Begin typing your search above and press return to search.

మరో ట్విస్ట్‌ ఇచ్చిన గవర్నర్‌... మొదటికొచ్చిన ఆర్టీసీ బిల్లు కథ!

ఈ సందర్భంగా గవర్నర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజ్ భవన్ కు నిరసనగా రావడం మాత్రమే కాదు

By:  Tupaki Desk   |   5 Aug 2023 2:26 PM GMT
మరో ట్విస్ట్‌  ఇచ్చిన గవర్నర్‌... మొదటికొచ్చిన ఆర్టీసీ బిల్లు కథ!
X

ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనానికి సంబంధించిన బిల్లు విషయంలో సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. గవర్నర్ లేవనెత్తిన ఐదు ప్రశ్నలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇచ్చినప్పటికీ దానితో గవర్నర్ సంతృప్తి చెందలేదని తెలుస్తోంది. ఇదే సమయంలో మరో ట్విస్ట్ ఇచ్చారు తెలంగాణ గవర్నర్ తమిళ సై!

అవును... ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనానికి సంబంధించి ప్రభుత్వం పంపిన బిల్లుపై గవర్నర్ తమిళి సై ఐదు అభ్యంతరాలను వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఇలా గవర్నర్ లేవనెత్తిన ప్రశ్నలకు తెలంగాణ ప్రభుత్వం వివరణ ఇచ్చింది. దీంతో గవర్నర్ నుండి ఈ బిల్లుకు ఆమోదం వస్తుందనుకున్న క్రమంలో.. గవర్నర్ మరోసారి మరికొన్ని అభ్యంతరాలను వ్యక్తం చేశారు.

ఆర్టీసీకి చెందిన భూములు, భవనాలు ఎన్ని ఉన్నాయి?

డిపోలవారీగా ఉద్యోగుల సంఖ్య ఎంత?

పర్మినెంట్‌ కాని ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తారా?

అంటూ తాజాగా మరో మూడు ప్రశ్నలకు ప్రభుత్వం ముందు ఉంచారు తెలంగాణ రాష్ట్ర గవర్నర్. దీంతో గవర్నర్‌ సంధించిన ప్రశ్నలపై ప్రభుత్వం సమాధానాలు సిద్ధం చేస్తోందని తెలుస్తోంది. ఈ సందర్భంగా గవర్నర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజ్ భవన్ కు నిరసనగా రావడం మాత్రమే కాదు.. రాష్ట్ర ప్రభుత్వాన్నీ డిమాండ్ చేయాలి అన్నట్లుగా కొన్ని కామెంట్లు చేశారు.

కాగా... తెలంగాణ ప్రభుత్వం పంపించిన ఆర్టీసీ బిల్లుపై గవర్నర్‌ సంతకం చేయాలంటూ శనివారం ఉదయం ఆర్టీసీ కార్మికులు రాజ్‌ భవన్‌ ముట్టడించిన సంగతి తెలిసిందే. నెక్లెస్‌ రోడ్ మీదుగా ర్యాలీగా తరలివచ్చిన వేలాది మంది కార్మికులు రాజ్‌ భవన్‌ ముందు బైఠాయించారు. దీంతో కొంతమంతి కార్మిక సంఘాల నేతలతో వీడియో కాన్ ఫరెన్స్ లో మాట్లాడిన గవర్నర్‌.. తాను ఎందుకు బిల్లుకు ఆమోదం తెలపలేదో వివరించారు.

ఈ సందర్భంగా... "నిన్న బిల్లు పంపి ఇవ్వాళ సంతకం కావాలంటే కరెక్ట్ కాదు.. నేను ఆర్టీసీ కార్మికుల భవిష్యత్ కోసమే ప్రభుత్వాన్ని క్లారిటీ అడుగుతున్నాను.. ఏ బిల్లులోలైనా నిబంధనల ప్రకారమే నేను వెళ్తున్నాను.. రాజ్యాంగం ప్రకారమే ప్రభుత్వాన్ని క్లారిటీ అడుగుతున్నాను" అని గవర్నర్ క్లారిటీ ఇచ్చారు.

ఇదే క్రమంలో... ప్రతీ బిల్లుకు కొన్ని రూల్స్ ఉంటాయని తెలిపిన గవర్నర్... కార్మికులకు వివిధ రూపాల్లో రావాల్సిన బకాయిలు, నిధుల గురించి ప్రభుత్వాన్ని అడిగినట్లు తెలిపారు. ఈ సందర్భంగా తాను పీపుల్ ఫ్రెండ్లి గవర్నర్ అని చెప్పుకున్న తమిళ సై... బిల్లుపై రాజ్ భవన్ ఆఫీస్ కు ఎలాగైతే నిరసనగా వచ్చారో.. ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేయండి అని సూచించారు.

ఇందులో భాగంగా... బాధ్యతాయుత గవర్నర్ వ్యవస్థలో భాగంగానే ఆర్టీసీ ఉద్యోగుల న్యాయమైన అంశాల విషయంలో స్పష్టత కోసమే బిల్లును ఆపినట్లు తెలిపిన తమిళ సై... తనకు వేరే ఉద్దేశం లేదని తెలిపారు. అదేవిదంగా... భవిష్యత్ ఎలాంటి సమస్యలు రాకూడదనే బిల్లులో స్పష్టత కోరుతున్నట్లు ఆమె యూనియన్‌ నేతలను ఉద్దేశించి వ్యాఖ్యానించినట్లు సమాచారం.

కాగా... ఇప్పుడు తాజాగా అడిగిన మూడు ప్రశ్నల కంటే ముందు ఐదు అంశాలపై వివరణ కోరిన సంగతి తెలిసిందే.

ఆర్టీసీలో కేంద్ర గ్రాంట్లు, వాటాలు, లోన్ల వివరాలు లేవు!

ఉద్యోగుల ప్రయోజనాలు ఎలా కాపాడతారు?

ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వారికి పింఛన్‌ ఇస్తారా?

విజభన చట్టం ప్రకారం ఆర్టీసీ స్థితిని మార్చడంపై వివరాలు లేవు!

పదోన్నతులు, క్యాడర్‌ నార్మలైజేషన్‌ లో న్యాయం ఎలా చేస్తారు?

వంటి ప్రశ్నలు సంధించిన సంగతి తెలిసిందే. దీంతో ఉద్యోగులను మాత్రమే ప్రభుత్వంలోకి తీసుకుంటున్నామని.. సంస్థ యథాతథంగా కొనసాగుతుందని ప్రభుత్వం స్పష్టం చేయడంతోపాటు అన్ని సందేహాలకూ వివరణ ఇచ్చింది. ఈ క్రమంలో మరో మూడు ప్రశ్నలకు ప్రభుత్వానికి పంపించారు గవర్నర్.

మరోపక్క రేపటితో అసెంబ్లీ సమావేశాలు ముగియనున్న నేపథ్యంలో... ఆర్టీసీ బిల్లు క్లియరెన్స్‌ అవుతుందా.. లేదా.. అనే ఉత్కంఠ అటు ఉద్యోగుల్లోనూ, ఇటు ప్రభుత్వంలోనూ నెలకొంది.