టీఎస్పీఎస్సీ చైర్మన్ రాజీనామాపై గవర్నర్ ట్విస్ట్... రేవంత్ నెక్స్ట్ స్టెప్?
ఇందులో భాగంగా తాజాగా టీఎస్పీఎస్సీ ఛైర్మన్ జనార్దన్ రెడ్డి రాజీనామాను ఆమోదించినట్లు ప్రచారం జరిగిన నేపథ్యంలో రాజ్ భవన్ క్లారిటీ ఇచ్చింది.
By: Tupaki Desk | 12 Dec 2023 9:59 AM GMTఇటీవల కాలంలో ఎన్నికల ముందు రాజకీయ వాతావరణం మరింత వేడెక్కడం, ప్రభుత్వానికి నిరుద్యోగుల్లో వ్యతిరేకత వచ్చిందనే కథనాలు రావడంలో టీఎస్పీఎస్సీ కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే! టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజ్ వ్యవహారాలు తెలంగాణ రాజకీయాల్లో కీలకంగా మారాయి. దీంతో ప్రస్తుతం అధికార కాంగ్రెస్ .. ఆ విషయంలో నాటి బీఆరెస్స్ ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టింది! ఈ సమయంలో తాజాగా ఈ కమిషన్ కేంద్రంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.
అవును... ఇటీవల కాలంలో తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశం అయిన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ)పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష జరపనుండగా తెరపైకి కీలక విషయం వచ్చింది. ఇందులో భాగంగా... టీఎస్పీఎస్సీ చైర్మన్ బి. జనార్ధన్ రెడ్డి చేసిన రాజీనామాను గవర్నర్ తమిళిసై ఆమోదించలేదు. ఈ మేరకు రాజ్ భవన్ ఓ ప్రకటన విడుదల చేసింది. దీంతో ఇది సరికొత్త ట్విస్ట్ అనే చర్చ మొదలైంది.
ఇందులో భాగంగా తాజాగా టీఎస్పీఎస్సీ ఛైర్మన్ జనార్దన్ రెడ్డి రాజీనామాను ఆమోదించినట్లు ప్రచారం జరిగిన నేపథ్యంలో రాజ్ భవన్ క్లారిటీ ఇచ్చింది. టీఎస్పీఎస్సీ చైర్మన్ బి. జనార్ధన్ రెడ్డి రాజీనామా ఆమోదం పొందినట్లు వచ్చిన వార్తలు అవాస్తవమని తెలిపింది. దీంతో సీఎం రేవంత్ రెడ్డి జరిపే సమీక్షకు జనార్ధన్ రెడ్డి హాజరవుతారా లేదా అనేది ఉత్కంఠగా మారింది.
కాగా... సోమవారం సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన అనంతరం టీఎస్పీఎస్సీ ఛైర్మన్ పదవికి జనార్దన్ రెడ్డి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఆయన రాజీనామా ఆమోదం పొందిందంటూ కథనాలు వెలువడ్డాయి. దీంతో అవన్నీ అవాస్తవాలని, గవర్నర్ ఇంకా ఆమోదించలేదని తాజాగా రాజ్ భవన్ ప్రకటన విడుదల చేసింది. దీంతో వ్యవహారం ఆసక్తిగా మారింది.
ఈ సమయంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు, రాతపరీక్షలు, ప్రశ్నపత్రాల లీకేజీ, మొదలైన అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించనున్నారు. ఇందులో ప్రధానంగా ఇప్పటికే నిర్వహించిన రాతపరీక్షలపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయని అంటున్నారు.
ఈ సమయంలో జనార్థన్ రెడ్డి రాజీనామాకు ఆమోదం లభించకపోవడంతో రేవంత్ సమీక్షకు ఈయన హాజరు ఆసక్తి కరంగా మారింది. ఈ సమయంలో రేవంత్ రెడ్డి తీసుకోబోయే నిర్ణయం కూడా కీలకంగా మారింది!