనను ఎక్కడికి వెళ్లమంటే అక్కడికి వెళ్తానని తెలిపారు. ఈ సందర్భంగా... అన్ని కులాలకు, మతాలకు చట్ట సభల్లో ప్రాతినిధ్యం ఉండాలనేది జగన్ ధ్యేయమని మాధవ్ వెల్లడించారు.
కాగా, ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీ అధికారపార్టీలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ప్రధానంగా అనేక సమీకరణల దృష్ట్యా పలు స్థానాల్లో అభ్యర్థుల మార్పులు చేర్పులకు జగన్ శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలోనే మాధవ్ ఈ విధంగా స్పందించారు.