Begin typing your search above and press return to search.

ఇదో రకం మాయ ధాన్యం కొనుగోలులో మిల్లర్ల దందా

గత ప్రభుత్వంలో ధాన్యం రైతులకు సక్రమంగా డబ్బు చెల్లించే విషయంలో అనేక ఆరోపణలు వచ్చాయి. సకాలంలో ధాన్యం డబ్బులు అందక రైతుల నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తమయ్యేది.

By:  Tupaki Desk   |   28 Dec 2024 6:29 AM GMT
ఇదో రకం మాయ ధాన్యం కొనుగోలులో మిల్లర్ల దందా
X

ఏపీలో రేషన్ బియ్యం కొనుగోళ్లు, విదేశాలకు ఎగుమతి చేయడంలో పేరుమోసిన మిల్లర్లు.. ఇప్పుడు కొత్తరకం దందాకు తెరలేపినట్లు ప్రభుత్వం గుర్తించింది. గతంలో ఎన్నడూ లేనట్లు ధాన్యం విక్రయించిన 24 గంటల్లో రైతులకు డబ్బు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం మిల్లర్లకు వరంగా మారిందని అంటున్నారు. రైతులకు ఠంచనుగా డబ్బు అందుతుండంతో.. కొంతమంది మిల్లర్లు తమ తెలివితేటలతో జేబులో పైసా తీయకుండా ప్రభుత్వ డబ్బుతో వ్యాపారం చేస్తూ కోట్లు సంపాదిస్తున్నారు.

ఏపీలో ధాన్యం కొనుగోలుపై చంద్రబాబు ప్రభుత్వం చాలా పకడ్బందీ చర్యలు తీసుకుంది. గత ప్రభుత్వంలో ధాన్యం రైతులకు సక్రమంగా డబ్బు చెల్లించే విషయంలో అనేక ఆరోపణలు వచ్చాయి. సకాలంలో ధాన్యం డబ్బులు అందక రైతుల నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తమయ్యేది. ఇలాంటి పరిస్థితి కూటమి ప్రభుత్వంలో తలెత్తకూడదని సీఎం చంద్రబాబు భావించారు. ధాన్యం సేకరణకు నిధులు అందుబాటులో ఉంచారు.

దీంతో రెండు నెలల కాలంలో 24,25,204 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఇందుకోసం రూ.5,584 కోట్లు చెల్లించారు. ఇంటి నుంచి మిల్లుకు ధాన్యం చేరిన గంటల వ్యవధిలోనే డబ్బు పడిపోతుండటంతో రైతులు కూడా దళారులను కాదని ప్రభుత్వానికే నేరుగా విక్రయిస్తున్నారు. అయితే కొంతమంది మిల్లర్లు తమ మాయాజాలంతో ధాన్యం డబ్బును కొట్టేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

గంటల వ్యవధిలో డబ్బు వచ్చిపడుతుండటంతో చాలా మంది మిల్లర్లు కొద్దిమంది దళారులతో కుమ్మక్కై ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నారు. ధాన్యం సేకరించకుండానే రైతుల పేర్లను నమోదు చేస్తూ వారి నుంచి ధాన్యం కొనుగోలు చేస్తున్నట్లు లెక్కలు చూపుతూ ప్రభుత్వం నుంచి డబ్బు కొట్టేస్తున్నారు. ఈ డబ్బుతో పక్క రాష్ట్రాల నుంచి ధాన్యం కొంటూ ప్రభుత్వానికి లెవీ ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో ఎక్కువగా ఈ దందా కనిపిస్తోంది.

ఉత్తరాంధ్రలోని మూడు ఉమ్మడి జిల్లాలకు ఒడిశాతో సరిహద్దు ఉంది. ఈ మూడు జిల్లాలకు చెందిన చాలా రైసుమిల్లులు రాజకీయ నాయకుల చేతిలో ఉన్నాయి. వీరు తమ పలుకుబడితో ధాన్యం సేకరించకుండానే రైతుల నుంచి తమ మిల్లుకు ధాన్యం వచ్చాయని తప్పుడు లెక్కలు చూపుతున్నారు. దీనివల్ల వ్యాపారులు, దళారుల అకౌంట్లలో డబ్బు పడుతోంది. ప్రభుత్వం క్వింటాకు రూ.2360 చెల్లిస్తోంది. ధాన్యం అమ్మిన వెంటనే రూ.2300 చెల్లిస్తుంది. రూ.60 ట్రాన్స్ పోర్టు చార్జిల కింద కొద్ది రోజుల తర్వాత చెల్లిస్తారు. అయితే ఈ క్రాప్ కింద నమోదైన రైతులకే ఈ డబ్బు అందుతుంది.

వాస్తవానికి రాష్ట్రంలో చాలా మంది రైతులు డి.పట్టా భూములు, కౌలుకు తీసుకున్న పొలాల్లో ధాన్యం పండిస్తున్నారు. డి.పట్టా భూములకు ఈ.క్రాప్ అమలు చేయడం లేదు. అదేవిధంగా కౌలు భూముల్లో పండించిన ధాన్యం డబ్బులు రైతు అకౌంటుకి చెల్లస్తారు. దీంతో కౌలు రైతులు భయపడి ప్రైవేటు వ్యాపారులకు ధాన్యం విక్రయిస్తున్నారు. ఇలా లక్షల మంది రైతులు తప్పనిసరిగా ప్రైవేటు వ్యాపారులు, దళారులు, మిల్లర్లనే ఆశ్రయించాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇది మిల్లర్లకు వరంగా మారుతోంది. ప్రతి ఏడాది మిల్లర్లు ఎంత మొత్తం లెవీ ఇచ్చేది ప్రభుత్వంతో ముందుగా ఒప్పందం చేసుకుంటారు.

ఆ మేరకు ప్రభుత్వం రైతుల నుంచి చెల్లించిన ధాన్యంతోపాటు తాము ప్రైవేటుగా కొనుగోలు చేసిన ధాన్యాన్ని లెవీకి తరలిస్తారు. మిల్లర్లు ప్రైవేటుగా కొనుగోలు చేయడానికి సొంత డబ్బు వెచ్చించాల్సివుంటుంది. అయితే ఈ ఏడాది మాత్రం పూర్తిగా ప్రభుత్వ డబ్బుతోనే వ్యాపారం చేస్తున్నారు. ఉత్తరాంధ్రలో చాలా మంది మిల్లర్లు తమకు రైతుల నుంచి ధాన్యం రాకపోయినా, వచ్చినట్లు ఇన్వాయిస్లు పెట్టి రైతుల అకౌంట్లలో డబ్బు జమ చేయిస్తున్నారు.

ఈ డబ్బును తీసుకుని పక్క రాష్ట్రంలోనూ డీ.పట్టా, కౌలు భూముల్లో పండించిన ధాన్యం కొనుగోలు చేస్తూ హాయిగా వ్యాపారం చేసుకుంటున్నారు. ఇలా ఒక్కో రైసు మిల్లరు కనీసం రూ.కోటి సంపాదించేలా ప్లాన్ చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. క్షేత్ర స్థాయిలో అధికారులకు ఈ దందాపై అవగాహన ఉన్నా, ప్రభుత్వ లక్ష్యాలను చేరుకోడానికి వారు కూడా సహకరిస్తున్నారు. ధాన్యం సేకరించకపోయినా, ముందుగా ధాన్యం మిల్లుకు చేరినట్లు ఇన్వాయిస్లు జారీ చేసి డబ్బు విత్ డ్రా చేస్తూ ప్రభుత్వ కళ్లకు గంతలు కడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై ప్రభుత్వం ప్రత్యేకంగా దర్యాప్తు చేస్తే రేషన్ బియ్యం బాగోతంలానే ధాన్యం అక్రమాలు బయట పడే అవకాశం ఉందంటున్నారు.