ఫోన్లకు కొనే గొరిల్లా గ్లాస్ తయారీ తెలంగాణలో!
ఇంతకాలం విదేశాల్లోనే ఉత్పత్తిఅయ్యే ఈ గ్లాస్ రానున్న రోజుల్లో తెలంగాణలో తయారు కానుంది.
By: Tupaki Desk | 2 Sep 2023 6:07 AM GMTదేశంలో పలు మహానగరాలు ఉన్నప్పటికీ.. పలు ప్రముఖ కంపెనీలను రాష్ట్రాలకు తీసుకొచ్చే విషయంలో తెలంగాణ రాష్ట్రం దూసుకెళుతోంది. విదేశీ పెట్టుబడులను ఆకర్షించే విషయంలో టాప్ 5లో ఒకటిగా ఉన్న హైదరాబాద్ కు పలు కంపెనీలు వస్తున్నాయి. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. అందరూ మాట్లాడుకునే పలు ఉత్పత్తులకు నెలవుగా తెలంగాణ నిలుస్తోంది. మొన్నటి వరకు ఐటీ ఉత్పత్తులు.. ఐటీ సేవలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన తెలంగాణ రాష్ట్రం.. ఇప్పుడు పలు తయారీ కంపెనీల పెట్టుబడుల్ని ఆకర్షిస్తోంది.
ఇవాల్టి రోజున ప్రతి ఒక్కరి జీవితాల్లో కీలకంగా మారిన సెల్ ఫోన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడున్న స్మార్ట్ ఫోన్లకు గొరిల్లా గ్లాస్ ను వినియోగిస్తుంటారు. ఇంతకాలం విదేశాల్లోనే ఉత్పత్తిఅయ్యే ఈ గ్లాస్ రానున్న రోజుల్లో తెలంగాణలో తయారు కానుంది. అమెరికాకు చెందిన ప్రసిద్ధ గాజు.. సిరామిక్స్ పరికరాల తయారీ సంస్థ కార్నింగ్ రాష్ట్రంలో రూ.934 కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. దీని ద్వారా 300 మందికి ఉపాధి కలగనుంది.
నూయార్కులోని కార్నింగ్ సంస్థకు చెందిన ముఖ్యులతో భేటీ అయిన తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్.. తెలంగాణలో సదరు సంస్థ పెట్టుబడులు పెట్టేందుకు వీలుగా ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. 172 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ సంస్థ తొలిసారి భారత్ లో పెట్టుబడులు పెట్టనుంది. అది కూడా హైదరాబాద్ లో కావటం గమనార్హం. అంతర్జాతీయంగానే కాదు.. భారత్ లోని పలు నగరాల్ని తాము పరిశీలించగా.. తెలంగాణలో ఉన్న అనుకూలతలతో తాము ఎంపిక చేసినట్లుగా చెప్పిన వైనం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ఈ సందర్భంగా కంపెనీ ఆసక్తుల నేపథ్యంలో సదరు కంపెనీకి పలు ప్రోత్సహకాల్ని ప్రభుత్వం తరఫున మంత్రి కేటీఆర్ వివరించినట్లుగా చెబుతున్నారు. ప్రపంచ ప్రఖ్యాత సంస్థ ఫోక్స్ కాన్ భారీ స్థాయిలో తమ తయారీ కేంద్రాన్ని తెలంగాణలో ఏర్పాటు చేయనున్న వేళ.. తెలంగాణ ప్రభుత్వాన్ని..మంత్రి కేటీఆర్ ను ప్రశ్నించిన వైనం తమను ఆకర్షించినట్లుగా సంస్థ ముఖ్యులు వ్యాఖ్యానించటం గమనార్హం. త్వరలోనే తమ కంపెనీని శంకుస్థాపన చేస్తామని.. ఏడాది లోపు తయారీ ప్రారంభించనున్నట్లుగా పేర్కొన్నారు. అంటే.. మరో ఏడాది.. ఏడాదిన్నర వ్యవధిలో గొరిల్లా గ్లాస్ తయారీకి తెలంగాణ కేంద్రంగా మారనుందని చెప్పాలి.