చేపలు పట్టడం నేర్పుతాం: గవర్నర్
రాష్ట్రంలో ప్రజలకు నైపుణ్యాలను నేర్పించడం ద్వారా.. పేదలను ఉన్నతస్థాయికి తీసుకురావాలన్న ఉద్దేశం ప్రభుత్వానికి ఉందని గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ తెలిపారు.
By: Tupaki Desk | 24 Feb 2025 6:07 AM GMTరాష్ట్రంలో ప్రజలకు నైపుణ్యాలను నేర్పించడం ద్వారా.. పేదలను ఉన్నతస్థాయికి తీసుకురావాలన్న ఉద్దేశం ప్రభుత్వానికి ఉందని గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ తెలిపారు. పెద్దలు చెప్పినట్టు ఆకలితో ఉన్నవాడికి చేపలు ఇస్తే.. ఆ పూటకు కడుపు నిండుతుందని, కానీ, చేపలు పట్టడం నేర్పిస్తే.. అతని జీవితాంతం ఆకలి తీరుతుందన్న సూత్రాన్ని తాము పాటిస్తున్నామని.. గవర్నర్ పేర్కొన్నారు. ''విజనరీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదిశగా కృషి చేస్తున్నారు'' అని తెలిపారు.
'పీ-4' అనే విప్లవాత్మక విధానం తీసుకురావడం ద్వారా రాష్ట్రంలో ప్రజలు-ప్రభుత్వం-ప్రైవేటు-పబ్లిక్‌ను మరింత భాగస్వామ్యం చేస్తున్నట్టు గవర్నర్ పేర్కొన్నారు. తద్వారా రాష్ట్రం అభివృద్ది పథంలో ముందు కు సాగుతుందని చెప్పారు. పించన్లను రూ.3000 నుంచి రూ.4000లకు పెంచామని తద్వారా పేదలు, పింఛను దారుల ముఖాల్లో సంతోషాన్ని చూస్తున్నామని చెప్పారు. ప్రతి నియోజకవర్గంలోనూ నైపుణ్యాభి వృద్ధి కేంద్రాలను అభివృద్ధి చేస్తున్నట్టు తెలిపారు.
జనాభా సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో వారి ఆరోగ్యం, ఆహారం విషయాలను కూడా ప్రభుత్వం కీలకం గా భావిస్తున్నట్టు తెలిపారు. ఆరోగ్యకరమైన సమాజాన్ని సృష్టించాలన్నదే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని గవర్నర్ పేర్కొన్నారు. అదేవిధంగా విద్యావ్యవస్థలోనూ సంస్కరణలు తీసుకువస్తున్నామని తెలిపారు. దీనిలో భాగంగా డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం ద్వారా నాణ్యమైన, పౌష్టికాహారాన్ని విద్యార్థులకు అందిస్తున్నట్టు పేర్కొన్నారు. ఉన్నత విద్యలో ప్రపంచస్థాయి ప్రమాణాలు అమలు చేస్తున్నామని తెలిపారు.
ప్రతిభ ఆధారంగా 9 యూనివర్సిటీలకు వీసీలను నియమించామని.. ఇది పూర్తిగా ప్రతిభను, వారి అర్హత లను దృష్టిలో పెట్టుకుని చేసిన నియామకాలేనని గవర్నర్ తెలిపారు. 'డెమోగ్రాఫిక్ పాలసీ' ద్వారా ప్రజల కు మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నట్టు పేర్కొన్నారు. 'తల్లికి వందనం' కార్యక్రమం అమలు చేయడం ద్వారా.. పేద కుటుంబాలకు చెందిన తల్లులకు సాయం చేస్తామని చెప్పారు. సూపర్ సిక్స్ పథకాలను అమలు చేసేందుకు తమ ప్రభుత్వం సంసిద్ధంగానే ఉందన్నారు.