రేవంత్ ఆ వేగమే వేరప్పా.. ఇట్టే కనెక్టు అయిపోయారుగా?
తెలంగాణ రాష్ట్రానికి గవర్నర్ గా నియమితులైన జిష్ణు దేవ్ వర్మ.. బుధవారం హైదరాబాద్ కు రానున్నారు
By: Tupaki Desk | 30 July 2024 11:30 AM GMTతెలంగాణ రాష్ట్రానికి గవర్నర్ గా నియమితులైన జిష్ణు దేవ్ వర్మ.. బుధవారం హైదరాబాద్ కు రానున్నారు. ఎయిర్ పోర్టు నుంచి నేరుగా రాజ్ భవన్ కు చేరుకునే ఆయన.. ప్రమాణస్వీకారోత్సవాన్ని పూర్తి చేస్తారు. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. త్రిపురకు చెందిన ఒకరు ఒక రాష్ట్రానికి గవర్నర్ గా ఎంపిక కావటం ఇదే తొలిసారి. ఇదొక ఎత్తు అయితే.. త్రిపుర గవర్నర్ గా తెలంగాణ ప్రాంతానికి చెందిన ఇంద్రసేనారెడ్డి వ్యవహరిస్తుండటం.. అదే సమయంలో త్రిపురకు చెందిన జిష్ణు దేవ్ వర్మ తెలంగాణ గవర్నర్ గా నియమితులు కావటం కో ఇన్సెడెంట్ గా చెప్పాలి.
తెలంగాణ గవర్నర్ గా బాధ్యతలు చేపట్టున్న నేపథ్యంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడిన ఆయన ఆసక్తికర అంశాల్నివెల్లడించారు. గవర్నర్ గా ఎంపికైన విషయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా ఫోన్ చేసినట్లు చెప్పారు. కానీ.. ఏ రాష్ట్రానికి అన్న విషయాన్ని ఆయన చెప్పలేదు. ఈ విషయాన్ని వివరిస్తూ.. ‘‘శనివారం రాత్రి ప్రధాని నరేంద్ర మోడీ నుంచి కాల్ వచ్చే వరకు నా నియామకం గురించి తెలీదు. మీరు త్రిపుర రాష్ట్రం బయట పని చేయాల్సి ఉంటుందని చెప్పారు. నాకెలాంటి బాధ్యత అప్పగించినా నిర్వర్తించటానికి సిద్ధమని ప్రధానికి చెప్పా’’ అని పేర్కొన్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫోన్ కాల్ తర్వాత.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నుంచి తనకు మరో కాల్ వచ్చిందన్నారు. ‘‘ఆయన నాకు స్వాగతం పలుకుతూ ఫోన్ చేశారు. సీఎం రేవంత్ ఫోన్ కాల్ తో నన్ను తెలంగాణ రాష్ట్రానికి గవర్నర్ గా వెళుతున్నట్లు అర్థమైంది. గతంలో త్రిపుర ఉప ముఖ్యమంత్రిగా వ్యవహరించాను. అది రాజకీయ పదవి. ఇప్పుడు రాజ్యాంగబద్ధమైన పదవి. ఇప్పుడు కూడా బాధ్యతగా వ్యవహరిస్తా. తెలంగాణ ముఖ్యమంత్రితో సమన్వయం చేసుకుంటూ నా విదులు నిర్వర్తిస్తా’’ అని వ్యాఖ్యానించారు. ఏమైనా.. బీజేపీయేతర పార్టీకి చెందిన ముఖ్యమంత్రి ఒకరు వెను వెంటనే విషయాల్ని అర్థం చేసుకోవటం.. అల్లుకుపోవటం లాంటివి చూస్తే.. రేవంత్ స్పీడ్ వేరే లెవల్ అన్న భావన కలుగక మానదు.