Begin typing your search above and press return to search.

బీజేపీ జంపింగ్ నేత‌ల‌కు తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ షాక్‌

దీంతో... బీజేపీతో అనుబంధం ఉండి బీఆర్ఎస్‌లో చేరిన నేత‌ల‌కు కావాల‌నే ఎమ్మెల్సీ తిర‌స్క‌రిస్తూ గ‌వ‌ర్న‌ర్ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లుగా ఉంద‌ని ప‌లువురు నెటిజ‌న్లు కామెంట్ చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   25 Sep 2023 2:35 PM GMT
బీజేపీ జంపింగ్ నేత‌ల‌కు తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ షాక్‌
X

తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై మ‌రోమారు వార్త‌ల్లో వ్య‌క్తిగా నిలిచారు. మాజీ ఎమ్మెల్యే కుర్రా సత్యనారాయణ, బీఆర్‌ఎస్‌ పార్టీ నేత దాసోజు శ్రవణ్‌ను గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీలుగా పంపాలని ప్రభుత్వం నిర్ణయించి ఫైలు పంపించ‌గా, గ‌వ‌ర్న‌ర్ వారికి నో చెప్పారు. స‌హ‌జంగానే ఈ నిర్ణ‌యం 'అధికారిక ప్ర‌క్రియ' అనే ద‌శ‌ను దాటుకొని రాజ‌కీయ రంగు పులుముకుంది. ఇటు మీడియా ముఖంగా అటు సోష‌ల్ మీడియాలోనూ గ‌వ‌ర్న‌ర్‌పై బీఆర్ఎస్ నేత‌లు, మ‌ద్ద‌తు దారులు ఆరోపిస్తున్నారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు అధ్యక్షతన జరిగిన ఈ ఏడాది జులై 31వ తేదీన‌ మంత్రివర్గ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కుర్రా సత్యనారాయణ, బీఆర్‌ఎస్‌ పార్టీ నేత దాసోజు శ్రవణ్‌ను గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీలుగా పంపాలని నిర్ణ‌యించారు. ఎమ్మెల్సీలు ఫారూక్‌ హుస్సేన్‌, రాజేశ్వరరావు పదవీకాలం ముగియడంతో వారి స్థానాల్లో దాసోజు శ్ర‌వ‌ణ్‌, కుర్రా స‌త్య‌నారాయ‌ణ‌ను ఎమ్మెల్సీలుగా ప్రతిపాదిస్తూ క్యాబినెట్‌ నిర్ణయం తీసుకొని గ‌వ‌ర్న‌ర్ ఆమోదం కోసం పంపించారు. అయితే, తాజాగా వారిద్ద‌రి నియామ‌కానికి గ‌వ‌ర్న‌ర్ నో చెప్పారు.

ఎమ్మెల్సీ నియామ‌కం తిర‌స్క‌ర‌ణ‌కు గురైన ఈ ఇద్ద‌రు నేత‌ల‌కు బీజేపీలో ప‌ని చేసిన అనుభ‌వం ఉండ‌టం తో కావాల‌నే నిర్ణ‌యం తీసుకున్నార‌ని సోష‌ల్ మీడియాలో ప‌లువురు కామెంట్ చేస్తున్నారు. సంగారెడ్డికి చెందిన కుర్రా సత్యనారాయణ జనతాపార్టీ, బీజేపీలో పనిచేశారు. 1999లో టీడీపీ-బీజేపీ పొత్తులో భాగంగా సంగారెడ్డి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన సత్యనారాయణ 2018 వరకు బీజేపీలోనే ఉన్నారు. ఆ పార్టీ తెలంగాణ వ్యతిరేక వైఖరికి నిరసనగా రాజీనామా చేసి బీఆర్‌ఎస్‌లో చేరారు.ఇక తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన డాక్టర్‌ దాసోజు శ్రవణ్ అనంత‌రం కాంగ్రెస్‌లో ఆ త‌ర్వాత బీజేపీలో చేరి ఇటీవ‌లే తిరిగి బీఆర్ఎస్‌లోకి వ‌చ్చారు. తాజాగా ఆయ‌న‌కు ఎమ్మెల్సీ అవ‌కాశం ఇవ్వ‌గా గ‌వ‌ర్న‌ర్ ఆయ‌న అభ్య‌ర్థిత్వాన్ని తిర‌స్క‌రించారు. దీంతో... బీజేపీతో అనుబంధం ఉండి బీఆర్ఎస్‌లో చేరిన నేత‌ల‌కు కావాల‌నే ఎమ్మెల్సీ తిర‌స్క‌రిస్తూ గ‌వ‌ర్న‌ర్ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లుగా ఉంద‌ని ప‌లువురు నెటిజ‌న్లు కామెంట్ చేస్తున్నారు.

కాగా, గ‌వర్న‌ర్ నిర్ణ‌యంపై బీఆర్ఎస్ ముఖ్య నేత‌, రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హ‌రీశ్‌రావు తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేశారు. త‌మిళిసై గ‌వ‌ర్న‌ర్‌లా కాకుండా బీజేపీ ప్ర‌తినిధిలా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని మంత్రి మండిప‌డ్డారు. కేబినెట్ ఆమోదించిన ఎమ్మెల్సీ అభ్య‌ర్థిత్వాల‌ను గ‌వ‌ర్న‌ర్ ఎలా తిరస్క‌రిస్తారు? అని ప్ర‌శ్నించారు. త‌మిళిసై ఆది నుంచి తెలంగాణ ప్ర‌గ‌తికి వ్య‌తిరేకంగా ప‌ని చేస్తున్నారు. ఇప్ప‌టికే ప‌లు కీల‌క బిల్లులు గ‌వ‌ర్న‌ర్ పెండింగ్‌లో పెట్టారు. గ‌వ‌ర్న‌ర్ ప్ర‌జాస్వామ్యాన్ని అప‌హాస్యం చేస్తున్నారు. సుబ్ర‌హ్మ‌ణ్య స్వామిని రాజ్య‌స‌భ‌కు ఎలా నామినేట్ చేశారో గ‌వ‌ర్న‌ర్ చెప్పాల‌ని మంత్రి హ‌రీశ్‌రావు డిమాండ్ చేశారు.