చంద్రబాబు సర్కార్ షాకింగ్ డెసిషన్.. వైసీపీ మాజీ ఎంపీకి షాక్!
సర్కారు ఆదేశాలతో వెనువెంటనే రంగంలోకి దిగిన విశాఖ రెవెన్యూ యంత్రాంగం హయగ్రీవ భూముల్లో ప్రభుత్వ బోర్డు ఏర్పాటు చేశారు.
By: Tupaki Desk | 11 March 2025 1:42 PM ISTవిశాఖలోని కోట్ల రూపాయల విలువైన ‘హయగ్రీవ’ భూములను ప్రభుత్వం రద్దు చేసింది. వృద్ధాశ్రమం, వృద్ధుల కోసం ప్లాట్లు నిర్మిస్తామని ప్రభుత్వం నుంచి భూమి తీసుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారనే ఫిర్యాదులపై సీఎం చంద్రబాబు కొరడా ఝుళిపించారు. దాదాపు 17 ఏళ్ల క్రితం హయగ్రీవ సంస్థకు కేటాయించిన భూములను వెనక్కి తీసుకోవాలని విశాఖ కలెక్టర్ కు ఆదేశించారు. సర్కారు ఆదేశాలతో వెనువెంటనే రంగంలోకి దిగిన విశాఖ రెవెన్యూ యంత్రాంగం హయగ్రీవ భూముల్లో ప్రభుత్వ బోర్డు ఏర్పాటు చేశారు. దీంతో విశాఖకు చెందిన వైసీపీ మాజీ ఎంపీకి ప్రభుత్వం షాక్ ఇచ్చినట్లైందని అంటున్నారు.
విశాఖ నగరంలోని ఎండాడలో 12.51 ఎకరాలకు అప్పటి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం ‘హయగ్రీవ’ సంస్థ చైర్మన్ చిలుకూరి జగదీశ్వరుడికి అప్పగించింది. వృద్ధాశ్రమం నిర్మిస్తానని, వృద్ధుల సంక్షేమం కోసం ప్లాట్లు, విల్లాలు నిర్మిస్తామని చెప్పడంతో ఎకరాకు కేవలం రూ.45 లక్షల నామమాత్రపు ధరపై విక్రయించింది. అయితే మూడేళ్లలోపు వృద్ధాశ్రమం నిర్మించాలని నిబంధన విధించింది. భూ కేటాయింపుల తర్వాత నాటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి మరణించడం, ఆ తర్వాత రాష్ట్ర రాజకీయ పరిణామాలు మారిపోవడంతో హయగ్రీవ భూముల్లో ఎలాంటి పనులు సాగలేదు. మరోవైపు ఈ భూములపై విశాఖకు చెందిన కొందరు పెద్దల కన్ను వేశారు. అయితే గత ప్రభుత్వంలో హయగ్రీవ ఎండీ సీహెచ్ జగదీశ్వరుడిని కొందరు బెదిరించి భూములను లాక్కున్నారని, ఆ భూముల్లో చట్ట విరుద్ధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడంతోపాటు ఖరీదైన విల్లాలు నిర్మిస్తున్నారని ఫిర్యాదు చేశారు. అయితే ఈ వ్యవహారంలో అప్పటి ప్రభుత్వంలో కీలక నేత ఒకరికి నేరుగా సంబంధాలు ఉండటంతో రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోలేకపోయారు.
ప్రభుత్వం మారిన తర్వాత తనకు జరిగిన అన్యాయంపై జగదీశ్వరుడు సెల్ఫీ వీడియో విడుదల చేశారు. తనకు న్యాయం చేయకపోతే ఆత్మహత్యే శరణ్యమంటూ భార్యతో కలిసి కన్నీరు పెట్టుకున్నాడు. అంతేకాకుండా ఈ భూముల అక్రమాలపై గాజువాక ఎమ్మెల్యే, ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు కూడా అధికారులకు ఫిర్యాదు చేశారు. వైసీపీకి చెందిన ఓ మాజీ ఎంపీ భూములను ఆక్రమించి అక్రమాలకు పాల్పడుతున్నట్లు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో ప్రభుత్వం రంగంలోకి దిగి హయగ్రీవ భూములను వెనక్కి తీసుకుంది. దీంతో వైసీపీకి చెందిన మాజీ ఎంపీకి షాక్ తగిలిందని అంటున్నారు. ఇప్పటికే ఆ భూముల్లో కోట్ల రూపాయలు ఖర్చు చేసి విల్లాలను నిర్మిస్తున్నారు. అయితే ఈ నిర్మాణాలకు ప్రభుత్వ అనుమతులు లేకపోవడంతో కోర్టు నుంచి రక్షణ కూడా పొందలేరంటున్నారు.