Begin typing your search above and press return to search.

ప్రభుత్వం ఏదైనా సరే.. ఐఏఎస్ ఐపీఎస్‌లు మీకు అర్థమవుతోందా!

ఏ టీమ్‌ లీడర్ అయినా.. తనకు అనుకూలంగా ఉండే సభ్యులే తన టీమ్‌లో ఉండాలని అనుకుంటుంటారు.

By:  Tupaki Desk   |   1 Sep 2024 8:30 AM GMT
ప్రభుత్వం ఏదైనా సరే.. ఐఏఎస్ ఐపీఎస్‌లు మీకు అర్థమవుతోందా!
X

ఏ టీమ్‌ లీడర్ అయినా.. తనకు అనుకూలంగా ఉండే సభ్యులే తన టీమ్‌లో ఉండాలని అనుకుంటుంటారు. ఎందుకంటే చెప్పినట్లుగా వినే వాళ్లు సభ్యులుగా ఉంటే తాము సక్సెస్ అవుతామనేది వారి నమ్మకం. అది స్పోర్ట్స్‌కే పరిమితం కాకుండా పొలిటికల్‌లోనూ కనిపిస్తూ ఉంటుంది. అయితే.. అదే సిద్ధాంతాన్ని ప్రభుత్వాలు సైతం అవలంబిస్తుండడంతో ఐఏఎస్, ఐపీఎస్‌లు సమిధలవుతున్నారు. ముఖ్యమంత్రిగా ఎన్నికైన నాయకుడు తనకు నచ్చినవారిని అందలానికి ఎక్కించడం.. నచ్చని వారిని లూప్‌లైన్‌లో పడేయడం.. ఇదీ ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్.

తెలంగాణలో గత పదేళ్లు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో కొనసాగింది. ఆ సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ తనకు నచ్చిన ఐఏఎస్, ఐపీఎస్‌లకు పెద్దపీట వేస్తూ వచ్చారు. వారికి ప్రాధాన్య పోస్టులు ఇస్తూ వచ్చారు. అయితే.. అదే సమయంలో కాస్త దూకుడుగా ప్రవర్తించిన వారిని లూప్‌లైన్‌లో వేయడమూ చేశారు. ఇతర రాష్ట్రాల కేడర్‌కు చెందిన ఐఏఎస్‌లకు ఆయన ప్రాధాన్యత ఇచ్చారనే అపవాదు ఉంది. మరికొందరికి కావాలని మరీ ఎక్స్‌టెన్షన్ ఇచ్చారనే ప్రచారమూ ఉంది. సీఎస్ సోమేశ్ కుమార్, స్మితా సబర్వాల్‌తో పాటు పలువురికి అధిక ప్రాధాన్యం ఇచ్చారని టాక్. దాంతో ఆ సమయంలో వారంతా ఇష్టారీతిన నిర్ణయాలు తీసుకున్నారు. ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించారనే టాక్ కూడా ఉంది. ఐపీఎస్‌లుగా ఉన్న సజ్జనార్, రంగనాథ్ సైతం ముందు ప్రాధాన్యత పోస్టుల్లోనే కొనసాగారు. కానీ.. ఆ తరువాత వారిని అప్రధాన పోస్టులకు పరిమితం చేశారు.

కట్ చేస్తే.. దశాబ్దకాలం తరువాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి తనకు నచ్చిన టీమ్‌ను చక్కబెట్టుకునే పనిలో పడ్డారు. అందులో భాగంగానే ప్రాధాన్యత లేని పోస్టులో ఉన్న ఐపీఎస్ రంగనాథ్‌కు ఏకంగా హైడ్రాను అప్పగించారు. హైదరాబాద్ నగరంలో అక్రమ కట్టడాల కూల్చివేత బాధ్యతలను ఆయనకు ఇచ్చారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో హైడ్రా హవానే నడుస్తున్నది. కేసీఆర్ హయాంలో మరికొంత మంది నిరాదరణకు గురైన ఐఏఎస్, ఐపీఎస్‌లకు ఈ ప్రభుత్వంలో సముచిత స్థానం కల్పిస్తున్నారని తెలుస్తున్నది.

ఇక.. ఏపీలోనూ జగన్ ప్రభుత్వంలో హవా చాటిన చాలా మంది ఐఏఎస్, ఐపీఎస్‌ల పరిస్థితి ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఉదాహరణకి ప్రవీణ్ ప్రకాశ్, శ్రీలక్ష్మి, ఆంజనేయులు వీరే కాకుండా చాలా మంది అధికారులకు ఇప్పుడు చంద్రబాబు పాలనలో ప్రాధాన్యత లేకుండా పోయింది. ఏకంగా 15 మంది ఐఏఎస్‌లు బాబు పాలనలో లూప్‌లైన్‌లోకి నెట్టివేయబడ్డారంటే అర్థం చేసుకోవచ్చు. ఇందుకు కారణం.. జగన్ ప్రభుత్వంలో వారు తీసుకున్న నిర్ణయాలే అని అంటుంటారు.

ఏది ఏమైనా.. ఎంతో కష్టపడి చదివితే కానీ ఐఏఎస్, ఐపీఎస్ కొలువు కొట్టలేరు. అలాంటి పబ్లిక్ సర్వెంట్లు ప్రభుత్వానికి అనుకూలంగా ఎందుకు నడుచుకుంటున్నారు..? ఎందుకు అభాసుపాలవుతున్నారు..? ఖచ్చితమైన నిర్ణయాలతో పాలన సాగించలేరా..? అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆ నాయకుడికి అనుకూలంగా వ్యవహరించడం.. మరో ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కోవడం అంటే దేనికి అర్థం. ఇప్పటికైనా ప్రభుత్వాలకు, నాయకుడికి అనుకూలంగా కాకుండా ప్రజల మేలు కోసం నిర్ణయాలు తీసుకుంటారని ఆశిద్దాం..!!