ఆ హీరోకి బెయిల్ రద్దవుతుందా?
అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో కన్నడ నటుడు దర్శన్ సహా నిందితులందరికీ బెయిల్ దొరికిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 31 Dec 2024 10:15 AM GMTఅభిమాని రేణుకాస్వామి హత్య కేసులో కన్నడ నటుడు దర్శన్ సహా నిందితులందరికీ బెయిల్ దొరికిన సంగతి తెలిసిందే. కేసులో ఏ2గా ఉన్న దర్శన్ కు తొలుత మెడికల్ గ్రౌండ్ ఆధారంగా మధ్యంతర బెయిల్ దక్కింది. అటుపై మరికొన్ని రోజులకు రెగ్యులర్ బెయిల్ వచ్చేసింది. నెల రోజుల పాటు ఆసుపత్రిలో ఉన్న అనంతరం రెగ్యులర్ బెయిల్ రావడంతో డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం కోర్టు అనుమతులు పొంది మైసూరు ఫామ్ హౌస్ లో గడుపుతున్నారు.
అయితే తాజాగా రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు బెయిల్ ను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్తుంది. దీనిలో భాగంగా పోలీసులకు ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది. దీంతో ఇప్పుడీ కేసు విచారణకు పోలీస్ శాఖ న్యాయవాదులు అనిల్ సినిశాని, సిద్దార్థ లూథ్రాను నియమించింది. మరో రెండు రోజుల్లో బెయిల్ పిటీషన్ విచారణకు రానుంది. దీంతో ఇప్పుడీ కేసు మళ్లీ సంచలనంగా మారింది. విచారణ నేపథ్యంలో హైకోర్టు బెయిల్ ను సుప్రీం కోర్టు ఎంత వరకూ సమర్దిస్తుంది? అన్నది ఆసక్తికరంగా మారింది.
సుప్రీంకోర్టు బెయిల్ తిరస్కరించినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. దీంతో ఈ విచారణ దర్శన్ కు ఓ షాకింగ్ లాంటి దనే చెప్పాలి. ఈ కేసు విషయంలో పోలీసు శాఖ ప్రాధమిక దర్యాప్తు సహా అన్ని రకాల దర్యాప్తుల్లో దర్శన్ గ్యాంగ్ నిందితులుగా కనిపిస్తున్నారని పోలీస్ శాఖ బలంగా వాదిస్తోంది. పక్కా ఆధారాలతోనే అరెస్ట్ చేసినట్లు చెబుతు న్నారు.
అయితే దర్శన్ వైపు నుంచి కూడా బలమైన వాదనలు రావడంతో రెగ్యులర్ బెయిల్ మంజూరైంది. ఇప్పుడీ కేసు అత్యున్నత న్యాయస్థానానికి చేరుకోవడంతో ఆసక్తికరంగా మారింది. రేణుకా స్వామి హత్య కేసులో మొత్తం 17 మంది నిందితులుగా ఉన్న సంగతి తెలిసిందే. దర్శన్ తో పాటు ప్రియురాలు పవిత్రా గౌడ్ ఏ1గా ఉన్న విషయం తెలిసిందే.