Begin typing your search above and press return to search.

రాజాసింగ్ కు ఇంటిపోరు... తాను రెడీ అంటున్న విక్రం గౌడ్!

నేనున్నానంటూ విక్రం గౌడ్ ముందుకు వచ్చారు. గోషా మహల్ నుంచి బీజేపీ అభ్యర్థిగా తానూ పోటీ చేస్తానంటూ దరఖాస్తు చేసుకున్నారు.

By:  Tupaki Desk   |   8 Sep 2023 12:41 PM GMT
రాజాసింగ్  కు ఇంటిపోరు... తాను రెడీ అంటున్న విక్రం గౌడ్!
X

తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రత్యర్థి పార్టీల సమస్యలతోపాటు ఇంటర్నల్ సమస్యలు కూడా వరుసగా తెరపైకి వస్తున్నాయి. ఈ సమయంలో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా కేసీఆర్... సుమారు 114 నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించేసి, అసంతృప్తులను బుజ్జగించేపనిలో ఉన్నారని అంటున్నారు. ఈ సమయంలో ఆయన ప్రకటించని నియోజకవర్గాల్లో ఒకటైన గోషామహల్ ఇప్పుడు బీజేపీలో హాట్ టాపిక్ గా మారింది.

కేసీఆర్ ప్రకటించకుండా వదిలిన గోషా మహల్ టిక్కెట్ కు బీఆరెస్స్ అభ్యర్థిని అసదుద్ధీన్ ఓవైసీ ప్రకటిస్తారని ఎద్దేవా చేసిన రాజాసింగ్... రాబోయే ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీచేసేది తానే అని, కేడర్ అంతా యుద్ధానికి సిద్ధం కావాలని ఈ మధ్యే ఒక సెల్ఫీ వీడియో విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే అది అంత ఈజీకాదనే సంకేతాలు తెరపైకి వస్తున్నాయి!

ప్రస్తుతం బీజేపీ అధిష్ఠానం విధించిన సస్పెన్షన్ లో ఉన్న గోషామహల్ సిట్టింగ్ ఎమ్మెల్యే రాజాసింగ్ కు ఇంటిపోరు మొదలైంది! ఆయనపై సస్పెషన్ ఎప్పుడు ఎత్తుతారు.. ఎత్తిన తర్వాత టిక్కెట్ కన్ ఫాం చేస్తారా అనే చర్చ కొనసాగుతున్న నేపథ్యంలో... నేనున్నానంటూ విక్రం గౌడ్ ముందుకు వచ్చారు. గోషా మహల్ నుంచి బీజేపీ అభ్యర్థిగా తానూ పోటీ చేస్తానంటూ దరఖాస్తు చేసుకున్నారు.

అవును... దివంగత మాజీ మంత్రి ముఖేశ్ గౌడ్ కుమారుడు విక్రం గౌడ్.. హైదరాబాద్ లోని గోషామహల్ టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో భాగంగా నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు నల్లు ఇంద్రసేనా రెడ్డికి ఆయన ఒక కాపీని అందజేసిన సంగతి తెలిసిందే. దీంతో... ఇప్పుడు బీజేపీలో గోషామహల్ టిక్కెట్ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.

మరోపక్క త్వరలోనే రాజా సింగ్ సస్పెన్షన్ విషయంపై అధిష్ఠానం సానుకూలంగానే ఉందని, త్వరలోనే పాజిటివ్ డెసిషన్ తీసుకునే అవకాశం ఉందని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఇటీవల వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఆ కామెంట్ అనంతరం రాజాసింగ్... తానే ఈసారి గోషామహల్ నుంచి పోటీ చేస్తున్నట్లు ప్రకటించుకున్నారు. యుద్ధానికి సిద్ధం కావాలని కేడర్ కు పిలుపునిచ్చారు.

ఈ సమయంలో విక్రం గౌడ్ లైన్ లోకి వచ్చారు! ఈసారి ఎట్టిపరిస్థితుల్లోనూ తాను బీజేపీ తరుపున గోషామహల్ నుంచి పోటీ చేస్తానని బలంగా చెబుతున్నారు. దీంతో... ఈసారి ఈ సీటు విషయంలో బీజేపీలో ఇంటిపోరు తారాస్థాయికి చేరే ఛాన్స్ ఉందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. మరి ఈ విషయాన్ని అధిష్టాణం ఎలా పరిష్కరించుకోబోతోంది అనేది వేచి చూడాలి!

కాగా... గోషామహల్ నియోజకవర్గంలో 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి దివంగత నేత ముఖేశ్ గౌడ్ ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం వరుసగా రెండు సార్లు రాజాసింగ్ బీజేపీ నుంచి గెలిచారు. దీంతో మరోసారి గెలిచి హ్యాట్రిక్ కొడతానని రాజాసింగ్ స్ట్రాంగ్ గా చెబుతున్న నేపథ్యంలో... వ్యవహారం ఎలాంటి కొలిక్కి వస్తుందనేది వేచి చూడాలి!