మార్కాపురం జిల్లా.. గొట్టిపాటి హామీ నెరవేరే రోజు.. !
ఎన్నికలకు ముందు గత ఏడాది ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని మార్కాపురం ప్రాంతాన్ని ప్రత్యేక జిల్లాను చేస్తామని..
By: Tupaki Desk | 10 Jan 2025 11:30 PM GMTఎన్నికలకు ముందు గత ఏడాది ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని మార్కాపురం ప్రాంతాన్ని ప్రత్యేక జిల్లాను చేస్తామని.. ఇక్కడి ప్రజల డిమాండ్‌ను నెరవేరుస్తామని అద్దంకి ఎమ్మెల్యే, ప్రస్తుత మంత్రి గొట్టిపాటి రవి కుమార్ ఇక్కడి ప్రజలకు హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆయన మంత్రి అయ్యారు. ఈయన ఒక్కరే కాకుండా.. టీడీపీకి చెందిన మంత్రిడోలా బాల వీరాంజనేయ స్వామి కూడా.. మార్కాపురం జిల్లా కోసం.. వైసీపీ హయాంలో జరిగిన నిరసనల్లో పాల్గొన్నారు. తాము అధికారంలోకి వచ్చాక జిల్లాను ఏర్పాటు చేస్తామన్నారు.
ఇక, ఇప్పుడు ఈ జిల్లా కోసం.. మరోసారి ఇక్కడి ప్రజలు డిమాండ్ లేవనెత్తుతున్నారు. తాజాగా వైసీపీ నుం చి టీడీపీలోకి చేరిన కొందరు నాయకులు మార్కాపురం జిల్లా విషయాన్ని ప్రస్తావించారు. దీనిపై ప్రజాసం ఘాల నాయకులు కూడా తమ అభిప్రాయం వెల్లడించాయి. ఈ నేపథ్యంలో మార్కాపురం ప్రాంతాన్ని ప్రత్యేక జిల్లాగా మార్చేందుకు మంత్రి గొట్టిపాటి తన ప్రయత్నం ముమ్మరం చేశారు. ఇటీవల సీఎం చంద్రబాబుకు కూడా ఇక్కడి ప్రజల ఆకాంక్షలను వివరించారు.
త్వరలోనే మార్కాపురం జిల్లాపై ప్రకటన వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే.. ఇదేసమయంలో మరికొన్ని జిల్లాలను ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ఉన్న నేపథ్యంలో వాటిపైనా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ ఏడాది ఉగాది నాటికి సీఎం చంద్రబాబు దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మార్కాపురం జిల్లాను ఏర్పాటు చేస్తే.. ప్రస్తుతం ఉన్న కందుకూరు, అద్దంకి నియోజకవర్గాలను ప్రకాశం జిల్లాలో విలీనం చేయనున్నారు.
ఇక, మార్కాపురం కొత్త జిల్లాలో ఇతర ఐదు నియోజకవర్గాలను కలిపి ప్రకటించే అవకాశం ఉంది. భౌగోళి కంగా కూడా మార్కాపురం కొత్త జిల్లా ఏర్పాటు అయితే.. ప్రజలకు సౌకర్యాలు మెరుగు పడతాయని.. త్వరిత గతిన అభివృద్ధి పనులు కూడా సాగుతాయని ఇక్కడి వారు భావిస్తున్నారు. వాస్తవానికి వైసీపీ హయాంలోనే మార్కాపురం డిమాండ్ ఉన్నప్పటికీ.. అప్పట్లో ఈ విషయాన్ని ప్రభుత్వం లైట్ తీసుకుంది. ఇక, ఇప్పుడు మంత్రి గొట్టిపాటి ప్రయత్నంతో జిల్లా సాకారం అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.