గొట్టిపాటి హామీ ఇప్పటికి నెరవేరింది..!
తాజాగా చంద్రబాబు కేబినెట్‌లో మంత్రి పదవి దక్కించుకున్న అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవి.
By: Tupaki Desk | 13 Jun 2024 1:30 PM GMTతాజాగా చంద్రబాబు కేబినెట్‌లో మంత్రి పదవి దక్కించుకున్న అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవి. వాస్తవానికి ఎంతో మందిసీనియ ర్లు ఉన్నా.. ఎంతో మంది పార్టీ నాయకులు నిబద్ధతతో ఉన్నా.. గొట్టిపాటికి ఈ పదవి ఎలా లభించిందన్న చర్చ అయితే సాగు తోంది. ఆయనకు ఇవ్వడాన్ని ఎవరూ తప్పుబట్టడం లేదు. కానీ, రీజన్లపైనే చర్చ సాగుతోంది. వైసీపీ సర్కారు హయాంలో ఆయన అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని.. అనేక కేసులు కూడా ఎదుర్కొన్నారని.. అయినా.. నిబద్ధతతో పార్టీలోనే ఉన్నారని.. అందుకే ఇప్పుడు పదవి ఇచ్చారని చెప్పేవారు ఉన్నారు.
ఇది ఒక కారణమై ఉండడంలో తప్పులేదు. కానీ, ఇంతకన్నా ఎక్కువగానే పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్‌కు పరాభవం ఎదురైంది. ఆయన డెయిరీ వ్యాపారాలపైనా దాడులు జరిగాయి. వేధించారు. అయినా.. ఆయనకు పదవి చిక్కలేదు. ఇక, మరో కీలక నాయకుడు కూడా.. ఇలాంటి ఇబ్బందులే ఎదుర్కొన్నారు. అయినా.. కూడా మంత్రి పీఠం దక్కలేదు. కానీ, అనూహ్యంగా గొట్టిపాటికి మాత్రమే పదవి ఇచ్చారు. దీనికి ప్రదాన కారణం.. చంద్రబాబుగతంలో ఇచ్చిన హామీ. 2014లో వైసీపీ తరఫున విజయం దక్కించుకున్న గొట్టిపాటి.. తర్వాత టీడీపీలోకి వచ్చారు.
ఆ సమయంలోనే ఆయనకు చంద్రబాబు మంత్రి పదవి ఇస్తామని చెప్పారు. కానీ, వైసీపీ చేసిన యాగీతో ఇది సాధ్యం కాలేదు. దీంతో 2019లో పార్టీ అధికారం దక్కించుకుంటే ఇస్తామని చంద్రబాబు మరోసారి హామీ ఇచ్చారు. అయితే.. అప్పటి ఎన్నికల్లో పార్టీకి అధికారం దక్కలేదు. దీంతో ఇప్పుడు చంద్రబాబు తన హామీని నిలబెట్టుకున్నారు. కమ్మ సామాజిక వర్గమే అయినా.. ఈక్వేషన్లుకుదరవని అనుకున్నా.. చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. నిజానికి పొరుగునే ఉన్న పరుచూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు కూడా మంత్రి పదవిని ఆశించారు.
ఆయన కూడా గత ఆరు మాసాలుగా వైసీపీ బాధితుడిగానే మిగిలారు. పార్టీలోనూ నిలదొక్కుకున్నారు. 2023లో పార్టీ మారా లంటూ ఆయనపైనా ఒత్తిళ్లు వచ్చాయి. అయినప్పటికీ.. మారకుండా టీడీపీలోనే ఉన్నారు. దీంతో ఆయనకు కూడా పదవి ఇవ్వడం తప్పుకాదన్న అభిప్రాయం ఏర్పడింది. అయినా కూడా.. గొట్టపాటికి ఇచ్చిన హామీనే చంద్రబాబు నిలబెట్టుకున్నారు. ఇక, రవి విషయానికి వస్తే.. ఐదు సార్లు వరుసగా పార్టీలతో సంబంధం లేకుండా ఆయన విజయం దక్కించుకున్నారు. 2004 లోకాంగ్రెస్(మార్టూరు), 2009లో కాంగ్రెస్(అద్దంకి), 2014లో వైసీపీ, 2019, 2024లో టీడీపీ తరఫున ఆయన విజయం సాధించారు.