పశ్చిమబెంగాల్‌లో రాష్ట్రపతి పాలన.. ఏక్షణమైనా నిర్ణయం!
మమత తన పదవికి తక్షణం రాజీనామా చేయాలంటూ.. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నిరసనలు అట్టుడుకుతున్నాయి.
By: Tupaki Desk | 20 Aug 2024 1:30 PM GMTపశ్చిమ బెంగాల్ రాజకీయాలు మరింత ముదిరాయి. ఏక్షణమైనా.. ఇక్కడిప్రభుత్వాన్ని పక్కన పెట్టి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. దీనికి సంబంధించిన చర్యలు కూడా మెరుపు వేగంతో జరుగుతుండడం గమనార్హం. కోల్‌కతాలోని ఆర్‌జీ కర్ ఆసుపత్రిలో 31 ఏళ్ల జూని యర్ వైద్యురాలిపై జరిగిన పాశవిక అత్యాచారం, అనంతర హత్య రాష్ట్రాన్ని సునామీ కంటే ఎక్కువగానే కుదిపేస్తోంది. ఈ కేసుకు సంబంధించిన పోస్టు మార్టమ్ రిపోర్టు వచ్చిన తర్వాత.. ప్రజాగ్రహం మరింత పెల్లుబికింది.
అత్యంత హేయాతిహేయంగా డాక్టర్‌పై జరిగిన అత్యాచారం, అనంతర హత్యను పోస్టు మార్టమ్ నివేదిక కళ్లకు కట్టడంతో గౌతమ బుద్ధులుగా వ్యవహరించిన వారు కూడా.. ఆగ్రహావేశాలు వెళ్లగక్కుతున్నారు. ఈ నెల 9న జరిగిన ఈ దారుణ మారణకాండ అనంతరం.. రాష్ట్రం సహా దేశ వ్యాప్తంగా వైద్యులు మాత్రమే నిరసనలు, ధర్నాలు చేశారు. కానీ, పోస్టు మార్టమ్ రిపోర్టు బయటకు వచ్చిన తర్వాత.. సాధారణప్రజలు రాష్ట్రంలో రోడ్లపైకివచ్చి.. మమతాబెనర్జీ సర్కారుపై నిప్పులు చెరుగుతున్నారు.
మమత తన పదవికి తక్షణం రాజీనామా చేయాలంటూ.. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నిరసనలు అట్టుడుకుతున్నాయి. దీంతో పరిస్థితి దాదాపు చేయి దాటిపోయింది. ఈ నేపథ్యంలో గవర్నర్ జోక్యం చేసుకుని.. రాష్ట్రంలో రాష్ట్రపతిపాలన విధించాలంటూ.. సిఫారసు చేసేందుకు సిద్ధమయ్యారు. తాజాగా మంగళవారం ఉదయం ఢిల్లీకి చేరుకున్న గవర్నర్‌సీవీ ఆనందబోస్.. తన సిఫారసును నేరుగా రాష్ట్రపతి ఇవ్వనున్నట్టు తెలిసింది. అనంతరం.. ఈ రోజు లేదా.. రేపటిలోనే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధింపు ఖాయమని సమాచారం.
ఎందుకు?
రాష్ట్రంలో అత్యంతసున్నితమైన వైద్యురాలిపై జరిగిన అమానుష ఘటన వెనుక ముఖ్యమంత్రి మమతా బనర్జీకి అత్యంత సన్నితుడైన ఓ మంత్రి ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. అంతేకాదు.. ఆమె సొంత పార్టీ ఎంపీలు కూడా.. రెండు వర్గాలుగా చీలిపోయి.. మమతపై విమర్శల బాణాలను ఎక్కుపెట్టారు. శాంతి భద్రతలు పోయాయని.. ముఖ్యమంత్రిగా ఆమె విఫలమయ్యారని సొంత నాయకులు ఆధారాలతో సహా వెల్లడిస్తున్నారు. ఆర్ జీ కర్ ఆసుపత్రి ప్రిన్సిపాల్ సహా.. కోల్‌కతా నగర పోలీసు కమిషనర్‌లను ఆమె కాపాడుతున్నారన్నది ప్రధాన వివాదం.
దీనికితోడు అధికారంలో ఉండి.. ముఖ్యమంత్రిగా, శాంతిభద్రతలు చూస్తున్న హోం శాఖ మంత్రిగా, మరీ ముఖ్యంగా ఆరోగ్య శాఖ మంత్రిగా కూడా ఉన్న మమతా బెనర్జీ అధికారం వదిలేసి.. రోడ్డెక్కి నిరసనలకు దిగడాన్ని సొంత పార్టీ నాయకులే తీవ్రంగా తప్పుబడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆమెకు వ్యతిరేకంగా సొంత పార్టీలోనే ముసలం పుట్టింది. ఇక, ఇప్పుడు బీజేపీవిధేయుడిగా ముద్రపడిన గవర్నర్ మాత్రం ఊరుకుంటాడా.. ఆయన చేయాల్సింది .. ఆయన చేస్తున్నారు. మొత్తంగా చూస్తే.. ఏక్షణమైనా ఇక్కడ మమత ప్రభుత్వం సుప్తచేతనావస్థలోకి జారిపోవడం ఖాయమేనని తెలుస్తోంది.