Begin typing your search above and press return to search.

టీటీడీ బోర్డు లేకుండానే ఈసారి బ్రహ్మోత్సవాలు ?

టీటీడీ బోర్డు లేదు, గత ప్రభుత్వం నియమించిన బోర్డు రాజీనామా చేసింది.

By:  Tupaki Desk   |   12 Sep 2024 4:05 AM GMT
టీటీడీ బోర్డు లేకుండానే ఈసారి బ్రహ్మోత్సవాలు ?
X

టీటీడీ బోర్డు లేదు, గత ప్రభుత్వం నియమించిన బోర్డు రాజీనామా చేసింది. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చి మూడు నెలలు అయింది. దాంతో బోర్డు వేయాల్సి ఉంది. కానీ అది జాప్యం అవుతోంది. ఇంతలో తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు రంగం సిద్ధం అవుతోంది.

అక్టోబర్ 3 నుంచి స్వామి వారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరగబోతున్నాయి. దానికి సంబంధించిన ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. సమయం చూస్తే గట్టిగా ఇరవై రోజులు కూడా లేదు. ఇంతలో తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డుని నియమించి కార్యవర్గాన్ని ఏర్పాటు చేయడం సాధ్యమేనా అంటే పాలకులు అనుకుంటే సాధ్యమే. కానీ ఈ మధ్యనే బెజవాడ వరదలతో సర్కార్ పుణ్యకాలం అంతా గడచిపోయింది. దాంతో పాటు నామినేటెడ్ పదవుల విషయం కూడా కొంత కాలం పక్కన పెట్టారు అని వార్తలు వస్తున్నాయి.

ఇపుడు టీటీడీ బోర్డు ని ముందుకు తెస్తే మిగిలిన పోస్టులకు ఒత్తిడి పెరుగుతుంది. తేనే తుట్టెని కోరి కదిల్చినట్లు అవుతుంది. దాంతో ఈ అతి తక్కువ సమయంలో బోర్డు నియామకం ఉండకపోవచ్చు అని అంటున్నారు. నిజానికి టీటీడీ చైర్మన్ పోస్ట్ అంటే అత్యంత కీలకమైన పదవి అది.

అందరికీ దాని మీద కన్ను ఉంది. టీడీపీ నుంచి చాలా పేర్లు వినిపించాయి. కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు, అలాగే ఒక ప్రభుత్వం తెలుగు టీవీ చానల్ అధిపతి అని అన్నారు. ఇంతలో నెల్లూరు లోక్ సభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి సతీమణి కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి అని కూడా అన్నారు.

అదే విధంగా జనసేన నుంచి పవన్ కళ్యాణ్ సోదరుడు మెగా బ్రదర్ నాగబాబు పేరు కూడా ఆ మధ్యన చర్చకు వచ్చింది. కానీ నాగబాబు ఆ పదవి విషయంలో తాను రేసులో లేనని తేల్చేశారు. ఇంకోవైపు చూస్తే బీజేపీ నుంచి కూడా టీటీడీ చైర్మన్ పదవి విషయంలో పోటీ ఉంది అని అంటున్నారు

ఇలా మూడు పార్టీలలో ఈ పదవి మీద కన్ను ఉంది. దాంతో పాటు కార్యవర్గాన్ని నియమించడం కూడా కత్తి మీద సాముగా ఉంది అందరూ కూర్చోవాలి. ఉమ్మడిగా ఒక డెసిషన్ కి రావాలి.అది ఇప్పట్లో అవుతుందా అన్నదే చర్చగా ఉంది.

అందుకే ఈసారి బ్రహ్మోత్సవాలు పాలక మండలి లేకుండానే జరుగుతాయని అంటున్నారు. ఇప్పటికే టీటీడీకి ఈవోగా జే శ్యామలరావు ఉన్నారు. అలాగే అదనపు ఈవోగా వెంకన్న చౌదరి ఉన్నారు. ప్రస్తుతం ఈ ఇద్దరే బోర్డు లేకపోయినా టీటీడీ పాలన అంతా చూసుకుంటున్నారు.

అదే సమయంలో బ్రహ్మోత్సవాలు ఎలా నిర్వహించాలన్న దాని మీద వారే కసరత్తు చేస్తున్నారు. నిజానికి బోర్డు ఉంటే పాలక మండలి సమావేశాలు నిర్వహించి బ్రహ్మోత్సవాలు మీద కీలక నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే ముఖ్యమంత్రిని చైర్మన్ స్వయంగా వెళ్ళి ఆహ్వాన పత్రికను అందించింది ఉత్సవాలకు పిలుస్తారు.

ఇపుడు ఆ పని కూడా టీటీడీ అధికారులే చేస్తారు అని అంటున్నారు. టీటీడీలో జరుగుతున్న కార్యక్రమాలు చూస్తే బోర్డు లేకపోయినా దివ్యంగా స్వామి వారి బ్రహ్మోత్సవాలను నిర్వహించి శభాష్ అనిపించుకోవాలని చూస్తున్నారు. మొత్తానికి టీడీపీ కూటమి ఏలుబడిలో తొలిసారి వచ్చిన బ్రహ్మోత్సవాలలో పాలకమండలి హవా లేకుండానే అన్నీ జరిగిపోతున్నాయని అంటున్నారు. సో అదన్న మాట మ్యాటర్.