‘మహాయుతి’లో కుతకుత..షిండే ఎమ్మెల్యేలకు సెక్యూరిటీ కుదింపు!
మహారాష్ట్ర రాజకీయాలు మరోసారి చర్చలోకి వచ్చాయి. నిత్యం ఏదో ఒక వార్త అక్కడి రాజకీయాల్లోని గందరగోళాన్ని తెలియజేస్తున్నాయి.
By: Tupaki Desk | 18 Feb 2025 10:46 AM GMTమహారాష్ట్ర రాజకీయాలు మరోసారి చర్చలోకి వచ్చాయి. నిత్యం ఏదో ఒక వార్త అక్కడి రాజకీయాల్లోని గందరగోళాన్ని తెలియజేస్తున్నాయి. కూటమి అధికారంలోకి వచ్చినా.. కూటమి పార్టీల మధ్య పొసగడం లేదని తెలుస్తోంది. ఇప్పటికే ఉప ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే తనకు సీఎం పదవి దక్కలేదని అలక పాన్పు మీదనే ఉన్నారు. బీజేపీకి అంటిముట్టనట్టే వ్యవహరిస్తున్నారు. ఏ క్షణంలో ‘మహా’ బాంబు పేలుతుందో అంతుపట్టడం లేదు. మహాయుతి నేతల మధ్య సఖ్యత లేదని మాత్రం స్పష్టంగా అర్థమవుతోంది. దీనికి తాజాగా సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తీసుకున్న నిర్ణయం.. నిప్పుకు ఆజ్యం పోసినట్టు కాబోతున్నది.
ఫడ్నవీస్ ప్రభుత్వం తాజాగా 20 మంది అధికార పార్టీ ఎమ్మెల్యేల వై కేటగిరీ భద్రతను కుదించేందుకు రంగం సిద్ధం చేసుకుంది. డిప్యూటీ సీఎం ఏక్ నాథ్ షిండే శివసేనకు చెందిన 20 మంది ఎమ్మెల్యేలకు వై సెక్యూరిటీని కుదించనున్నారు. బీజేపీ, అజిత్ పవార్ వర్గం ఎమ్మెల్యేలకు కూడా సెక్యూరిటీని తగ్గించనున్నారు. అయితే షిండే శివసేన కంటే తక్కువ సంఖ్యలో ఆ పార్టీల ఎమ్మెల్యేలు ఉన్నారు. రాష్ట్ర వనరుల దుర్వినియోగాన్ని అరికట్టడానికి ఫడ్నవీస్ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు, అందులో భాగంగానే ఈ చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. అలాగే గతంలో మహావికాస్ ఆఘాడీ కూటమి నుంచి కూడా కొందరు అధికార పార్టీలో చేరారు. వారికి కూడా సెక్యూరిటీని తగ్గించనున్నారు.
మూడు నెలల కిందట మహారాష్ట్రలో ‘మహాయుతి’ కూటమి ఘన విజయం సాధించినప్పటికీ ముఖ్యమంత్రి పదవి విషయంలో విభేదాలు ఏర్పడ్డాయి. బీజేపీకి స్పష్టమైన మెజారిటీ ఉండడంతో ఆ పార్టీ నేత ఫడ్నవీస్ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. దీంతో మాజీ సీఎం ఏక్ నాథ్ షిండే అలకబూనారు. అయినప్పటికీ పొత్తు విచ్ఛిన్నం కాకుండా ఉండటానికి అయిష్టంగానే బీజేపీకి సీఎం పదవి అప్పగించారు. అయినా కూడా ప్రతీ సందర్భంగా మూడు పార్టీల్లోని లుకలుకలు బయటపడుతూనే ఉన్నాయి.
రీసెంట్ గా ఇన్ చార్జి మంత్రుల నియామకంలోనూ అధికార కూటమిలో విభేదాలు తలెత్తాయి. రాయ్ గఢ్, నాసిక్ లకు ఇన్ చార్జుల నియామకంపై షిండే సేన అభ్యంతరం తెలపడంతో వాటికి బ్రేక్ పడింది. తాజాగా సెక్యూరిటీ కుదింపు విషయం మహాయుతి కుంపటిని మరింత రాజేయనుంది. మహారాష్ట్ర రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. ఎందుకంటే అక్కడి పార్టీలు సైద్ధాంతికతను పక్కనపెట్టేశాయి. రాజకీయ అవసరాల కోసం ఎవరితోనైనా అంటకాగే లక్షణాలను పునికిపుచ్చుకున్నాయ. మరి తాజా వివాదంతో షిండే ఏ నిర్ణయం తీసుకోబోతున్నారో చూడాలి. సామరస్యంగా సర్దుకుంటారా? లేదా సమరభేరి మోగిస్తారా అనేది ఆసక్తికరంగా మారింది.
ఈ విభేదాలపై శివసేన ఉద్ధవ్ థాకరే ఎంపీ ప్రియాంక చతుర్వేది తీవ్ర విమర్శలు గుప్పించారు. సీఎం పదవి రాకపోవడంతో షిండే అసంతృప్తిగా ఉన్నారని చెప్పుకొచ్చింది. దీంతో ఫడ్నవీస్ తో కలిసి వేదిక పంచుకోవడానికి షిండేకు మనసొప్పడం లేదని ఎద్దేవా చేశారు.