Begin typing your search above and press return to search.

వైసీపీ ఎంపీ అదృష్టం కరిగిపోయిందా...జాక్ పాట్ కొట్టినా...?

అయితే ఎంపీ లక్ ని ఆయన సజావుగా వాడుకోలేదా అన్న చర్చ అయితే ఉంది. ఆయన దూకుడు రాజకీయమే కొంప ముంచిందా అన్న చర్చ సాగుతోంది.

By:  Tupaki Desk   |   31 Aug 2023 11:52 AM GMT
వైసీపీ ఎంపీ అదృష్టం కరిగిపోయిందా...జాక్ పాట్ కొట్టినా...?
X

ఆయన పూర్వాశ్రమంలో పోలీసు అధికారి. ఆయన వృత్తిపరంగా దూకుడు చూపించేవారు. అది నచ్చి వైసీపీ అధినాయకత్వం ఆయనకు భారీ ఆఫర్ ని అందించింది. అలా అనుకోని వరం అందుకున్న వారే హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్. ఆయన 2019 ఎన్నికల ముందు తాను చేస్తున్న పోలీస్ ఉద్యోగానికి రాజీనామా చేసి మరీ పార్టీలో చేరారు. అనూహ్యంగా ఆయన ఆ సీటుని దక్కించుకున్నారు. హిందూపురం అంటేనే టీడీపీకి పెట్టని కోట. అలాంటి సీట్లో మాధవ్ పోటీకి దిగి ఏకంగా ఎంపీ అయిపోయారు.

అయితే ఎంపీ లక్ ని ఆయన సజావుగా వాడుకోలేదా అన్న చర్చ అయితే ఉంది. ఆయన దూకుడు రాజకీయమే కొంప ముంచిందా అన్న చర్చ సాగుతోంది. ఎందుకంటే ఆయన రాజకీయ జీవితం ఇపుడు డైలామాలో పడింది అని అంటున్నారు. వన్ టైం ఎంపీగానే ఆయన పాలిటిక్స్ ముగిసిపోతుందా అన్న చర్చ కూడా సాగుతోంది.

ఎంపీ మాధవ్ వీడియో ఒకటి గత ఏడాది ఏపీ రాజకీయాలలోనే కాదు ఢిల్లీ దాకా హల్ చల్ చేసి ఎంత రచ్చ చేసిందో అందరికీ తెలిసిందే. ఆయనను సమర్ధించలేక పార్టీ నానా పాట్లూ పడిన సందర్భం అది. ఆ ఘటనతో వైసీపీ హై కమాండ్ ఆయన మీద పెట్టుకున్న నమ్మకం వమ్ము అయింది అని అంటున్నారు.

ఇదిలా ఉంటే హిందూపురం పార్లమెంట్ పరిధిలో వైసీపీ వరస సర్వేలు చేయిస్తోంది. ఈ సర్వేలలో గోరంట్ల మాధవ్ పనితీరు మీద తీవ్ర వ్యతిరేకత అంటూ నివేదికలు వస్తున్నాయని అంటున్నారు. ఆయనకు టికెట్ ఈసారి ఇచ్చినా ఓటమి ఖాయమని అంటున్నారు. ఇక కురుబ సామాజికవర్గానికి చెందిన గోరంట్ల మాధవ్ కి ఎంపీ సీటు ఇవ్వకపోయినా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి సర్దుబాటు చేస్తారా లేదా అనంది చూడాల్సి ఉంది అంటున్నారు.

ఇంకో వైపు కర్నూల్ లో కురుబలు ఎక్కువగా ఉన్న అసెంబ్లీ సీటు మాధవ్ కి ఇస్తారని ఆయన అనుచరులు అంటున్నారు. కానీ వైసీపీ అయితే మాత్రం మాధవ్ కి ఎంపీ టికెట్ ఈసారి ఇచ్చేందుకు సుముఖంగా లేదని అంటున్నారు. ఆ సీట్లో అదే సామాజిక వర్గానికి చెందిన అనంతపురం జిల్లా మాజీ మంత్రి శంకర్ నారాయణను హిందూపురం ఎంపీగా పోటీకి నిలుపుతారు అని అంటున్నారు.

పెనుగొండ నుంచి 2019 ఎన్నికల్లో గెలిచిన శంకర్ నారాయణ సరైన అభ్యర్ధి అని వైసీపీ భావిస్తోందిట. మొత్తం మీద చూసుకుంటే గోరంట్ల లక్ అంతా ఇట్టే కలిగిపోతోందా అన్న చర్చ అయితే వస్తోంది. ఆయనకు కనుక ఎమ్మెల్యే టికెట్ అయినా ఇవ్వకపోతే రాజకీయ జీవితం ఇబ్బందులో పడడం ఖాయమని అంటున్నారు. అయితే ఆయన తరచూ వివాదాలతో పాటు అటు పార్టీని ఇటు తనకు ఉన్న పదవిని కూడా సరిగ్గా పట్టించుకోలేదని అందుకే ఇపుడు ట్రబుల్స్ ఫేస్ చేయాల్సి వస్తోంది అని అంటున్నారు. ఏది ఏమైనా గోరంట్ల పాలిటిక్స్ ఇపుడు బిగ్ క్వశ్చన్ గా మారుతోంది అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.